లండన్: ప్రపంచ కప్‌ను గెలుచుకున్నామన్న ఆనందం నుంచి తాము ఇంకా బయటకు రాలేకపోతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. నాలుగేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిదని మ్యాచ్ తర్వాత అతను వ్యాఖ్యానించాడు. ‘మేం గెలుపు గీత దాటడం ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాతో పాటు జట్టు సభ్యులందరూ ఒక ప్రణాళిక ప్రకారం అంకితభావంతో కష్టపడ్డాం. ఈ గెలుపు ప్రయాణం అద్భుతంగా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి కూడా మాపై అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేయడం సంతోషంగా ఉంది’ అని మోర్గాన్ అన్నాడు. బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించిన నిబంధనపై మోర్గాన్ జాగ్రత్తగా స్పందించాడు. ‘ఇప్పుడు అమలు చేసిన పద్ధతి కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి. అప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఏది మెరుగైందో నిర్ణయించవచ్చు. టోర్నీ నిబంధనలు చాలా కాలం క్రితమే రూపొందించారు. వాటిపై మన నియంత్రణ ఉండదు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్పష్టీకరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌పై మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ‘స్టోక్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను మానవాతీతుడిలా ఆడి జట్టు గెలుపు భారాన్ని సమర్థంగా మోశాడు. బట్లర్ ఔటైన తర్వాత చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో అతను ఇన్నింగ్స్ నడిపించడం అసాధారణం’ అని మోర్గాన్ చెప్పాడు.
‘అల్లా కూడా మాతోనే’...
మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్ కాగా... అన్ని కలిసి రావడంపై అక్కడ ‘ఐరిష్ లక్’ పేరుతో బాగా ప్రాచుర్యంలో సామెత ఉంది. ‘ఐరిష్ లక్’ వెంట నడిచిందా అంటూ అడిగిన ప్రశ్నపై మోర్గాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నా సహచరుడు ఆదిల్ రషీద్‌తో మాట్లాడినప్పుడు అల్లా ఈ రోజు మనతో ఉన్నాడని చెప్పాడు. కాబట్టి నేను కూడా అల్లా మా జట్టుకు అండగా నిలిచాడని నమ్ముతున్నా. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో వేర్వేరు సంప్రదాయాలు, నేపథ్యాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. కానీ ఆటకు వచ్చేసరికి అంతా కలిసికట్టుగా ఆడి విజయం సాధించాం’ అని అతను విశ్లేషించాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం విశ్వ విజేతగా ఆనందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు మోర్గాన్ చెప్పాడు.
6 కాదు 5 పరుగులు ఇవ్వాల్సింది!
ఓవర్‌త్రోపై మాజీ అంపైర్ టఫెల్ అభిప్రాయం
లండన్: ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్‌ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చినా... అతని బ్యాట్‌కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్‌ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్‌పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు.
‘బౌండరీ’పై విమర్శల బాదుడు!
ప్రపంచ కప్ ఫైనల్ ఫలితాన్ని బౌండరీల లెక్కతో తేల్చడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిని అత్యంత చెత్త నిబంధనగా పేర్కొంటూ మాజీ క్రికెటర్లు ఐసీసీపై విరుచుకుపడ్డారు. దీనికంటే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిందని కొందరు అభిప్రాయ పడగా, ఇలాంటి నిబంధనలు మార్చేయాలని మరికొందరు సూచించారు. ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ పరంగా చూస్తే 26–17 తేడాతో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ నెగ్గింది.
‘క్రికెట్‌లో కొన్ని నిబంధనలపై తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’
–రోహిత్ శర్మ
‘అద్భుతంగా సాగిన మ్యాచ్‌లో ఫలితాన్ని బౌండరీల తేడాతో నిర్ణయించడం ఏమిటో అర్థం కాలేదు. అతి చెత్త నిబంధన ఇది. ‘టై’గా ప్రకటిస్తే బాగుండేది’
–గౌతం గంభీర్
‘బౌండరీ నిబంధనకు నేను కూడా మద్దతివ్వను. కానీ రూల్స్ అంటే రూల్సే. ఎట్టకేలకు కప్ గెలిచిన ఇంగ్లండ్‌కు అభినందనలు’
–యువరాజ్ సింగ్
‘అసలు ఎంత బాగా పని చేస్తున్నారో...అసలు ఐసీసీ అనేదే పెద్ద జోక్’
–స్కాట్ స్టయిరిస్
‘ఐసీసీ నిబంధన వల్ల ఇంగ్లండ్ కప్ గెలవడం అసలే మాత్రం ఊహించలేనిది. ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది’
–బిషన్ సింగ్ బేడి
‘డక్‌వర్త్ లూయిస్ నిబంధన పరుగులు, వికెట్లపై ఆధారపడి ఉంది. కానీ ఫైనల్ ఫలితం మాత్రం బౌండరీల లెక్క ప్రకారం తీసుకుంటారా’
–డీన్ జోన్స్
‘నా దృష్టిలో ఇలా విజేతను నిర్ణయించడం దుర్మార్గమైన పద్ధతి. ఇది మారాల్సిందే’
–బ్రెట్ లీ
‘చాలా బాధగా ఉంది. మేం మోసపోయినట్లనిపిస్తోంది. పిచ్చి నిబంధన. ఇది కూడా టాస్ వేసి విజేతను నిర్ణయించడంలాంటిదే’
–డియాన్ నాష్
‘క్రూరత్వం’
–స్టీఫెన్ ఫ్లెమింగ్
అదృష్టం మా వైపు ఉంది!
Published Tue, Jul 16 2019 4:52 AM | Last Updated on Tue, Jul 16 2019 9:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment