దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
ది హేగ్: ప్రపంచకప్‌కు ముందు భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. తమ చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 4-1 తేడాతో నెగ్గి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించనుంది. తొలి ప్రాక్టీస్ గేమ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన భారత్.. సఫారీలపై మాత్రం చెలరేగింది.
గాయాల కారణంగా రమణ్‌దీప్ సింగ్, తిమ్మయ్య జట్టుకు దూరమైనా మ్యాచ్‌లో భారత్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించగలిగింది. నాలుగింటిలో మూడు గోల్స్ పెనాల్టీ కార్నర్ ద్వారానే లభించడం విశేషం. వీటిని రూపిందర్ పాల్ సింగ్ (2), రఘునాథ్ సాధించగా, కెప్టెన్ సర్దార్ సింగ్ ఫీల్డ్ గోల్ చేశాడు. తొలి మ్యాచ్ ఆడిన లలిత్ ఉపాధ్యాయ్, యువరాజ్ వాల్మీకి ప్రదర్శనపై కోచ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 31 నుంచి జూన్ 15 వరకు జరిగే ప్రపంచకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను శనివారం బెల్జియంతో ఆడనుంది.