![Hyderabad Football Legend Mohammed Habib Passed Away Know Achievements - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/16/Football-Legend-Mohammed-Habib.jpg.webp?itok=vImSCReY)
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, 70వ దశకంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న మొహమ్మద్ హబీబ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. హైదరాబాద్‌కు చెందిన హబీబ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
18 ఏళ్ల పాటు అక్కడే
1970లో మరో హైదరాబాదీ సయ్యద్ నయీముద్దీన్ నాయకత్వంలో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో హబీబ్ కీలక సభ్యుడు. అయితే హబీబ్ కెరీర్ అత్యుత్తమ దశ కోల్‌కతాలోనే గడిచింది. 1966నుంచి 1984 వరకు దాదాపు 18 ఏళ్లు పాటు ఆయన అక్కడ ప్రధాన ఆటగాడిగా కొనసాగడం విశేషం.
చిరస్మరణీయ క్షణం అదే
మిడ్‌ఫీల్డర్‌గా మూడు ప్రఖ్యాత క్లబ్‌లు మోహన్‌బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్టింగ్‌లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. హబీబ్ కెరీర్‌లో చిరస్మరణీయ క్షణం 1977లో వచ్చింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో హబీబ్ మోహన్‌బగాన్ తరఫున బరిలోకి దిగగా...ప్రత్యర్థి టీమ్ కాస్మోస్ క్లబ్‌లో ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లు పీలే, కార్లోస్ ఆల్బర్టో ఉన్నారు.
నాడు పీలే ప్రత్యేక అభినందనలు
మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగియగా, ఇందులో హబీబ్ కూడా ఒక గోల్ చేశారు. మ్యాచ్ అనంతరం పీలే ప్రత్యేకంగా హబీబ్‌ను పిలిచి ఆయన ఆటను ప్రశంసించడం విశేషం. ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్ మూడు వేర్వేరు ఫైనల్ మ్యాచ్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ హబీబ్ రికార్డు నిలిచి ఉంది. జాతీయ ఫుట్‌బాల్ టోర్నీ ‘సంతోష్ ట్రోఫీ’ని ఏకైక సారి ఆంధ్రప్రదేశ్ జట్టు 1966లో గెలుచుకుంది.
పదేళ్ల పాటు భారత జట్టుకు ఆడి
నాడు ఏపీ తరఫున చెలరేగిన హబీబ్...ఫైనల్లో బెంగాల్‌నే ఓడించడం ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. పదేళ్ల పాటు (1965–75) భారత జట్టు తరఫున ఆడిన హబీబ్‌ను కేంద్ర ప్రభుత్వం 1980లో ‘అర్జున’ పురస్కారంతో గౌరవించింది. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత టాటా ఫుట్‌బాల్ అకాడమీకి, భారత్ ఫుట్‌బాల్ సంఘానికి చెందిన అకాడమీకి కూడా కోచ్‌గా వ్యవహరించారు.
చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికా సిరీస్ నుంచి కెప్టెన్ ఔట్..!
Comments
Please login to add a commentAdd a comment