భారత్ బోణి
మలేసియాపై 3-2తో విజయం
ప్రపంచకప్ హాకీ
ది హేగ్: ప్రపంచకప్ హాకీలో భారత జట్టు బోణీ చేసింది. ఆకాశ్‌దీప్ అద్భుత ఆటతీరు కారణంగా మలేసియాతో శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను 3-2తో గెలుచుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. దీంతో 13వ నిమిషంలో భారత్ తరఫున జస్జిత్ సింగ్ కులార్ గోల్ చేశాడు. ప్రథమార్ధం 1-0 ఆధిక్యంతో ముగించినా 45వ నిమిషంలో మలేసియా తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. మొహమ్మద్ రజీ చేసిన ఈ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది.
అయితే మూడు నిమిషాల (49వ) అనంతరం రూపిందర్ పాల్ సింగ్ పాస్‌ను అందుకున్న ఆకాశ్‌దీప్ భారత్‌కు రెండో గోల్ అందించాడు. ఇదే జోరుతో ఇన్‌సైడ్ సర్కిల్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్ ఇచ్చిన పాస్‌ను 52వ నిమిషంలో గోల్‌గా మలిచి జట్టుకు 3-1 ఆధిక్యాన్ని అందించాడు. అయితే 61వ నిమిషంలో గోల్ కీపర్ శ్రీజేష్‌ను తాకి బయటకు వచ్చిన బంతిని మలేసియా ఆటగాడు మర్హన్ జలీల్ గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించినా ఫలితం లేకపోయింది. టోర్నీలో ఇప్పటిదాకా భారత్ రెండు ఓటములు, ఒక డ్రా, ఒక విజయం సాధించింది. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.