అంతా పీడకలలా అనిపిస్తోంది | Williamson says Even in a heart-breaking loss | Sakshi
Sakshi News home page

అంతా పీడకలలా అనిపిస్తోంది

Published Tue, Jul 16 2019 5:05 AM | Last Updated on Tue, Jul 16 2019 5:06 AM

Williamson  says Even in a heart-breaking loss - Sakshi

కేన్‌ విలియమ్సన్‌

లండన్‌: ప్రపంచ కప్‌ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ఫైనల్‌ మరుసటి రోజు దీనిపై కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భారంగా స్పందించాడు. ‘నిరాశ మమ్మల్ని ఉప్పెనలా ముంచెత్తింది. ఉదయం లేచి చూస్తే పీడకల కన్నట్లుగా అనిపించింది. మా ఆటగాళ్లంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. మ్యాచ్‌లో ఈ తరహాలో ఓడటం ఏదోలా ఉంది’ అని విలియమ్సన్‌ తన బాధను వ్యక్తీకరించాడు. ఆదివారం మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కివీస్‌ కెప్టెన్‌... బౌండరీల లెక్క నిబంధనపై ఆచితూచి స్పందించాడు. ‘బౌండరీలను బట్టి విజేతను నిర్ణయించడం సరైందా అంటే నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వలేను. నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని గానీ నేను జవాబు ఇవ్వాల్సి వస్తుందని గానీ అసలెప్పుడూ ఊహించలేదు.

ఇంకా ఓటమి బాధలోనే ఉన్నాం. ఇరు జట్లు ఇంత కష్టపడిన తర్వాత బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది సిగ్గుచేటు’ అని అతను వ్యాఖ్యానించాడు. అయితే ఇంత జరిగినా అతను ఈ నిబంధనను విమర్శించడానికి ఇష్టపడకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ‘నిబంధనలు మొదటి నుంచి ఉన్నాయనేది వాస్తవం. కానీ ఇలాంటి నిబంధనతో మ్యాచ్‌ ఫలితం తేల్చాల్సి వస్తుందని బహుశా ఎవరూ ఊహించకపోవచ్చు. స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి ఓవర్‌త్రో వెళ్లడం కూడా అలాంటిదే. ఒక అద్భుతమైన మ్యాచ్‌ జరిగింది. అందరూ దానిని బాగా ఆస్వాదించారు’ అని విలియమ్సన్‌ చెప్పడం విశేషం. ఫైనల్‌ ఫలితం తర్వాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ విలియమ్సన్‌... ‘ఇలాంటి స్థితిలో నవ్వడమో లేదా ఏడవడమో అనే ఒకే ఒక అనుభూతి ఉంటుంది. అయితే కొంత నిరాశ ఉన్నా నాకు కోపం మాత్రం లేదు’ అని విలియమ్సన్‌ స్పష్టం చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement