హాంగ్జూ (చైనా): ఆసియా క్రీడల కోసం ఫుట్‌బాల్ జట్టునే పంపడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన...నేరుగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ కోచ్ లేఖ...చివరకు గ్రీన్ సిగ్నల్...అత్యుత్తమ ఆటగాళ్లను ఇవ్వలేమంటూ ఐఎస్‌ఎల్ జట్ల కొర్రీలు...ఆఖరి నిమిషంలో తృతీయ శ్రేణి జట్టు ఎంపిక...కనీసం టీమ్ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు కూడా రాసుకోలేని స్థితి... ఇన్ని అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు భారత ఫుట్‌బాల్ జట్టు సోమవారం సాయంత్రం చైనా గడ్డపై అడుగు పెట్టింది.
కనీసం ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ లేదు...16 గంటల్లోనే మ్యాచ్ బరిలోకి...సబ్‌స్టిట్యూట్‌లుగా దించేందుకు తగినంత మంది కూడా బెంచీపై లేరు... చివరకు ఊహించినట్లుగానే ప్రతికూల ఫలితం వచ్చింది. తొలి పోరులో ఆతిథ్య చైనా చేతుల్లో చిత్తుగా ఓడి నిరాశను మిగిల్చింది. అధికారికంగా ఆసియా క్రీడలు ఈ నెల 23నుంచి ప్రారంభం అవుతున్నా...కొన్ని ఈవెంట్లు ముందే మొదలైపోయాయి.
గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో చైనా 5–1 గోల్స్ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 1–1తో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా...రెండో అర్ధభాగంతో నాలుగు గోల్స్‌తో చైనా చెలరేగింది. చైనా తరఫున జియావో టియాని (17వ నిమిషం), డీ వీజన్ (51వ నిమిషం), టావో కియాగ్లాంగ్ (72వ నిమిషం, 75వ నిమిషం), హావో ఫాంగ్ (90+2వ నిమిషం)లో గోల్స్ సాధించారు.
భారత్ తరఫున ఏకైక గోల్‌ను కనోలీ ప్రవీణ్ రాహుల్ (45+1వ నిమిషం) నమోదు చేశాడు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య తీవ్ర అంతరం కనిపించింది. 86 నిమిషాలు మైదానంలో ఉన్నా కెప్టెన్ సునీల్ ఛెత్రి ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు మొత్తం 90 నిమిషాలు ఫీల్డ్ ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. భారత్ ఈ గ్రూప్‌నుంచి ముందంజ వేయాలంటే తర్వాతి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, మయన్మార్‌లపై తప్పనిసరిగా గెలవాలి.
కంబోడియాను ఓడించి...
వాలీబాల్‌లో మాత్రం భారత్ గెలుపుతో శుభారంభం చేసింది. ఈ పోరులో భారత్ 3–0 (25–14, 25–13, 25–19) తేడాతో తమకంటే బాగా తక్కువ ర్యాంక్ గల కంబోడియాను ఓడించింది. గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్‌లో రేపు అత్యంత పటిష్టమైన కొరియాను భారత్ ఎదుర్కోనుంది.
Comments
Please login to add a commentAdd a comment