ప్రపంచ కల నెరవేరింది | England win Cricket World Cup after super-over drama against New Zealand | Sakshi
Sakshi News home page

ప్రపంచ కల నెరవేరింది

Published Mon, Jul 15 2019 4:24 AM | Last Updated on Mon, Jul 15 2019 12:39 PM

England win Cricket World Cup after super-over drama against New Zealand  - Sakshi

ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్‌ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది...
ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది.  ఔను...! ఇంగ్లండ్‌ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్‌ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్‌... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్‌ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి సూపర్‌ ఓవర్‌ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్‌ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది...


లండన్‌ : ఇంగ్లండ్‌ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్లో వన్‌ ఓవర్‌ ఎలిమినేటర్‌ పద్ధతిలో ఇంగ్లండ్‌ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్‌ హెన్రీ నికోల్స్‌ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించాడు.

కివీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విలియమ్సన్‌ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్‌ (3/37), ప్లంకెట్‌ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్‌ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్‌ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్‌ (3/43), ఫెర్గూసన్‌ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్‌హోమ్‌ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్‌ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (98 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటం, బట్లర్‌ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో తేరుకుంది.    

నికోల్స్‌ నిలిచాడు... లాథమ్‌ ఆడాడు
కివీస్‌ ఓపెనింగ్‌ జంట నికోల్స్, గప్టిల్‌ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్‌) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపిన గప్టిల్‌ను వోక్స్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్‌ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్‌ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్‌ చేసి కివీస్‌కు ప్లంకెట్‌ షాకిచ్చాడు. అతడి గుడ్‌ లెంగ్త్‌ బంతి విలియమ్సన్‌ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ బట్లర్‌ చేతిలో పడింది. అంపైర్‌ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్‌ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్‌ను సాగనంపాడు. అంపైర్‌ ఎరాస్మస్‌ తప్పుడు నిర్ణయానికి రాస్‌ టేలర్‌ (15) బలయ్యాడు. ఆల్‌రౌండర్‌ నీషమ్‌ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. గ్రాండ్‌హోమ్‌ (16) అండగా లాథమ్‌ బండి లాగించాడు. వోక్స్‌ ఈ ఇద్దరినీ ఔట్‌ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్‌ట్నర్‌ (5 నాటౌట్‌) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు.

ఇంగ్లండ్‌ కష్టంగానైనా అందుకుంది...
ఇంగ్లండ్‌ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి బంతే ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్‌ ఎరాస్మస్‌ ఔటివ్వకపోవడంతో కివీస్‌ సమీక్ష కోరింది. బంతి లెగ్‌ స్టంప్‌ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్‌ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్‌ను ఊగిసలాటలో పడేసి వికెట్‌ దక్కించుకున్నాడు. రూట్‌ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్‌హోమ్‌పై ప్రతాపం చూపబోయి వికెట్‌ ఇచ్చేశాడు. బెయిర్‌ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్‌ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్‌ (9) పేలవ షాట్‌కు ఔటయ్యాడు.  అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్‌–బట్లర్‌  ఐదో వికెట్‌కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్‌ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు.

సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్‌ ఓవర్లో బట్లర్‌ షాట్‌కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్‌ పోరాడుతున్నా... వోక్స్‌ (2)ను పెవిలియన్‌ చేర్చి కివీస్‌ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్‌ (10), ఆర్చర్‌ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్‌ చేసి నీషమ్‌ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్‌ తొలి రెండు బంతులకు స్టోక్స్‌ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్‌ కొట్టాడు. నాలుగో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్‌ త్రో స్టోక్స్‌కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్‌ (0), వుడ్‌ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్‌ టై అయింది.

చివరి ఐదు ఓవర్లు హైడ్రామా...
ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్‌ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్‌  రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్‌ (46.1), ప్లంకెట్‌ (48.3), ఆర్చర్‌ (48.6) ఔటవ డంతో కప్‌ న్యూజిలాండ్‌దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్‌ సిక్స్, ఓవర్‌ త్రో రూపంలో 2 ప్లస్‌ 4 పరుగులు రావడంతో తలకిందులైంది.

బౌల్ట్‌ క్యాచ్‌... సిక్స్‌...
మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్‌ పాయింట్‌ నీషమ్‌ ఓవర్లో స్టోక్స్‌ కొట్టిన సిక్స్‌ షాట్‌. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్‌ మిడ్‌ వికెట్‌లోకి భారీ షాట్‌ ఆడగా... బౌండరీ లైన్‌ వద్ద బౌల్ట్‌ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్‌కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్‌... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్‌ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్‌ గప్టిల్‌ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్‌ నమోదైంది. బోనస్‌గా స్టోక్స్‌కు లైఫ్‌ వచ్చింది. ప్రధాన పేసర్‌ అయిన బౌల్ట్‌ బౌలింగ్‌లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్‌ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్‌కు వేదన మిగిల్చింది.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్‌ 19; నికోల్స్‌ (బి) ప్లంకెట్‌ 55; విలియమ్సన్‌ (సి) బట్లర్‌ (బి) ప్లంకెట్‌ 30; టేలర్‌ (ఎల్బీడబ్ల్యూ) వుడ్‌ 15; లాథమ్‌ (సి) సబ్‌ (విన్స్‌) (బి) వోక్స్‌ 47; నీషమ్‌ (సి) రూట్‌ (బి) ప్లంకెట్‌ 19; గ్రాండ్‌హోమ్‌ (సి) సబ్‌ (విన్స్‌) (బి) వోక్స్‌ 16; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 5; హెన్రీ (బి) ఆర్చర్‌ 4; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241

వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240.

బౌలింగ్‌: వోక్స్‌ 9–0–37–3; ఆర్చర్‌ 10–0–42–1; ప్లంకెట్‌ 10–0–42–3; వుడ్‌ 10–1–49–1; రషీద్‌ 8–0–39–0; స్టోక్స్‌ 3–0–20–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్‌ 36; రూట్‌ (సి) లాథమ్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 7; మోర్గాన్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) నీషమ్‌ 9, స్టోక్స్‌ (నాటౌట్‌) 84; బట్లర్‌ (సి) సబ్‌ (సౌతీ) (బి) ఫెర్గూసన్‌ 59; వోక్స్‌ (సి) లాథమ్‌ (బి) ఫెర్గూసన్‌ 2; ప్లంకెట్‌ (సి) బౌల్ట్‌ (బి) నీషమ్‌ 10; ఆర్చర్‌ (బి) నీషమ్‌ 0; రషీద్‌ (రనౌట్‌) 0; మార్క్‌ వుడ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్‌) 241.

వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241.

బౌలింగ్‌: బౌల్ట్‌ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్‌ 10–2–25–1, ఫెర్గూసన్‌ 10–0–50–3, నీషమ్‌ 7–0–43–3, సాన్‌ట్నర్‌ 3–0–11–0.  

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా...

నోట్‌: సూపర్‌ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్‌ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్‌ 17 బౌండరీలు సాధించింది.   

స్టోక్స్‌... మాస్టర్‌ స్ట్రోక్‌...
ప్రపంచ కప్‌ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్‌కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్‌ స్టోక్స్‌కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్‌కు ఒక కప్‌ (2017 టి20 ప్రపంచ కప్‌) చేజారింది. భారత్‌ వేదికగా జరిగిన నాటి కప్‌ ఫైనల్లో స్టోక్స్‌ వేసిన చివరి ఓవర్లో కార్లొస్‌ బ్రాత్‌వైట్‌ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండీస్‌కు కప్‌ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్‌ పిచ్‌ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్‌ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్‌ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్‌ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్‌ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్‌) ఆడిన ఇన్నింగ్స్‌లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది.

గప్టిల్‌ హీరో... విలన్‌...
న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్‌ వైఫల్యమే. సీనియర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్‌ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్‌ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్‌ నాలుగో బంతిని ఓవర్‌ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్‌ పాత్ర పరోక్షమే అని, కివీస్‌ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి ప్రపంచ కప్‌ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్‌ అనంతరం గప్టిల్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


గప్టిల్‌ను ఓదార్చుతున్న నీషమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement