స్పెయిన్‌ను నిలువరించిన భారత్
1-1తో మ్యాచ్ డ్రా
ప్రపంచకప్ హాకీ
ది హేగ్: ప్రపంచ కప్ హాకీలో వరుసగా రెండు పరాజయాలతో నిరాశ పరిచిన భారత జట్టు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడింది. ఫలితంగా గురువారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరవగలిగింది. బెల్జియం, ఇంగ్లండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో చివరి నిమిషంలో గోల్ సమర్పించుకుని పరాజయాలను ఎదుర్కొన్న సర్దార్ సింగ్ సేన ఈ మ్యాచ్‌లో అలాంటి పొరపాట్లకు తావీయలేదు. ముఖ్యంగా గోల్ కీపర్ శ్రీజేష్ స్పెయిన్ గోల్స్ అవకాశాలను గండికొట్టడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు చురుకైన కదలికలకు మారుపేరైన స్పెయిన్ ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. దీంతో ఏడో నిమిషంలోనే వారికి పెనాల్టీ కార్నర్ లభించినా కీపర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత మరో పీసీని కూడా స్పెయిన్ విఫలం చేసుకోగా.. భారత్ 28వ నిమిషంలో తొలి గోల్ సాధించింది.
‘డి’ సర్కిల్ లోపల మన్‌దీప్ అందించిన పాస్‌ను రూపిందర్ సింగ్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ప్రథమార్ధం మరో నిమిషంలో ముగుస్తుందనగా రాక్ ఒలివా (34వ) గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. ఇక ద్వితీయార్ధంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. హోరాహోరీ పోరుతో ఆకట్టుకున్నారు. గోల్స్ కోసం ఎంత ప్రయత్నించినా ఇరువురికీ నిరాశే ఎదురైంది. 55వ నిమిషంలో స్పెయిన్‌కు లభించిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను కూడా శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకోగలిగాడు. ఆ తర్వాత కూడా ఎంతగా ప్రయత్నించినా ఇరు జట్ల నుంచి గోల్స్ నమోదు కాలేదు.