సిరీస్‌ సొంతం చేసుకోవాలని... | India will play the last T20 match against South Africa today | Sakshi
Sakshi News home page

సిరీస్‌ సొంతం చేసుకోవాలని...

Nov 15 2024 3:49 AM | Updated on Nov 15 2024 5:45 AM

India will play the last T20 match against South Africa today

నేడు దక్షిణాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్‌ ఆడనున్న భారత్‌

సమరోత్సాహంలో సూర్యకుమార్‌ బృందం

సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా

రాత్రి గం. 8:30 నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం  

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా గడ్డపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత క్రికెట్‌ జట్టు శుక్రవారం చివరిదైన నాలుగో టి20లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్‌ సారథ్యంలోని టీమిండియా... అదే జోరులో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. 

మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌ సమం చేయాలని సఫారీలు భావిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు 200 పైచిలుకు స్కోర్లు చేసిన భారత జట్టు... ఓడిన మ్యాచ్‌లోనూ మెరుగైన పోరాటం కనబర్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 25 టి20 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా... అందులో 23 విజయాలు సాధించి భళా అనిపించుకుంది. 

ఈ ఏడాదిలో భారత జట్టుకు ఇదే చివరి టి20 మ్యాచ్‌ కాగా... ఇందులోనూ విజయం సాధించాలని సూర్యకుమార్‌ బృందం తహతహలాడుతోంది. 2007 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచి విశ్వవిజేత కిరీటం నెగ్గిన వాండరర్స్‌ మైదానంలోనే ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇక్కడ సూర్యకుమార్‌ యాదవ్‌కు మంచి రికార్డు ఉంది. 

చివరిసారి వాండరర్స్‌లో ఆడిన మ్యాచ్‌లో సూర్య సెంచరీతో విజృంభించాడు. తాజా సిరీస్‌లో ఇప్పటికే భారత్‌ తరఫున సంజూ సామ్సన్, తిలక్‌ వర్మ శతకాలు బాదగా... ఆఖరి మ్యాచ్‌లో ఎవరు రాణిస్తారో చూడాలి.  

కలిసికట్టుగా కదంతొక్కితేనే.. 
తొలి మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో చెలరేగిన ఓపెనర్‌ సామ్సన్‌ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాగా... తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన మరో ఓపెనర్‌ అభిõÙక్‌ శర్మ మూడో టి20లో అర్ధశతకంతో మెరిశాడు. మొత్తంగా చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా... ప్లేయర్లంతా కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది. 

సెంచూరియన్‌ సెంచరీ హీరో తిలక్‌ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఖాయమే కాగా... కెపె్టన్‌ సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌తో మిడిలార్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే రింకూ సింగ్‌ బ్యాట్‌ నుంచి గత మెరుపులు కరువయ్యాయి. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి రింకూ కేవలం 28 పరుగులే చేశాడు. అతడి స్థాయికి ఇది చాలా తక్కువే. 

తగినన్ని బంతులు ఆడే అవకాశం రాలేదన్నది నిజమే అయినా... క్రీజులో ఉన్న కాసేపట్లోనే మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న రింకూ... చివరి పోరులో భారీ షాట్‌లతో విరుచుకుపడాల్సిన అవసరముంది. 

మూడో టి20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్టర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌కు మరోసారి అవకాశం దక్కవచ్చు. అర్ష్ దీప్  సింగ్‌ పేస్‌ బాధ్యతలు మోయనున్నాడు. అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నారు.  

మిల్లర్, క్లాసెన్‌ మెరిస్తేనే! 
టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా... ఈ సిరీస్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. గత మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తేసిన సమయంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సన్‌ భారీ షాట్లతో విరుచుకుపడి టీమిండియాను భయపెట్టాడు.

టాపార్డర్‌లో ఇలాంటి దూకుడు లోపించడంతోనే సఫారీ జట్టు ఇబ్బంది పడుతోంది. హెన్రిచ్‌ క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్‌లపై ఆ జట్టు అతిగా ఆధారపడుతోంది. ఈ ఇద్దరు ఒకటీ అరా మెరుపులు తప్ప... చివరి వరకు నిలకడగా రాణించలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. 

గత ఏడాది టీమిండియాతో తమ దేశంలో జరిగిన సిరీస్‌ను 1–1తో సమం చేసుకున్న దక్షిణాఫ్రికా... ఇప్పుడదే ఫలితం రాబట్టాలంటే శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో కేశవ్‌ మహరాజ్, సిమ్లెన్, కోట్జీ, మార్కో జాన్సన్‌ కీలకం కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement