భువనేశ్వర్: నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనుకున్న భారత ఆశలు అడియాసలయ్యాయి. ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–2తో ప్రపంచ మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది. సొంతగడ్డపై అశేష ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య బరిలో దిగిన మన్‌ప్రీత్ సింగ్ సేన ఆరంభంలో ఆకట్టుకున్నా... చివర్లో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకునే పాత అలవాటును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... నెదర్లాండ్స్ తరఫున బ్రింక్‌మన్ థీరీ (15వ నిమిషంలో), వాన్ డెర్ వీర్డెన్ మింక్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేసి జట్టును గెలిపించారు.
ఆరంభంలో అదరగొట్టి...
తొలి క్వార్టర్‌లో డిఫెన్స్‌తో పాటు అటాకింగ్‌లో అదరగొట్టిన ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత జట్టు... ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పదేపదే దాడులకు యత్నిస్తూ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెంచింది. దీనికి తోడు రక్షణ పంక్తి కూడా డచ్ ఆటగాళ్లను సమర్థంగా అడ్డుకుంది. ఈ క్రమంలో ఆట 13వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని భారత్ గోల్‌గా మలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ కొట్టిన షాట్‌ను ముందు ప్రత్యర్థి గోల్‌కీపర్ అడ్డుకున్నా... గోల్ పోస్ట్ దగ్గరే కాచుకొని ఉన్న స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్ రివర్స్ ఫ్లిక్ ద్వారా మెరుపు వేగంతో బంతిని నెట్‌లోకి పంపి తొలి గోల్ అందించాడు. దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మన్‌ప్రీత్ సేనకు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మరి కొద్ది క్షణాల్లో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా... బ్రింక్‌మన్ థీరీ కళ్లు చెదిరే ఫీల్డ్‌గోల్‌తో స్కోరు సమం చేశాడు. రెండో క్వార్టర్‌లోనూ పదే పదే దాడులకు యత్నించిన భారత్ ఓ దశలో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. దీంతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు దాడులు చేయడం మాని తమ గోల్‌పోస్ట్‌కు అడ్డుగోడలా నిలిచారు.
మూడో క్వార్టర్‌లో ఇరు జట్ల రక్షణాత్మక ధోరణి కారణంగా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివర్లో డచ్ జట్టు దాడులు ఉధృతం చేసింది. మూడు క్వార్టర్‌ల పాటు ప్రత్యర్థిని కాచుకున్న భారత్ ఆఖర్లో తేలిపోయింది. ప్రత్యర్థి దాడులను అడ్డుకోలేక చేతులెత్తేసింది. 50వ నిమిషంలో లభించిన పెనాల్టీని వీర్డెన్ మింక్ గోల్‌గా మలచడంతో నెదర్లాండ్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట చివర్లో భారత్ గోల్‌కీపర్‌ను ఉపసంహరించుకొని అదనపు ఆటగాడితో ఆడినా ఫలితం లేకపోయింది. చివర్లో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కింది. మన ఆటగాళ్లు ఆ షాట్‌ను సమర్థంగా అడ్డుకోగలిగారే కానీ... స్కోరు సమం చేయడంలో విఫలమయ్యారు. ప్రపంచకప్ హాకీలో భారత్ ప్రస్థానం క్వార్టర్స్‌లోనే ముగియడంతో ఆటగాళ్లు కన్నీరుమున్నీరవుతూ మైదానాన్ని వీడారు.
బెల్జియం తొలిసారి సెమీస్‌కు...
ఒలింపిక్ రన్నరప్ బెల్జియం ప్రపంచకప్‌లో చరిత్రకెక్కే విజయాన్ని సాధించింది. తొలిసారి మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ప్రపంచ మూడో ర్యాంకరైన బెల్జియం ఇప్పటివరకు క్వార్టర్ ఫైనల్ అంచెను దాటలేకపోయింది. అయితే గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెల్జియం జట్టు 2–1 స్కోరుతో జర్మనీపై విజయం సాధించింది. అలెగ్జాండర్ హెండ్రిక్స్ (18వ ని.), టామ్ బూన్ (50వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను సరికొత్త చరిత్రలో భాగం చేయగా, జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను డిటెర్ లిన్నెకొగెల్ (14వ ని.) తొలి క్వార్టర్‌లో సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో రెడ్ లయన్స్ మరిన్ని గోల్స్ సాధించాల్సింది. కానీ 9 పెనాల్టీ కార్నర్లను పటిష్టమైన జర్మనీ డిఫెన్స్ ఆటగాళ్లు అడ్డుకున్నారు.
తీరని వేదన
Published Fri, Dec 14 2018 2:31 AM | Last Updated on Fri, Dec 14 2018 2:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment