భువనేశ్వర్: భారత హాకీ జట్టు సెమీఫైనలే లక్ష్యంగా ప్రపంచకప్‌లో సంచలనానికి సై అంటోంది. గురువారం పటిష్ట నెదర్లాండ్స్ జట్టుతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ ఒక్క విజయంతో సంచలనంతో పాటు 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకూ తెరదించాలని భావిస్తోంది. హాకీకి స్వర్ణయుగమైన 70వ దశకంలో చివరిసారిగా భారత్ సెమీస్ చేరింది. 1975 తర్వాత మళ్లీ ఆ ఘనతకు చేరలేదు. ఇప్పుడు మేటి జట్టును ఓడించి నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించాలని మన్‌ప్రీత్ సింగ్ సేన గట్టి పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలేదు. అయితే ప్రపంచకప్ చరిత్ర మాత్రం భారత్‌ను కలవరపెడుతోంది.
వరల్డ్‌కప్‌ల్లో డచ్ టీమ్‌పై టీమిండియా ఇక్కసారి కూడా గెలవలేదు. ఆరుసార్లు తలపడితే ఐదుసార్లు ఓడింది. ఒక మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఒకవేళ తాజా క్వార్టర్ ఫైనల్స్‌లో మన్‌ప్రీత్ అండ్ కో గెలిస్తే కొత్త చరిత్రను లిఖిస్తుంది. అయితే ఈ టోర్నీలో ఫామ్ పరంగా చూస్తే ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. నాలుగో ర్యాంకులో ఉన్న నెదర్లాండ్స్‌కు దీటుగా ఐదో ర్యాంకర్ భారత్ రాణిస్తోంది. 2013 నుంచి ఇప్పటివరకు 9 సార్లు తలపడితే ఇరుజట్లు నాలుగేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒకటి ‘డ్రా’గా ముగిసింది. గురువారమే జరిగే మరో క్వార్టర్ ఫైనల్లో జర్మనీతో బెల్జియం ఆడుతుంది.
అర్జెంటీనాకు ఇంగ్లండ్ షాక్
బుధవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 3–2తో రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా జట్టును కంగుతినిపించి సెమీస్ చేరింది. ఇంగ్లండ్ తరఫున బారీ మిడిల్టన్ (27వ ని.), విల్ కాల్నన్ (45వ ని.), హ్యారీ మార్టిన్ (49వ ని.) గోల్స్ చేయగా, అర్జెంటీనా జట్టులో పెలట్ (17వ, 48వ ని.) రెండు గోల్స్ సాధించాడు. రెండో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 3–0తో ఫ్రాన్స్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
షటప్... అండ్ గెటౌట్!
భారత హాకీ కెప్టెన్, ఆటగాళ్లపైహెచ్‌ఐ సీఈఓ నోటి దురుసు
భువనేశ్వర్: కీలకమైన క్వార్టర్స్ పోరుకు ముందు భారత హాకీ కెప్టెన్, ఆటగాళ్లను కుంగదీసే విధంగా హాకీ ఇండియా (హెచ్‌ఐ) సీఈఓ ప్రవర్తించింది. కేవలం వీఐపీ లాంజ్‌లోకి వచ్చారన్న కారణంతో నోటికి పనిచెప్పింది. కళింగ స్టేడియంలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, కృషన్ పాఠక్‌లు వీఐపీ లాంజ్‌లో మాట్లాడుకుంటుండగా అక్కడే ఉన్న హెచ్‌ఐ సీఈఓ ఎలీనా నార్మన్ బిగ్గరగా అరచింది. ‘నోరు మూసుకొని... బయటికెళ్లండి. మిమ్మల్ని ఎవరు రానిచ్చారు ఇక్కడికి’ (షటప్ అండ్ గెటౌట్... హూ ఇన్‌వైటెడ్ యు హియర్) అని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
మరోవైపు హెచ్‌ఐ అధికారదర్పంపై పలువురు మండిపడ్డారు. సీఈఓ పదజాలాన్ని, వ్యవహారశైలిని తప్పుబట్టారు. హెచ్‌ఐ పని చేస్తున్నది ఆటగాళ్ల కోసమే కానీ అధికారుల కోసం కాదని, అలాంటప్పుడు వీఐపీ లాంజ్‌లోకి ఆటగాళ్లు వస్తే తప్పేంటని అన్నారు. చివరకు వివాదాన్ని ఏదో రకంగా ముగించాలన్నట్లు ఆమె క్షమాపణలు చెప్పిందని అధికారులు ముక్తాయించారు. కెప్టెన్ మన్‌ప్రీత్ మాత్రం మేమే పొరపాటుగా వెళ్లామని, కీలకమైన మ్యాచ్‌కు ముందు ఇలా జరగాల్సింది కాదని అన్నాడు.
►రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment