న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ‘సంతోష్ ట్రోఫీ’ ఫైనల్ రౌండ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 14 నుంచి 31 వరకు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) సోమవారం ప్రకటించింది. చివరిసారి హైదరాబాద్ 1967లో సంతోష్ ట్రోఫీ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది.
ఈసారి ఫైనల్ రౌండ్ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడతాయి. ఇందులో తొమ్మిది గ్రూప్ విజేతలుగా కాగా... గత ఏడాది చాంపియన్ సర్వీసెస్, రన్నరప్ గోవా జట్లు ఉన్నాయి. 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు డెక్కన్ ఎరీనాలో జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్‌లు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తారు.
రెండు గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు డిసెంబర్ 26, 27వ తేదీల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతాయి. సెమీఫైనల్స్ డిసెంబర్ 29న, ఫైనల్ డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77 సార్లు జరిగింది. పశ్చిమ బెంగాల్ జట్టు రికార్డుస్థాయిలో 32 సార్లు విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment