
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్ ఫైనల్లో పాత రూల్స్ అమల్లో ఉంటే ఇంగ్లండ్–న్యూజిలాండ్‌లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. కానీ ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయిందంటే సగటు క్రికెట్ అభిమాని కూడా దానిని తమ పరాజయంగా భావిస్తున్నాడు. స్టోక్స్ బ్యాట్‌ను తాకి పోయిన 6 పరుగుల ఓవర్‌త్రో దురదృష్టమో, గప్టిల్ గ్రహచారం బాగా లేని రోజు కావడమో కానీ విలియమ్సన్ సేన విలపించాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఆట తర్వాత కూడా బౌండరీ లెక్కల త్రాసుతో ఇంగ్లండ్ పైచేయి కావడం బలవంతంగా కివీ రెక్కలు విరిచేసినట్లయింది. వరుసగా రెండోసారి కూడా న్యూజిలాండ్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి వెంటాడింది. అయితే ఆ జట్టు గొప్పతనాన్ని ఈ మ్యాచ్ ఫలితం తగ్గించలేదు.
ప్రత్యర్థులపై మాటల దాడి చేయకుండా, దూషణలకు పాల్పడకుండా కూడా ప్రపంచ కప్‌లో గొప్ప విజయాలు సాధించవచ్చని ఆ జట్టు నిరూపించింది. కివీస్ క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైదానంలో వారి ప్రవర్తన. తమదైన ఆటను ఆడుకుంటూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంలో వారికి వారే సాటి. ఫెయిర్ ప్లే అవార్డు అంటూ ఎప్పుడిచ్చినా ఈ మర్యాద రామన్నల బృందానికే దక్కడం పరమ రొటీన్. ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టంను మొదలు పెట్టింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అందరికంటే అతి తక్కువగా ఒకే ఒకసారి శిక్షకు గురైన జట్టు న్యూజిలాండ్. వారి ఆట ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇది చాలు.
ఏ టోర్నీలో బరిలోకి దిగినా వారిని ‘అండర్‌డాగ్’గానే చూడడం అందరికీ అలవాటైపోయింది. డాగ్ ఏదైనా అసలైన రోజు కరవడం ముఖ్యం అని స్వయంగా విలియమ్సన్ చెప్పినట్లు రెండు అసలు మ్యాచ్‌లలో కివీస్ సత్తా చాటింది. సెమీస్‌లోనే భారత్ ముందు అసలు కివీస్‌ను ఎవరూ పెద్దగా లెక్క చేయలేదు. కానీ అద్భుత వ్యూహంతో ఆ జట్టు అనూహ్య విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరుకే పరిమితమైనా... పట్టుదలతో ఆడి టీమిండియాను నిలవరించగలిగింది. ఫైనల్లో కూడా నాలుగు ఇంగ్లండ్ వికెట్లు తీసిన తర్వాత విజయానికి బాటలు వేసుకున్న ఆ జట్టు అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయింది.
కెప్టెన్‌గా తొలి ప్రపంచ కప్‌లో బ్యాట్స్‌మన్‌గానూ తనదైన ముద్ర వేసిన విలియమ్సన్‌కు దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్ల నుంచి ఎక్కువ మద్దతు లభించలేదు. అదే చివరి పోరులో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేందుకు కారణమైంది. విలియమ్సన్ 82.57 సగటుతో ఏకంగా 578 పరుగులు చేయగా... రెండో స్థానంలో నిలిచిన టేలర్ మూడు అర్ధ సెంచరీలతో 350 పరుగులకే పరిమితమయ్యాడు. గత వరల్డ్‌కప్‌లో డబుల్ సెంచరీ సహా హీరోగా నిలిచిన గప్టిల్ ఘోర వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 186 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
కివీస్ ఇక్కడి వరకు రాగలిగిందంటే పేస్ బౌలింగ్ త్రయమే కారణం. ఫెర్గూసన్ (21), బౌల్ట్ (17), హెన్రీ (14) కలిపి 52 వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా ఓవర్‌కు ఐదుకు మించి పరుగులు ఇవ్వలేదంటే ఎంత నియంత్రణతో బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. 232 పరుగులు చేసిన నీషమ్ కూడా 15 వికెట్లతో అండగా నిలిచాడు. అయితే చివరకు బ్యాటింగ్ వైఫల్యమే కివీస్‌కు గొప్ప అవకాశాన్ని దూరం చేసింది. అఫ్గానిస్తాన్ మినహా టోర్నీలో 300 దాటని ఏకైక జట్టు న్యూజిలాండే. ఫలితంగా కివీస్ బృందం టైటిల్ కాకుండా మరోసారి హృదయాలు గెలుచుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.