జొహన్నెస్‌బర్గ్: వాండరర్స్ మైదానంలో భారత్ విజయహాసం చేసింది. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ , ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు శతకంతో చెలరేగాడు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. అంతర్జాతీయ టి20ల్లో నాలుగో సెంచరీ సాధించిన సూర్య... రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో సమంగా నిలిచాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. చివరకు ఆ జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే కుప్పకూలింది.
డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, మార్క్‌రమ్ (25) ఫర్వాలేదనిపించాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... తాజా ఫలితంతో 1–1తో టి20 సిరీస్ సమంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది.
సూర్య సిక్సర్ల జోరు...
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. గిల్ (12), తిలక్ వర్మ (0)లను వరుస బంతుల్లో కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్‌లో యశస్వి మాత్రం దూకుడు కనబరుస్తూ మార్క్‌రమ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. నాలుగో స్థానంలో వచ్చిన సూర్య తనదైన శైలిలో ఆరంభం నుంచి విరుచుకుపడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది.
పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులకు చేరింది. మధ్యలో కొంత నెమ్మదించిన యశస్వి 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఫెలుక్వాయో ఓవర్లో సూర్య చెలరేగిపోయాడు. వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మూడో వికెట్‌కు సూర్యతో 70 బంతుల్లోనే 112 పరుగులు జోడించిన అనంతరం యశస్వి వెనుదిరిగాడు.
రింకూ సింగ్ (14) ఈసారి ప్రభావం చూపలేకపోగా, జితేశ్ (4), జడేజా (4) విఫలమయ్యారు. మరోవైపు సూర్య మాత్రం తన జోరు కొనసాగించాడు. బర్జర్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన అతను షమ్సీ ఓవర్లోనూ 4, 6 కొట్టాడు. 55 బంతుల్లో సూర్య సెంచరీ పూర్తి కాగా, 20వ ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. చివరి 4 ఓవర్లలో టీమిండియాను కట్టడి చేయడంలో సఫలమైన సఫారీ టీమ్ 40 పరుగులే ఇచ్చింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) హెన్‌డ్రిక్స్ (బి) షమ్సీ 60; గిల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 8; తిలక్ (సి) మార్క్‌రమ్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) బ్రీట్‌కే (బి) విలియమ్స్ 100; రింకూ (సి) (సబ్) స్టబ్స్ (బి) బర్జర్ 14; జితేశ్ (హిట్‌వికెట్) (బి) విలియమ్స్ 4; జడేజా (రనౌట్) 4; అర్‡్షదీప్ (నాటౌట్) 0; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–29, 2–29, 3–141, 4–188, 5–194, 6–199, 7–199. బౌలింగ్: బర్జర్ 4–0–39–1, మార్క్‌రమ్ 1–0–15–0, కేశవ్ మహరాజ్ 4–0– 26–2, విలియమ్స్ 4–0–46–2, ఫెలుక్వాయో 3–0–33–0, షమ్సీ 4–0–38–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్‌డ్రిక్స్ (రనౌట్) 8; బ్రీట్‌కే (బి) ముకేశ్ 14; మార్క్‌రమ్ (సి) యశస్వి (బి) జడేజా 25; క్లాసెన్ (సి) రింకూ (బి) అర్‡్షదీప్ 5; మిల్లర్ (బి) కుల్దీప్ 35; ఫెరీరా (బి) కుల్దీప్ 12; ఫెలుక్వాయో (సి) అండ్ (బి) జడేజా 0; మహరాజ్ (బి) కుల్దీప్ 1; బర్జర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; విలియమ్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–42, 4–42, 5–75, 6–82, 7–89, 8–89, 9–94, 10–95.
బౌలింగ్: సిరాజ్ 3–1–13–0, ముకేశ్ 2–0–21–1, అర్‡్షదీప్ 2–0–13–1, జడేజా 3–0–25–2, తిలక్ 1–0–4–0, కుల్దీప్ 2.5–0–17–5.
Comments
Please login to add a commentAdd a comment