ఆశలు సమాధి చేస్తూ... | New Zealand defeats India in thrilling Cricket World Cup semi-final | Sakshi
Sakshi News home page

ఆశలు సమాధి చేస్తూ...

Published Thu, Jul 11 2019 4:15 AM | Last Updated on Thu, Jul 11 2019 2:52 PM

New Zealand defeats India in thrilling Cricket World Cup semi-final - Sakshi

కలలు కల్లలవడం అంటే ఇదేనేమో! ఆశలు అడియాసలు కావడమంటే ఇలాగేనేమో! దూసుకుపోతున్న రేసు గుర్రాన్ని దురదృష్టం వెంటాడితే ఈ తీరునే ఉంటుందేమో! అంచనాలను చేరుతున్నా... శిఖరం అంచుల్లోంచి జారిపడిపోయిన దృష్టాంతాలకు ఇదే నిదర్శనమేమో! తేలికైన ప్రత్యర్థిగా భావిస్తే అసలుకే మోసం తెచ్చింది. మనకు తిరుగులేదనుకుంటే తలొంచాల్సి వచ్చింది. స్వింగుతో కంగుతినిపించి స్పిన్‌తో చుక్కలు చూపింది.
వెరసి...
ప్రపంచ కప్‌ ఊహలను చెల్లాచెదురుచేస్తూ టీమిండియాకు న్యూజిలాండ్‌ అతిపెద్ద ఝలక్‌ ఇచ్చింది. ఇంతటి బాధాకర ఓటమిలోనూ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా త్రీడీ ఆట (77 పరుగులు, ఒక వికెట్, ఒక రనౌట్, రెండు క్యాచ్‌లు) ఓదార్పునిచ్చింది. వెటరన్‌ ధోని పోరాటంతో పరువు దక్కింది. మనకు మిగిలిందిక... ప్రపంచ కప్‌ను పెద్దగా ఆసక్తి లేని సాధారణ ప్రేక్షకుడిగా వీక్షించడమే!

మాంచెస్టర్‌: కోట్లాది అభిమానులను హతాశులను చేస్తూ... టీమిండియా ప్రపంచ కప్‌ పోరాటం సెమీఫైనల్‌తోనే ముగిసింది. లీగ్‌ దశ నుంచి అద్భుతంగా సాగుతున్న కోహ్లి సేన ప్రస్థానానికి నాకౌట్‌లో న్యూజిలాండ్‌ అడ్డుకట్ట వేసింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ కొనసాగిన తొలి సెమీస్‌లో కివీస్‌ 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరింది. అంతకుముందు ప్రత్యర్థి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ (3/43)కు మూడు వికెట్లు దక్కాయి. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి బృందం 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.

అద్భుత పోరాటం సాగించిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. అతడికి అండగా నిలిచిన వెటరన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (72 బంతుల్లో 50; ఫోర్, సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. కుర్రాళ్లు రిషభ్‌ పంత్‌ (56 బంతుల్లో 32; 4 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (62 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌ చేర్చి ఆదిలోనే కివీస్‌కు పట్టు చిక్కేలా చూసిన పేసర్‌ మ్యాట్‌ హెన్రీ (3/37)ని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరించింది. బౌల్ట్‌ (2/42), సాన్‌ట్నర్‌ (2/34)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆతిథ్య ఇంగ్లండ్‌–ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో ఆదివారం విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌ తలపడుతుంది.

రోహిత్, రాహుల్, కార్తీక్, పంత్, హార్దిక్‌

అప్పుడే ఆశలు ఆవిరి...
టోర్నీలో కళ్లు చెదిరే ఆటతో ఐదు సెంచరీలు చేసిన ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (1), గత మ్యాచ్‌లో శతకం బాదిన మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (1)తో పాటు మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (1)లను... ఇన్నింగ్స్‌ ఇలా మొదలైందో లేదో అలా ఔట్‌ చేసి భారత్‌ను తేరుకోలేనంత దెబ్బకొట్టింది కివీస్‌. దీంతో ఇటీవల ఎన్నడూ లేనివిధంగా భారత్‌ 5/3 గణాంకాలతో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి పేసర్లను పంత్, దినేశ్‌ కార్తీక్‌ (25 బంతుల్లో 6) కాసేపు కాచుకున్నారు. దూకుడైన పంత్‌ వికెట్‌ పారేసుకునే ప్రమాదం ఉండటంతో కార్తీక్‌ ఎక్కువగా స్ట్రయికింగ్‌ తీసుకున్నాడు. కానీ, హెన్రీ బౌలింగ్‌లో బంతిని కొంత ఆలస్యంగా ఆడిన కార్తీక్‌... నీషమ్‌ అందుకున్న మెరుపు క్యాచ్‌కు వెనుదిరిగాడు.

ధోని, జడేజా

సరిగ్గా పవర్‌ ప్లే చివరి బంతికి కార్తీక్‌ పెవిలియన్‌ చేరగా స్కోరు 24/4. ఈ కప్‌లో అతి తక్కువ పవర్‌ ప్లే స్కోరు ఇదే కావడం గమనార్హం. హిట్టింగ్‌కు మారు పేరైన పంత్, పాండ్యా సహనం చూపుతూ ఐదో వికెట్‌కు 77 బంతుల్లో 47 పరుగులు జోడించి కాస్త ఒడ్డున పడేశారు. విజృంభించి బౌండరీలు కొట్టని స్థితిలో వీలు చూసుకుని సింగిల్స్‌ తీశారు. అయితే, స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌పై భారీ షాట్లతో ప్రతాపం చూపబోయి ఇద్దరూ ఔటయ్యారు. ఈ దశలో ధోని, జడేజా సమయోచితంగా ఆడుతూ ముందుకు నడిపించారు. కానీ, 11 బంతుల వ్యవధిలో వీరిద్దరితో పాటు భువనేశ్వర్‌ (0), చహల్‌ (5)లను పెవిలియన్‌ చేర్చిన కివీస్‌ మ్యాచ్‌ను వశం చేసుకుంది.
 
టాపార్డర్‌ 1..1..1..

బ్యాటింగ్‌లో టాపార్డర్‌ భారత్‌కు పెట్టని బలం. దీనికితగ్గట్లే టోర్నీలో రోహిత్‌ (648), రాహుల్‌ (361), కోహ్లి (443) పరుగులు చేశారు. కానీ, సెమీస్‌లో ఈ ముగ్గురూ కలిపి చేసింది మూడే పరుగులు. వారు సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరగడం మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసింది.

ఆ పరుగులే కీలకంగా మారి!
మంగళవారం నాటి స్కోరు 46.1 ఓవర్లలో 211/5 నుంచి బుధవారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ మిగతా 23 బంతుల్లో 28 పరుగులు జోడించి 239/8 వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, సిక్స్‌)ను బుమ్రా వేసిన 48వ ఓవర్‌ చివరి బంతికి చురుకైన త్రో ద్వారా రనౌట్‌ చేసిన జడేజా; ఆ వెంటనే భువనేశ్వర్‌ బౌలింగ్‌లో టామ్‌ లాథమ్‌ (10)ను చక్కటి క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఇదే ఓవర్‌ ఆఖరి బంతికి హెన్రీ (1) సైతం వెనుదిరిగాడు. బౌల్ట్‌ (3), సాన్‌ట్నర్‌ (9) చివరి ఓవర్‌ ఎదుర్కొని ఏడు పరుగులు జత చేశారు. ఈ మొత్తం 28 పరుగుల్లో కొన్నింటిని నిరోధించగలిగినా... మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదేమో?

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 1; నికోల్స్‌ (బి) రవీంద్ర జడేజా 28; విలియమ్సన్‌ (సి) రవీంద్ర జడేజా (బి) చహల్‌ 67; రాస్‌ టేలర్‌ (రనౌట్‌) 74; నీషమ్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) హార్దిక్‌ పాండ్యా 12; గ్రాండ్‌హోమ్‌ (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 16; లాథమ్‌ (సి) రవీంద్ర జడేజా (బి) భువనేశ్వర్‌ 10; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 9; హెన్రీ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 1; బౌల్ట్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 18;
మొత్తం (50ఓవర్లలో 8 వికెట్లకు) 239.  

వికెట్ల పతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200, 6–225, 7–225, 8–232.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10–1–43–3; బుమ్రా 10–1–39–1; హార్దిక్‌ పాండ్యా 10–0–55–1, రవీంద్ర జడేజా 10–0–34–1, చహల్‌ 10–0–63–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: లోకేశ్‌ రాహుల్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 1; రోహిత్‌ శర్మ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 1; విరాట్‌ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్‌ 1; రిషభ్‌ పంత్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) సాన్‌ట్నర్‌ 32; దినేశ్‌ కార్తీక్‌ (సి) నీషమ్‌ (బి) హెన్రీ 6; హార్దిక్‌ పాండ్యా (సి) విలియమ్సన్‌ (బి) సాన్‌ట్నర్‌ 32; ధోని (రనౌట్‌) 50; రవీంద్ర జడేజా (సి) విలియమ్సన్‌ (బి) బౌల్ట్‌ 77; భువనేశ్వర్‌ (బి) ఫెర్గూసన్‌ 0; చహల్‌ (సి) లాథమ్‌ (బి) నీషమ్‌ 5; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16;
మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 221

వికెట్ల పతనం: 1–4, 2–5, 3–5, 4–24, 5–71, 6–92, 7–208, 8–216, 9–217, 10–221.

బౌలింగ్‌: బౌల్ట్‌ 10–2–42–2, హెన్రీ 10–1–37–3, ఫెర్గూసన్‌ 10–0–43–1, గ్రాండ్‌హోమ్‌ 2–0– 13–0, నీషమ్‌ 7.3–0–49–1, సాన్‌ట్నర్‌ 10–2–34–2.

సాహో జడేజా... భళా ధోని
30.3 ఓవర్లకు స్కోరు 92/6. సాధించాల్సిన రన్‌రేట్‌ 8కి దగ్గరగా ఉంది. ఇలా చాలా ముందే ఓటమి ఖరారైన టీమిండియా చివరకు లక్ష్యానికి అంత దగ్గరగా వచ్చిందంటే అది జడేజా, ధోని ఘనతే. పాండ్యా ఔటయ్యేసరికి మన జట్టు గెలిచే అవకాశాలు 10 శాతమే. ఇలాంటి దశలో పొరపాటునైనా వికెట్‌ ఇవ్వకూడదన్నట్లు ధోని జాగ్రత్త పడ్డాడు. జడేజా మాత్రం వస్తూనే ధైర్యం చేసి నీషమ్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్‌ కొట్టి తాడోపేడో తేల్చుకోవాలన్నట్లు కనిపించాడు. ఇద్దరూ తమదైన సమన్వయంతో పరుగులు తీస్తూ స్కోరు బోర్డులో కదలిక తెచ్చారు.

టర్నింగ్‌ పాయింట్‌ : ధోని రనౌట్‌

హెన్రీ, ఫెర్గూసన్‌ ఓవర్లలో ఫోర్లు కొట్టిన జడ్డూ... సాన్‌ట్నర్‌ స్పిన్‌ వలయాన్ని ఛేదిస్తూ లాంగాన్, మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌లతో ప్రతాపం చూపాడు. 39 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అప్పటికి ధోని ఇంకా 28 పరుగుల వద్దే ఉండటం గమనార్హం. బౌలర్‌ ఎవరైనా లెక్క చేయనంతటి జోష్‌లో అతడు ఫెర్గూసన్‌ ఓవర్లో సిక్స్, బౌల్ట్‌ బౌలింగ్‌లో ఫోర్‌ దంచాడు. జడేజా–ధోని 97 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఇందులో జడేజావే 69 పరుగులు ఉండటం విశేషం. ఇదే క్రమంలో జట్టు స్కోరును 200 సైతం దాటించారు.

గెలుపునకు 14 బంతుల్లో 32 పరుగులు అవసరమైన స్థితిలో బౌల్ట్‌ వేగం తగ్గించి వేసిన బంతికి జడేజా బోల్తా పడ్డాడు. అతడు కొట్టిన బంతి గాల్లో చాలా ఎత్తులో లేవగా లాంగాఫ్‌లో పొంచి ఉన్న విలియమ్సన్‌ ఒడిసి పట్టాడు. కొంత క్లిష్టమే అయినా అవకాశాలు ఉన్న ఈ పరిస్థితిలో ఫెర్గూసన్‌ వేసిన 49వ ఓవర్‌ తొలి బంతినే బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి సిక్స్‌కు పంపి ధోని ఆశలు రేపాడు. మరుసటి బంతికి పరుగులు తీయని మహి... మూడో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో స్క్వేర్‌ లెగ్‌ నుంచి గప్టిల్‌ విసిరిన డైరెక్ట్‌ రాకెట్‌ త్రోకు రనౌటయ్యాడు. ఈ ఓవర్‌ చివరి బంతికి భువీ బౌల్డ్‌ అవడంతో ఏ మూలనో ఉన్న ఆశలు ఆవిరయ్యాయి.

వరుణుడా...? దెబ్బకొట్టావ్‌!
‘న్యూజిలాండ్‌తో కలిసి వరుణుడు సెమీఫైనల్లో టీమిండియాను ఓడించాడు’... ఫలితాన్ని విశ్లేషిస్తే ఇది సరైనదేమోననే అనిపిస్తుంది. పిచ్‌ ఎలా ఉన్నా మంగళవారం మ్యాచ్‌ పూర్తిగా సాగి ఉంటే కివీస్‌ విధించే 230 లేదా 240 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించేలా కనిపించిన భారత్‌కు... వాన కారణంగా వాయిదా పడటం ప్రతికూలమైంది. బుధవారం చల్లటి వాతావరణంలో ప్రత్యర్థి పేసర్లు చెలరేగిపోయారు. బౌల్ట్‌ వంటి ఎడమ చేతివాటం పేసర్‌కు బంతి స్వింగ్‌ అయ్యే వీలుచిక్కడం; హెన్రీ కచ్చితమైన డెలివరీలకు రోహిత్, రాహుల్‌ తడబడటం దెబ్బకొట్టింది.

ఈ జట్టు చేతిలో ఓడటమేంటబ్బా?
కివీస్‌పై కచ్చితంగా గెలుస్తామనే అంచనాల మధ్య భారత్‌ ఓటమి అభిమానులను తీవ్రంగా బాధించేదే. కప్‌లో రెండు జట్లు భిన్న నేపథ్యాల నుంచి సెమీస్‌ చేరడమే దీనికి కారణం. ఇంగ్లండ్‌పై ఓటమి తప్ప అప్రతిహత విజయాలతో భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు సిద్ధమవగా; న్యూజిలాండ్‌ లీగ్‌ చివర్లో తేలిపోయింది. అంతా కోహ్లి సేనకు ఇంగ్లండ్‌ ఎదురవుతుందని అనుకుంటే కివీస్‌ అనూహ్యంగా తారసపడి అంతే ఆశ్చర్యకరమైన షాకిచ్చింది. విలియమ్సన్, టేలర్‌ తప్ప ఎవరూ ఫామ్‌లో లేని ఆ జట్టుపై ‘ఎలాగైనా మనమే గెలుస్తాం’ అని ఊహల్లో ఉన్న భారత వీరాభిమానులను ఈ పరాజయం కొన్ని రోజులు వెంటాడటం ఖాయం.

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ హెన్రీ (3/37)

కూర్పు ఒప్పు... తప్పు
మంగళవారం సెమీస్‌కు మైదానంలో దిగిన భారత తుది జట్టులో పేసర్‌ షమీ లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన అతడిని శ్రీలంకతో మ్యాచ్‌కు పక్కన పెట్టడమే అనూహ్యం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఆడించకపోవడం ఏం వ్యూహమో అర్థం కాలేదు. అటువైపు కివీస్‌ స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌నే నమ్ముకుని, ముగ్గురు ఫ్రంట్‌లైన్‌ పేసర్లను తీసుకుంది. భారత్‌ మాత్రం కుల్దీప్‌ బదులు చహల్‌ను తుది పదకొండులో చేర్చింది. అతడు విఫలమవ్వగా సహచర స్పిన్నర్‌ జడేజా చకచకా బంతులేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తుంటే చహల్‌ పరుగులిస్తూ పోయాడు. పాత కాలపు ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల ఆలోచనకు భారత్‌ స్వస్తి పలికి మూడో పేసర్‌గా షమీని ఆడిస్తే కివీస్‌కు పుంజుకొనే అవకాశమే రాకపోయేది.

కివీస్‌ అప్పుడు... ఇప్పుడు...
వరుణుడి చలవతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేరింది న్యూజిలాండ్‌. సహ ఆతిథ్యమిచ్చిన 2015 కప్‌లోనూ ఆ జట్టు వర్షం ప్రభావిత మ్యాచ్‌ ద్వారానే తుది సమరానికి అర్హత పొందింది. నాడు మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా డివిలియర్స్‌ (45 బంతుల్లో 65 నాటౌట్‌) భీకర హిట్టింగ్‌తో 43 ఓవర్లలో 281/5తో భారీ స్కోరు దిశగా వెళ్తుండగా వర్షం అడ్డుకుంది. తర్వాత లక్ష్యాన్ని 43 ఓవర్లలో 299 పరుగులుగా నిర్దేశించారు. గ్రాంట్‌ ఇలియట్‌ (84 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో మరో బంతి మాత్రమే ఉండగా కివీస్‌ లక్ష్యాన్ని చేరుకుంది.  

రిటైర్మెంట్‌పై ధోని నాకేమీ చెప్పలేదు
టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడి ఒక్క 45 నిమిషాల చెత్త ఆటతో జట్టు బోల్తా పడటం చాలా నిరాశ పరిచింది. టోర్నీలో జోరుమీదున్న మేం ఇలాంటి అనూహ్య ఫలితంతో నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కివీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. జడేజా అసాధారణ ఆటతీరు కనబరిచాడు. తన క్రికెట్‌ నైపుణ్యాన్ని చాటాడు. ధోనితో విలువైన భాగస్వామ్యం జోడించాడు. ధోని ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకే నింపాదిగా ఆడాడు. మరోవైపు జడేజా యథేచ్చగా ఆడేందుకు స్ట్రయికింగ్‌తో సాయపడ్డాడు. ఒకవేళ ఆఖర్లో ధోని రనౌట్‌ కాకపోతే ఫలితం మరోలా ఉండేది. అయితే అతను తన రిటైర్మెంట్‌పై మాకేమీ చెప్పలేదు.
– భారత కెప్టెన్‌ కోహ్లి
 
నేడు రెండో సెమీఫైనల్‌
ఇంగ్లండ్‌ X ఆస్ట్రేలియా
వేదిక : బర్మింగ్‌హామ్‌
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ –1లో ప్రత్యక్షప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement