Lords stadium
-
WTC- 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక మారింది! ఈసారి లార్డ్స్‌లో కాదు!
World Test Championship 2023, 2025 Final Venues: ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్-2023 వేదిక మారింది. క్రికెట్ మక్కాగా పిలుచుకునే ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఈ మెగా మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలుత ప్రకటించింది. అయితే, ఇప్పుడు వేదికను లార్డ్స్ నుంచి ది ఓవల్‌కు మార్చినట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇక డబ్ల్యూటీసీ-2025 ఫైనల్ మాత్రం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ విషయం గురించి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చారిత్రాత్మక ది ఓవల్‌లో నిర్వహించనున్నామని ప్రకటించడం సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా డబ్ల్యూటీసీ తొలి ఫైనల్ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్- టీమిండియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ సేన విజయం సాధించింది. డబ్ల్యూటీసీ తొలి ట్రోఫీ గెలిచిన జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 84 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ కొనసాగుతున్నాయి. చదవండి: World Test Championship Final: శ్రీలంక కష్టమే! ఆసీస్ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! -
‘లార్డ్స్’లో టీమిండియా సీనియర్‌కు ఘనంగా వీడ్కోలు
బెంగళూరు: ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ జులన్ గోస్వామి లార్డ్స్ మైదానంలో పరుగు ముగించనుంది. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత రిటైర్ కానుంది. సెప్టెంబర్ 24న జరిగే మూడో వన్డే ఆమె కెరీర్లో చివరిది అవుతుంది. మార్చిలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన జులన్ పక్కటెముకల గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి పోరులో బరిలోకి దిగలేకపోయింది. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతోనే శ్రీలంకతో సిరీస్‌కు దూరమైంది. అయితే జులన్‌లాంటి స్టార్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని భావించిన బీసీసీఐ ఆమెను ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసింది. మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్ ఆటకు తెర పడనుంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్ 201 వన్డేల్లో 252 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. మరో 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2009లో అంత ర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పుడు ఆమె తొలి కెప్టెన్ జులన్ గోస్వామినే కావడం విశేషం. విజయంతో జులన్‌కు వీడ్కోలు పలుకుతామని హర్మన్ వ్యాఖ్యానించింది. ‘జులన్ చివరి మ్యాచ్ కు నేను కెప్టెన్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నేను వచ్చినప్పుడు ఆమెనుంచి ఎంతో నేర్చుకున్నాను. జులన్ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదల అసమానం. ప్రతీ మ్యాచ్‌లో బాగా ఆడేందుకు ఇప్పటికీ కొత్త ప్లేయర్‌గా ప్రతీరోజు 2–3 గంటలు బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్లోకి వచ్చారు’ అని ఆమె తన గౌరవాన్ని ప్రదర్శించింది. -
'క్రికెట్ మక్కా' వేదికగా 2023, 2025 డబ్ల్యూటీసీ ఫైనల్స్
క్రికెట్ మక్కాగా పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం మరో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023, 2025లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లకు లార్డ్స్ స్టేడియం వేదిక కానుంది. ఈ మేరకు మంగళవారం(జూలై 26) బర్మింగ్హమ్ వేదికగా నిర్వహించిన చివరి రోజు వార్షిక సమావేశాల్లో ఐసీసీ పేర్కొంది. వాస్తవానికి 2019-21 తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా లార్డ్స్‌లో జరగాల్సింది. కానీ కరోనా కారణంగా ఆఖరి క్షణంలో వేదికను సౌతాంప్టన్‌కు మార్చాల్సి వచ్చింది. దీంతో పాటు వార్షిక సమావేశాల్లో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక 2021 జూన్ 18 నుంచి 23 వరకు తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి టెస్టు చాంపియన్‌గా అవతరించింది. ►ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీలో వివిఎస్ లక్ష్మణ్‌తో పాటు కివీస్ మాజీ క్రికెటర్ డానియెల్ వెటోరిని ఆటగాళ్ల ప్రతినిధులుగా నియమించింది. ►ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ కారణంగా రష్యా క్రికెట్ మెంబర్‌షిప్‌ను ఐసీసీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేసింది. దీంతోపాటు ఉక్రెయిన్‌కు క్రికెట్లో సభ్యత్వం ఇవ్వడానికి ఐసీసీ కమిటీ ఆమోదం తెలిపింది. ►2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుందని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. ►అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు.ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. చదవండి: ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి -
ODI WC 1975: జగజ్జేత.. నాడు విండీస్‌ను గెలిపించింది ఎవరో తెలుసా?
ICC ODI World Cup 1975 AUS Vs WI- Winner West Indies: క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్ సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్న ఘనత మాత్రం వెస్టిండీస్‌కే దక్కింది. జగజ్జేత... ఈ మాట వింటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా! మరి తొలిసారిగా సరిగ్గా ఇదే రోజు విండీస్ జట్టు క్రీడా ప్రపంచం చేత చాంపియన్‌గా నీరాజనాలు అందుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి విశ్వ విజేతగా అవతరించింది. మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి తమ దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా చేసింది. ట్రోఫీతో విండీస్ కెప్టెన్ లాయిడ్ (PC: ICC) టోర్నీ సాగింది ఇలా! అది 1975.. పరిమిత ఓవర్ల ప్రపంచకప్ రేసులో ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఈస్ట్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తదితర 8 జట్లు పోటీ పడ్డాయి. జూన్ 7న ఇంగ్లండ్- ఇండియా మ్యాచ్‌తో లార్డ్స్ మైదానంలో ఆరంభమైన ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఏకంగా టీమిండియాపై 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తూర్పు ఆఫ్రికాను 181 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ తదుపరి మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను 73 పరుగుల తేడాతో ఓడించగా.. వెస్టిండీస్ శ్రీలంకపై 9 వికెట్ల తేడా(236 బంతులు మిగిలి ఉండగా)తో గెలుపొందింది. అదే విధంగా.. జూన్ 11 నాటి మ్యాచ్‌లలో ఇంగ్లండ్ న్యూజిలాండ్ మీద 80 పరుగులతో, ఆస్ట్రేలియా శ్రీలంకపై 52 పరుగులతో, వెస్టిండీస్ పాకిస్తాన్ మీద ఒక వికెట్(రెండు బంతులు మిగిలి ఉండగా) తేడాతో, ఇండియా- తూర్పు ఆఫ్రికా మీద 10 వికెట్ల తేడాతో(181 బంతులు మిగిలి ఉండగా) జయభేరి మోగించాయి. ఆ తర్వాత జూన్ 14న జరిగిన మ్యాచ్‌లలో పాకిస్తాన్ శ్రీలంక మీద 192 పరుగులు, వెస్టిండీస్ ఆస్ట్రేలియా మీద 7 వికెట్లు(84 బంతులు మిగిలి ఉండగా), న్యూజిలాండ్ ఇండియా మీద 4 వికెట్లు, ఇంగ్లండ్ తూర్పు ఆఫ్రికా మీద 196 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటాయి. సెమీస్‌కు చేరిన జట్లు ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా తలపడగా.. 188 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం ఆసీస్‌ను వరించింది. ఇక రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 119 బంతులు మిగిలి ఉండగానే కివీస్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఫైనల్లో టాస్ గెలిచి జూన్ 21న లార్డ్స్ మైదానంలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కంగారూ జట్టు కెప్టెన్ ఇయాన్ చాపెల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఆసీస్ బౌలర్లు చెలగరేగడంతో విండీస్ ఓపెనర్లు రాయ్ ఫ్రెడెరిక్స్, సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ వరుసగా 7, 13 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన అల్విన్ కల్లిచర్రాన్ 12 పరుగులు చేసి నిష్క్రమించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహన్ కన్హాయ్ 105 బంతుల్లో 55 పరుగులతో రాణించాడు. ఇతడికి జతకలిసిన కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ 85 బంతుల్లో 102 పరుగులు సాధించి విండీస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సర్ వివియన్ రిచర్డ్స్ 5 పరుగులకే అవుట్ కావడంతో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కీత్ బోయ్సే 34 పరుగులు చేయగా.. బెర్నార్డ్ జూలియన్ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. డెరిక్ ముర్రే 14, వాన్బర్న్ హోల్డర్ 6(నాటౌట్) పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 60 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. చాపెల్ రనౌట్ కావడంతో ఇక లక్ష్య ఛేదనకు దిగిన చాపెల్ బృందానికి ఓపెనర్ అలన్ టర్నర్ 40 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ రిక్ మెకాస్కర్(7) విఫలం కాగా.. అర్ధ శతకం సాధించి ప్రమాదకరంగా మారుతున్న కెప్టెన్ ఇయాన్ చాపెల్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. రిచర్డ్స్, లాయిడ్ కలిసి రనౌట్ చేశారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. గ్రెగ్ చాపెల్ 15 పరుగులు చేసి రనౌట్ కాగా.. వాలర్డ్స్ , రోడ్ మార్ష్, రాస్ ఎడ్వర్డ్స్, గ్యారీ గిల్మోర్, మాక్స్ వాకర్, జెఫ్ థామ్సన్, డెనిస్ లిలీ వరుసగా 35,11,28,14,7,21,16 పరుగులు చేశారు. విండీస్ బౌలర్ల ధాటికి నిలకవలేక 58.4 ఓవర్లలో 274 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి చాంపియన్‌గా లాయిడ్ బృందం తద్వారా 17 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించి వెస్టిండీస్ తొట్టతొలి చాంపియన్‌గా నిలిచింది. శతక వీరుడు విండీస్ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. ఆ తర్వాత 1979 వరకు వెస్టిండీస్ చాంపియన్‌గా కొనసాగడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు, భారత్, వెస్టిండీస్ చెరో రెండుసార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్ ఒక్కోసారి గెలవగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకు మాత్రం ఈ ఐసీసీ ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. చదవండి: Ranji Trophy 2022: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి -
అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మొదలైన తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలిరోజే 17 వికెట్లు కుప్పకూలాయి. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరజట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 132 పరుగులకు చాప చుట్టేయగా.. ఆ తర్వాత ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. పిచ్ ఇలాగే ఉంటే మూడురోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశముంది. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు జరుగుతున్న లార్డ్స్ పిచ్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ''లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో 17 వికెట్లు ఒకేరోజు కూలాయి.. బౌలర్ల స్కిల్ కనిపించింది. గతంలో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య అహ్మదాబాద్ టెస్టు(2021)లో మరి ఇదే స్థితి ఏర్పడింది. అప్పుడు పిచ్‌ను తప్పుబడుతూ కొందరు మొత్తుకున్నారు.. మరి ఇప్పుడేం మాట్లాడరా'' అంటూ చురకలంచటించాడు. అంతేకాదు లార్డ్స్ పిచ్‌ను ట్రోల్చేస్తూ.. సల్మాన్ నటించిన 'రెడీ' సినిమాలోని ''మైన్ కరూన్ తూ సాలా క్యారక్టెర్ దీలా హై'' అనే పాటను జతచేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2021లో టీమిండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ అహ్మదాబాద్ వేదికగా పింక్‌బాల్ టెస్టు(డే నైట్) ఆడింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలిరోజే 112 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ కూడా తొలి రోజే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 145 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా 22 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. టీమిండియా ముందు 49 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అలా పింక్‌బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు.. ఓవరాల్‌గా 11 వికెట్లు సాధించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ కూడా ఏడు వికెట్లు తీసి అక్షర్‌కు సహకరించాడు. అయితే ఈ టెస్టు ముగియగానే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ వరుస విమర్శలు సంధించాడు. ''నాసిరకం పిచ్ తయారు చేశారని.. ఇలాంటి పిచ్‌పై రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు'' అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. అయితే అప్పట్లో టీమిండియా అభిమానులు వాన్‌కు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. చదవండి: వారెవ్వా.. అరంగేట్రంలోనే అదుర్స్.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. When 17 wkts fall in a day at Lord's, talk is about skills of the bowlers. When 17 wkts fall in a day at Ahmedabad, talk is about conditions. #ENGvNZ pic.twitter.com/2sl4n26Cn3 — Wasim Jaffer (@WasimJaffer14) June 3, 2022 -
చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌లో లార్డ్స్ స్టేడియానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు, మేజర్ టోర్నీలు జరిగినా ఫైనల్ మ్యాచ్ మాత్రం లార్డ్స్ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్ బాల్కనీ నుంచి కప్‌ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు. అలాంటి పేరున్న లార్డ్స్ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది. జూన్ 2న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) టికెట్స్ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్‌పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్‌కు అంత టికెట్ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడం బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. సోమవారం సాయంత్రం వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఫుల్‌క్రేజ్ వచ్చింది. కాగా లార్డ్స్ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీని ట్విటర్ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్‌పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్‌తో కలిసి మ్యాచ్ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్‌ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..! T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Lords not being full this week is embarrassing for the game .. Try & blame the Jubilee if they want but I guarantee if tickets weren’t £100 - £160 it would be jam packed !!! Why are they so expensive ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 How about working out a way to get the tickets remaining at Lords to kids with a parent for £40 to make sure it is full .. it’s the school holidays and lots of kids will be around to go to the Test match ?? @HomeOfCricket ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 -
IND Vs ENG: నన్ను ఎందుకు ఆడించలేదంటే...
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు నలుగురు పేసర్లతో ఆడింది. రెండో టెస్టుకు వచ్చే సరికి శార్దుల్ గాయపడగా, అతని స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చని అంతా భావించారు. కానీ ఈ సారి కూడా అదే నలుగురు పేసర్లు వ్యూహాన్ని టీమిండియా అనుసరించింది. అయితే అశ్విన్‌ను ఆడించేందుకు టీమ్ మేనేజ్మెంట్ దాదాపుగా సిద్ధపడగా...ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అశ్విన్ స్వయంగా వెల్లడించాడు. టీమ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌తో అతను దీనిని పంచుకున్నాడు. ‘మ్యాచ్ జరిగే రోజుల్లో ముందస్తు వాతావరణ సూచన చూస్తే బాగా ఎండ కాస్తుందని, వేడి గాలులు వీస్తాయని ఉంది. మ్యాచ్ ఆడేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అని నాతో టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది కూడా. అయితే మ్యాచ్ రోజు మేం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా చల్లగా మారిపోయి చినుకులు కురుస్తున్నాయి. దాంతో నాకు చోటు దక్కలేదు. వాతావరణం మన చేతుల్లో లేదు కదా’ అని అశ్విన్ వెల్లడించాడు. -
‘లార్డ్స్’లో భారత ఘనవిజయం
రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ.... ఈ ఇద్దరు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌లో పంత్ ఒక్కడే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్. అతడు అవుటైతే ఇంకో ఐదో పదో పరుగులకు కూలిపోవచ్చనే సందేహం... ఇషాంత్‌కు ముందే పంత్ ఔటయ్యాడు. తర్వాత ఇషాంత్ కూడా పెవిలియన్ చేరాడు. కానీ అనుకున్నట్లుగా ఇన్నింగ్స్ కూలలేదు సరికదా అసలు మరో వికెటే పడలేదు! బంతులతో చెలరేగే బౌలర్లు షమీ, బుమ్రా బ్యాటింగ్‌తో అద్భుతమే చేశారు. వికెట్ పతనాన్ని అక్కడితోనే ఆపేసి... పరుగులకు బాట వేశారు. తర్వాత మళ్లీ వాళ్లిద్దరే ఇంగ్లండ్ ఓపెనర్లను డకౌట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్ ఆఖరి వికెట్ తీసి శుభం కార్డు వేయడంతో లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. లండన్: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’...ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లి చెప్పిన మాట ఇది! అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్లో, ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు గెలిచే వరకు ఆగలేదు. భారత్‌కు లార్డ్స్‌లో అద్భుత విజయాన్నిచ్చారు. రెండో టెస్టులో ఆఖరి రోజు మొదట భారత బౌలర్లు బ్యాటింగ్‌లో ‘కింగ్’లయ్యారు. తిరిగి బౌలింగ్‌తో బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కష్టాల్లో ఉన్న భారత్‌ను షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌ను 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా బాట వేయగా...ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ ముగిం చాడు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 181/6తో సోమవారం ఆట ప్రారంభించిన అనం తరం రిషభ్ పంత్ (22) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాంత్ (16) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో షమీ–బుమ్రా భాగస్వామ్యం అద్భుతాన్నే చేసింది. సిరాజ్‌కు 4 వికెట్లు భారత్ నిర్దేశించిన లక్ష్యం 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్ సహా టాపార్డర్ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్లోకి ఈ సారి సిరాజ్ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్ చేర్చాడు. షమీ–బుమ్రా బ్యాటింగ్ సత్తా మనం డ్రా చేసుకుంటే చాలనుకునే పరిస్థితి నుంచి ప్రత్యర్థి డ్రాతో గట్టెక్కితే చాలనే స్థితికి తీసుకొచ్చిన మహ్మద్ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. బంతులేసే బౌలర్లు ప్రధాన బ్యాట్స్‌మెన్ కంటే బాగా ఆడారు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ అందుబాటులో ఉన్న అస్త్రాల్ని ప్రయోగించాడు. మార్క్‌వుడ్, రాబిన్సన్, స్యామ్ కరన్ ఇలా ఎవరిని దించినా బుమ్రా, షమీ తగ్గలేదు. అలా అని టిక్కుటిక్కు అని డిఫెన్స్‌కే పరిమితం కాలేదు. క్రీజులో పాతుకుపోయే కొద్దీ షాట్లపై కన్నేశారు. బంతిని బౌండరీలైనును దాటించారు. ఇద్దరు టెస్టు ఆడినా... పరుగుల వేగం వన్డేలా అనిపించింది. ముఖ్యంగా 40 పరుగుల వద్ద ఉన్న షమీ వరుస బంతుల్లో 4, 6 కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం. మొదట లాంగాన్‌లో బౌండరీ బాదిన షమీ మరుసటి బంతిని ముందుకొచ్చి డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది కాస్తా ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఈ ఇద్దరి సమన్వయం కుదరడంతో ఇంగ్లండ్ బౌలింగ్ దళం చెదిరింది. ఈ జోడీని విడగొట్టే ప్రయత్నం ఫలించక, అటు పరుగులకు అడ్డుకట్ట వేయలేక ఆపసోపాలు పడ్డారు. అబేధ్యమైన భాగస్వామ్యం ఎంతకీ ముగియకపోగా, చివరకు భారత్ డిక్లేర్ చేసింది. అజేయమైన తొమ్మిదో వికెట్‌కు 20 ఓవర్లలోనే షమీ, బుమ్రా 89 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజార (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) అలీ 61; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 22; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (ఎల్బీ) (బి) రాబిన్సన్ 16; షమీ నాటౌట్ 56; బుమ్రా నాటౌట్ 34; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (109.3 ఓవర్లలో) 298/8 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175, 7–194, 8–209. బౌలింగ్: అండర్సన్ 25.3–6–53–0, రాబిన్సన్ 17–6–45–2, వుడ్ 18–4–51–3; కరన్ 18–3–42–1, అలీ 26–1–84–2, రూట్ 5–0–9–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) పంత్ (బి) షమీ 0; హమీద్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 9; రూట్ (సి) కోహ్లి (బి) బుమ్రా 33; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) ఇషాంత్ 2; బట్లర్ (సి) పంత్ (బి) సిరాజ్ 25; అలీ (సి) కోహ్లి (బి) సిరాజ్ 13; కరన్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; రాబిన్సన్ (ఎల్బీ) (బి) బుమ్రా 9; వుడ్ నాటౌట్ 0; అండర్సన్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (51.5 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–44, 4–67, 5–67, 6–90, 7–90, 8–120, 9–120, 10–120. బౌలింగ్: బుమ్రా 15–3–33–3; షమీ 10–5–13–1, జడేజా 6–3–5–0, సిరాజ్ 10.5–3–32–4, ఇషాంత్ 10–3–13–2. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Deepti Sharma: దీప్తి గంట కొట్టింది
లార్డ్స్: భారత్, ఇంగ్లండ్ జట్ల జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభించే అదృష్టం మన మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు దక్కింది. లార్డ్స్‌లో జరిగే ప్రతి టెస్టు జరిగే రోజు ఆట ఆరంభానికి సూచికగా గంట మోగించడం ఆనవాయితీ. ఆదివారం భారత ఆల్‌రౌండర్ దీప్తి గంట కొట్టి నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. 23 ఏళ్ల దీప్తి అక్కడ ‘ది హండ్రెడ్’ టోర్నీ లో లార్డ్స్ హోం గ్రౌండ్‌గా ఉన్న ‘లండన్ స్పిరిట్’ జట్టు తరఫున ఆడుతోంది. ‘క్రికెట్ మక్కా’లో గంట మోగించే గౌరవం లభించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. (చదవండి: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్?) -
‘రూట్’ అందించిన ఆధిక్యం
స్వల్పమే అయినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం చేజారింది. అయితే ఇంగ్లండ్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలగడమే మూడో రోజు ఆటలో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. తొలి రెండు సెషన్లలో ఇంగ్లండ్ జోరు చూపించినా... చివరి సెషన్లో చెలరేగిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. సహచరుల నుంచి చెప్పుకోదగ్గ సహకారం లభించకపోయినా కెప్టెన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో నిలవడం శనివారం ఆటలో హైలైట్ కాగా... టీమిండియా తరఫున సిరాజ్, ఇషాంత్ తమ ముద్ర చూపించారు. లండన్: ‘లార్డ్స్’ టెస్టులో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. శతక భాగస్వామ్యం... తొలి సెషన్లో ఇంగ్లండ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో ఓవర్లోనే రూట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. చూస్తుండగానే నాలుగో వికెట్ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఆ వెంటనే బెయిర్‌స్టో అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఈ సెషన్లో ఇంగ్లండ్ 97 పరుగులు చేయడం విశేషం. అయితే లంచ్ తర్వాత భారత్‌కు బ్రేక్ లభించింది. సిరాజ్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడబోయిన బెయిర్‌స్టో స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రూట్, బెయిర్‌స్టో 121 పరుగులు జోడించారు. అయితే మరో ఎండ్‌లో రూట్ తన జోరు కొనసాగించాడు. బుమ్రా బౌలింగ్‌లో సింగిల్ తీసిన రూట్ 200 బంతుల్లో తన కెరీర్లో 22వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం టెస్టుల్లో 9 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. రూట్‌కు ఆ తర్వాత బట్లర్ (23), మొయిన్ అలీ (27) కొద్ది సేపు సహకరించారు. వీరిద్దరితో రూట్ రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే ఇషాంత్ ఒక్కసారిగా చెలరేగడంతో ఇంగ్లండ్ పరిస్థితి మారిపోయింది. ముందుగా బట్లర్‌ను అవుట్ చేసిన ఇషాంత్... కొద్ది సేపటి తర్వాత వరుస బంతుల్లో అలీ, స్యామ్ కరన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో భారత్‌కంటే ఇంగ్లండ్ మరో 23 పరుగులు వెనుకబడి ఉంది. అయితే బాధ్యత తీసుకున్న రూట్... జట్టుకు ఆధిక్యం అందించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. చివరి సెషన్లో భారత బౌలింగ్ జోరుకు 77 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హసీబ్ (బి) సిరాజ్ 0; రూట్ (నాటౌట్) 180; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) సిరాజ్ 57; బట్లర్ (బి) ఇషాంత్ 23; అలీ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 27; స్యామ్ కరన్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0; రాబిన్సన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 6; వుడ్ (రనౌట్) 5; అండర్సన్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (128 ఓవర్లలో ఆలౌట్) 391. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108, 4–229, 5–283, 6–341, 7–341, 8–357, 9–371, 10–391. బౌలింగ్: ఇషాంత్ 24–4–69–3, బుమ్రా 26–6–79–0, షమీ 26–3–95–2, సిరాజ్ 30–7–94–4, జడేజా 22–1–43–0. -
Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే...
లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆటను భారత్, ఇంగ్లండ్ బౌలర్లు పది వికెట్లతో శాసించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్ శుక్రవారం హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి. లండన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జో రూట్ (75 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, 1 సిక్స్) టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. 36.1 ఓవర్లలో 88 పరుగులు... తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. శుక్రవారం తొలి ఓవర్ రెండో బంతికే రాహుల్‌ను రాబిన్సన్ అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ అజింక్య రహానే (1) తర్వాతి ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ స్థితిలో రవీంద్ర జడేజా (120 బంతుల్లో 40; 3 ఫోర్లు), రిషభ్ పంత్ (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించగా... తనదైన శైలిలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన పంత్, పేలవ షాట్ ఆడి నిష్క్రమించాడు. ఆ తర్వాత ముగ్గురు బౌలర్లు షమీ (0), ఇషాంత్ (8), బుమ్రా (0) వికెట్లను తీసేందుకు ఇంగ్లండ్‌కు ఎంతోసేపు పట్టలేదు. సిరాజ్ జోరు... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను రోరీ బర్న్స్ (136 బంతుల్లో 49; 7 ఫోర్లు), డామ్ సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. టీ సమయానికి 14 ఓవర్లలో 23 పరుగులు జత చేశారు. అయితే విరామం తర్వాత హైదరాబాదీ పేసర్ సిరాజ్ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వరుస బంతుల్లో సిబ్లీ, హసీబ్ హమీద్ (0)లను సిరాజ్ పెవిలియన్ పంపించాడు. 2016 నవంబర్‌లో తన చివరి టెస్టు ఆడిన హమీద్... 1717 రోజుల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించి తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో బర్న్స్, రూట్లపై జట్టును ఆదుకునే భారం పడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించి అంతా సాఫీగా సాగుతున్న సమయంలో షమీ.. బర్న్స్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. మరో వికెట్ పడకుండా రూట్, బెయిర్‌స్టో రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364. బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108. బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0. -
‘లార్డ్స్’ సమరానికి సై: ఇటు శార్దూల్.. అటు స్టువర్ట్ బ్రాడ్ అవుట్!
వర్షం పడకపోతే తొలి టెస్టులో ఎవరు గెలిచేవారు? మంచి అవకాశం కోల్పోయామని కోహ్లి చెప్పగా... ఆ సమయంలో మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని రూట్ కూడా వ్యాఖ్యానించాడు. సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశం చేజారినా... సుదీర్ఘ సిరీస్‌లో మరోసారి సత్తా చాటి ముందంజలో నిలిచేందుకు ఇరు జట్లకు రెండో అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు టీమ్‌లలోనూ బ్యాటింగ్ బలహీనతలు గత మ్యాచ్‌లో కనిపించగా... వాటిని ఎవరు అధిగమిస్తారనేది చూడాలి. లండన్: ఇంగ్లండ్ గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ జట్టు మరో సమరానికి తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. గురువారం నుంచి ‘లార్డ్స్’లో జరిగే రెండో టెస్టులో కోహ్లి సేన... ఆతిథ్య ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్‌పై ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. శార్దుల్ అవుట్ నాటింగ్‌హామ్‌లో ‘డ్రా’గా ముగిసిన తొలి టెస్టు నుంచి భారత తుది జట్టులో ఒక మార్పు ఖాయమైంది. పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో మరో పేస్ బౌలర్ ఇషాంత్ లేదా ఉమేశ్‌లకు అవకాశం ఇవ్వాలనేది టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ఒక ప్రత్యా మ్నాయం. అయితే ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంతో పోలిస్తే కొంత పొడిగా ఉండే లార్డ్స్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. పైగా కొంత బ్యాటింగ్‌ను బలంగా మార్చాలనే కారణంతోనే శార్దుల్‌కు తొలి టెస్టులో అవకాశం దక్కింది. అలా చూస్తే మంచి బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్న అశ్విన్‌వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్ తన చాన్స్ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. మరోవైపు భయపడినట్లుగానే భారత ప్రధాన బ్యాటింగ్ త్రయం పుజారా, కోహ్లి, రహానే గత టెస్టులోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో వీరు వరుసగా 4, 0, 1 పరుగులు చేశారు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉండదు. జడేజా ఆదుకోవడంతో సరిపోయింది కాబట్టి భారత్ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇక్కడ వీరు ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూ టీసీ) ఫైనల్లో విఫలమైన బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు. వీరికి అశ్విన్ పదునైన స్పిన్ జత కలిస్తే భారత్‌కు ఎదురుండదు. పిచ్, వాతావరణం: బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. మంచి ఎండ కాయడంతో పాటు పోలిస్తే వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టె న్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: రూట్, బర్న్స్, సిబ్లీ, హసీబ్ హమీద్, బెయిర్‌స్టో, బట్లర్, అలీ, స్యామ్ కరన్, రాబిన్సన్, వుడ్, ఒవర్టన్/సాఖిబ్. స్టువర్ట్ బ్రాడ్ అవుట్ రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ దెబ్బ తగిలింది. సీనియర్ పేస్ బౌలర్, కెరీర్లో 150వ టెస్టు ఆడాల్సి ఉన్న స్టువర్ట్ బ్రాడ్ గాయం కారణంగా మ్యాచ్‌తో పాటు పూర్తిగా సిరీస్‌కే దూరమయ్యాడు. అతని స్థానంలో మార్క్ వుడ్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన వుడ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది చెప్పలేం. ఇక మరో సీనియర్ అండర్సన్ ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలున్నాయి. ఈసీబీ అధికారికంగా ప్రకటించలేదు కానీ గాయం తీవ్రంగా ఉండి అండర్సన్ కూడా దూరమైతే ఇంగ్లండ్ ఒక్కసారిగా బలహీనంగా మారిపోవడం ఖాయం. అండర్సన్ స్థానంలో ముందు జాగ్రత్తగా సాఖిబ్ మహమూద్‌ను జట్టులోకి తీసుకున్నారు. బౌలింగ్ ఇలా ఉండగా బ్యాటింగ్‌లో ఆ జట్టు పరిస్థితి మరీ పేలవంగా ఉంది. తొలి టెస్టులో రూట్ ఆదుకోకపోయుంటే ఇంగ్లండ్ ఎప్పుడో కుప్పకూలి సునాయాసంగా ఓడిపోయేది. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ బృందం స్వదేశంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్... ఇలా అంతా విఫలం కావడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు! ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి మళ్లీ టెస్టు టీమ్‌లో స్థానం లభించింది. భారత్‌పై మంచి రికార్డు ఉన్న అలీ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కూడా ప్రభావం చూపించగలడు. క్రాలీ స్థానంలో హమీద్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. తొలి టెస్టులో ‘స్లో ఓవర్ రేట్’ను నమోదు చేసిన భారత్, ఇంగ్లండ్ జట్లపై ఐసీసీ చర్య తీసుకుంది. ఇరు జట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లనుంచి చెరో 2 పాయింట్లు కోత విధించారు. అంటే నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయితే దక్కే 4 పాయింట్లలో ఒక్కో జట్టుకు ఇప్పుడు రెండేసి పాయిట్లు మాత్రమే లభిస్తాయి. దీంతో పాటు మ్యాచ్ ఫీజులో ఒక్కో జట్టుకు 40 శాతం జరిమానా కూడా ఐసీసీ విధించింది. -
లార్డ్స్ మైదానంలో టీమిండియా తొలి విజయం.. నేటితో 35 ఏళ్లు
చాలా మంది క్రికెటర్లు లార్డ్స్ క్రికెట్ స్టేడియాన్ని దేవాలయంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా లార్డ్స్ మైదానంలో ఆడలాని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. కాగా ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 35 సంవత్సరాల క్రితం 1986 లో ఈ రోజున తొలి విజయాన్ని నమోదుచేసుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా అతిథ్య ఇంగ్లండ్ జట్టుపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కపిల్‌దేవ్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అవ్వగా , రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. ఇంగ్లండ్ జట్టులో తొలి ఇన్సింగ్స్‌లో గ్రహమ్ గూచ్ 114 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 341 పరుగులను చేయగా రెండో ఇన్సింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులను చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ విజయానికి 23 పరుగుల దూరంలో క్రీజులోకి వచ్చిన కపిల్‌దేవ్ కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 23 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్‌కు లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో కపిల్ దేవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైయ్యాడు టీమిండియా నుంచి తొలి ఇన్నింగ్స్‌లో దిలీప్ వెంగ్‌సర్కార్ 126 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో తొలి విజయాన్నిఅందుకున్న భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌తో అతిథ్య ఇంగ్లండ్ జట్టును ముప్ఫుతిప్పలు పెట్టారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో రోజర్ బిన్నీ, చేతన్ శర్మ, మొహిందర్ అమర్నాథ్, రవిశాస్త్రి, మనీందర్ సింగ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్ భారత జట్టు తరపున ఆడారు. ప్రస్తుత టీమిండియా జట్టు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు సిద్దమౌతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: WTC Final : లెజెండ్‌తో నేను సిద్ధంగా ఉన్నా -
డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగేది ఎక్కడో తెలుసా?
ముంబై: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదిక మారనుంది. తొలుత ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో నిర్వహించాలని ఐసీసీ భావించినప్పటికీ.. వివిధ కారణాల చేత వేదికను సౌథాంప్టన్‌కు మార్చాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అయితే ఈ అంశంపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వేదిక మార్పు అంశం ఐసీసీ పరిధిలో ఉంటుంది. కానీ బీసీసీఐ అధ్యక్షుడు ఐసీసీతో ఎటువంటి సంప్రదింపులు జరుపకుండా ఏకపక్ష నిర్ణయాన్ని వెల్లడించడం పలు సందేహాలకు తావిస్తుంది. ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరిస్తున్న బీసీసీఐ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే లండన్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగానే వేదికను లార్డ్స్ నుంచి సౌథాంప్టన్‌కు తరలించారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య సౌథాంప్టన్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నామని, అందులో భాగంగానే వేదికను మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు క్లిష్ట పరిస్థితుల్లో సాగాయన్నాడు. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘తొలి ప్రేమ’ పుట్టిన వేళా విశేషం..
జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా మొదటి గెలుపు ఇచ్చే కిక్కే వేరప్పా! మన గురించి మనం చెప్పుకుంటే ఇలాంటి భావన చాలా మందిలో సాధారణమే. సరిగ్గా ఇలాంటిదే భారత క్రికెట్‌కు కూడా వర్తింపజేస్తే ఆ తొలి గెలుపు విలువేమిటో మనకు తెలుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే 1983 వన్డే వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్ గెలవడం అలాంటి అపూర్వ ఘట్టమే. రోజుకు 1500 రూపాయల మ్యాచ్ ఫీజుల నుంచి కోట్లాది రూపాయల కనకవర్షం కురిపించే స్థాయికి క్రికెట్ చేరిందంటే అది ఈ గెలుపు చలవే. భారత క్రికెట్ గతిని మార్చేసిన ఈ ఘనతకు నేటితో 37 ఏళ్లు. క్రికెట్లో విశ్వ విజేతగా నిలిచే సమయానికి భారత్‌లో హాకీదే హవా. అప్పటికే ఒకసారి ప్రపంచకప్ గెలవగా... 1980 మాస్కో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణంతో ఏకంగా ఎనిమిది పసిడి పతకాల రికార్డు మన ఖాతాలో ఉంది. అలాంటి సమయంలో వచ్చిన కపిల్‌దేవ్ బృందం సాధించిన వరల్డ్‌కప్ విజయం దేశంలో క్రికెట్‌కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఈ ఆట పంచిన వినోదం దేశంలో అద్భుతాలను సృష్టించింది. వరల్డ్‌కప్ తర్వాత ఒకవైపు క్రికెట్ ఉజ్వలంగా వెలుగుతూ ఉవ్వెత్తున దూసుకుపోగా.... దానికి వ్యతిరేక దిశలో హాకీ పతనం కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత భారత్‌లో తిరుగులేని ఆటగా, ఒక మతంగా క్రికెట్ మారిపోయింది. అంచనాలు లేకుండా... 1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్ 3 మ్యాచ్‌లలో ఒకటే, అదీ ఎవరూ పట్టించుకోని ఈస్ట్ ఆఫ్రికాపై గెలిచింది. 1979లో రెండో ప్రపంచకప్‌లో ఆ విజయం కూడా దక్కకుండా సున్నాకు సున్నా మార్కులే వచ్చాయి. పైగా వరల్డ్‌కప్‌లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్ సొంతగడ్డపై 2 మాత్రమే గెలిచి, మిగతా 8 ఓడింది. ఇలాంటి నేపథ్యంతో బరిలోకి దిగిన 1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరకు అందరి లెక్కలను తలకిందులు చేస్తూ తుదిపోరుకు భారత్ అర్హత సాధించింది. లీగ్ దశలో గ్రూప్‌లోని మిగిలిన 3 జట్లతో రెండేసిసార్లు భారత్ తలపడింది. వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపు... 66 పరుగులతో ఓటమి; ఆస్ట్రేలియాపై 162 పరుగులతో ఓటమి... 118 పరుగులతో విజయం; జింబాబ్వేపై 5 వికెట్లతో... 31 పరుగులతో విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. 4 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్ చేరిన మన టీమ్ సెమీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 6 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. అద్భుతం ఆవిష్కృతం... జూన్ 25, 1983... ఫైనల్‌కు వెళ్లినా, అప్పటికే లీగ్‌లో ఓడించినా సరే... దుర్బేధ్యమైన లైనప్ ఉన్న డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో గెలుపు అంత సులువు కాదని అందరికీ తెలుసు. పైగా ముందుగా బ్యాటింగ్ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్ డెవిల్స్ మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. తమ సర్వశక్తులూ ఒడ్డి వెస్టిండీస్ జట్టును 140 పరుగులకే ఆలౌట్ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన క్షణాన లార్డ్స్ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది. ప్రపంచ క్రికెట్‌పై భారత్ ముద్ర పడిన ఆ క్షణం ఎప్పటికీ మరచిపోలేని మధుర ఘట్టంగా మిగిలిపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
అయ్యో... ఐర్లాండ్
పటిష్టమైన ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కనీసం వంద పరుగులైనా చేయకుండా అడ్డుకుని, ఆపై బ్యాటింగ్‌లో మెరుగ్గా ఆడి చెప్పుకోదగ్గ ఆధిక్యం సాధించిన ఐర్లాండ్ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ స్థాయి ఆటను కనబర్చలేకపోయింది. బౌలింగ్‌లో పట్టువిడిచి, బ్యాటింగ్‌లో చేతులెత్తేసి అత్యల్ప స్కోరుకు కుప్పకూలింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో సంచలన విజయం సాధించే సువర్ణావకాశాన్నీ చేజార్చుకుంది. లండన్: ఇంగ్లండ్ దెబ్బకు ఐర్లాండ్ హడలెత్తిపోయింది. 181 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు పేసర్లు క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ ధాటికి నిలవలేక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 38 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 143 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన నాలుగు రోజుల టెస్టు మూడో రోజే ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 303/9తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ అదే స్కోరు వద్ద ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్ ఏదశలోనూ లక్ష్యం అందుకునేలా కనిపించలేదు. నాలుగో ఓవర్ చివరి బంతికి కెప్టెన్ పోర్టర్‌ఫీల్డ్ (2)ను పెవిలియన్ చేర్చిన వోక్స్... ప్రత్యర్థి పతనానికి బాటలు వేశాడు. ఆ వెంటనే మరో ఎండ్‌లో బాల్‌బ్రైన్ (5)ను బ్రాడ్ బలిగొన్నాడు. వోక్స్ ప్రతాపానికి స్టిర్లింగ్ (0) ఖాతా కూడా తెరవలేకపోయాడు. జేమ్స్ మెకల్లమ్ (11), విల్సన్ (0)లను మూడు బంతుల వ్యవధిలో అతడే ఔట్ చేశాడు. దీంతో ఐర్లాండ్ 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్రాడ్ విజృంభించి మూడు వికెట్లు తీశాడు. ముర్టాగ్ (2) వికెట్లను గిరాటేసి వోక్స్ లాంఛనం పూర్తిచేశాడు. మూడో బౌలర్ ప్రమేయం లేకుండా 15.4 ఓవర్ల (బ్రాడ్ 8; వోక్స్ 7.4)లోనే ఐర్లాండ్ కథ ముగియడం విశేషం. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో మెకల్లమ్ చేసినవే అత్యధిక పరుగులు. ఏకైక రెండంకెల స్కోరూ అదే కావడం గమనార్హం. ముగ్గురు డకౌటవగా మరొకరు సున్నా పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. 11వ నంబర్ ఆటగాడే అయినా...రెండో ఇన్నింగ్స్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి 92 పరుగులు చేసిన ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ తన బ్యాటింగ్ ప్రదర్శనకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
ప్రపంచ కల నెరవేరింది
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది... ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది. ఔను...! ఇంగ్లండ్ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది... లండన్ : ఇంగ్లండ్ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఓవర్ ఎలిమినేటర్ పద్ధతిలో ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విలియమ్సన్ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్ (3/43), ఫెర్గూసన్ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్‌హోమ్ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటం, బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో తేరుకుంది. నికోల్స్ నిలిచాడు... లాథమ్ ఆడాడు కివీస్ ఓపెనింగ్ జంట నికోల్స్, గప్టిల్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపిన గప్టిల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి కివీస్‌కు ప్లంకెట్ షాకిచ్చాడు. అతడి గుడ్ లెంగ్త్ బంతి విలియమ్సన్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్‌ను సాగనంపాడు. అంపైర్ ఎరాస్మస్ తప్పుడు నిర్ణయానికి రాస్ టేలర్ (15) బలయ్యాడు. ఆల్‌రౌండర్ నీషమ్ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. గ్రాండ్‌హోమ్ (16) అండగా లాథమ్ బండి లాగించాడు. వోక్స్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్‌ట్నర్ (5 నాటౌట్) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇంగ్లండ్ కష్టంగానైనా అందుకుంది... ఇంగ్లండ్ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతే ఓపెనర్ జేసన్ రాయ్ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్ ఎరాస్మస్ ఔటివ్వకపోవడంతో కివీస్ సమీక్ష కోరింది. బంతి లెగ్ స్టంప్ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్‌ను ఊగిసలాటలో పడేసి వికెట్ దక్కించుకున్నాడు. రూట్ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్హోమ్పై ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. బెయిర్ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్ (9) పేలవ షాట్‌కు ఔటయ్యాడు. అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్–బట్లర్ ఐదో వికెట్‌కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు. సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్ ఓవర్లో బట్లర్ షాట్‌కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్ పోరాడుతున్నా... వోక్స్ (2)ను పెవిలియన్ చేర్చి కివీస్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్ (10), ఆర్చర్ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి నీషమ్ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్ తొలి రెండు బంతులకు స్టోక్స్ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్‌లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్ త్రో స్టోక్స్‌కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్ (0), వుడ్ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి ఐదు ఓవర్లు హైడ్రామా... ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్ రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్ (46.1), ప్లంకెట్ (48.3), ఆర్చర్ (48.6) ఔటవ డంతో కప్ న్యూజిలాండ్‌దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్ సిక్స్, ఓవర్ త్రో రూపంలో 2 ప్లస్ 4 పరుగులు రావడంతో తలకిందులైంది. బౌల్ట్ క్యాచ్... సిక్స్... మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్ పాయింట్ నీషమ్ ఓవర్లో స్టోక్స్ కొట్టిన సిక్స్ షాట్. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్ మిడ్ వికెట్‌లోకి భారీ షాట్ ఆడగా... బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్‌కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్‌ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్ గప్టిల్ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్ నమోదైంది. బోనస్‌గా స్టోక్స్‌కు లైఫ్ వచ్చింది. ప్రధాన పేసర్ అయిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్‌కు వేదన మిగిల్చింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ (ఎల్బీడబ్ల్యూ) వుడ్ 15; లాథమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 16; సాన్‌ట్నర్ (నాటౌట్) 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241 వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240. బౌలింగ్: వోక్స్ 9–0–37–3; ఆర్చర్ 10–0–42–1; ప్లంకెట్ 10–0–42–3; వుడ్ 10–1–49–1; రషీద్ 8–0–39–0; స్టోక్స్ 3–0–20–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9, స్టోక్స్ (నాటౌట్) 84; బట్లర్ (సి) సబ్ (సౌతీ) (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ (రనౌట్) 0; మార్క్ వుడ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241. బౌలింగ్: బౌల్ట్ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్ 10–2–25–1, ఫెర్గూసన్ 10–0–50–3, నీషమ్ 7–0–43–3, సాన్‌ట్నర్ 3–0–11–0. సూపర్ ఓవర్ సాగిందిలా... నోట్: సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్ 17 బౌండరీలు సాధించింది. స్టోక్స్... మాస్టర్ స్ట్రోక్... ప్రపంచ కప్ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్‌కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్ స్టోక్స్‌కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్‌కు ఒక కప్ (2017 టి20 ప్రపంచ కప్) చేజారింది. భారత్ వేదికగా జరిగిన నాటి కప్ ఫైనల్లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో కార్లొస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండీస్‌కు కప్‌ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్ పిచ్ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్‌లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది. గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గప్టిల్‌ను ఓదార్చుతున్న నీషమ్ -
‘ఫైనల్’ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్
లండన్: విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరుగనున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) థర్డ్ అంపైర్ కాగా, అలీమ్ దార్ (పాకిస్తాన్) నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బృందం గురువారం నాటి ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కూ పనిచేసింది. అయితే, ధర్మసేన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. యూకేలో ఫైనల్ ఉచిత ప్రసారం సొంతగడ్డపై టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఆదివారం జరుగబోయే ప్రపంచ కప్ ఫైనల్‌ను ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్ణయించారు. యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుత కప్‌కు సంబంధించి యూకేలో ప్రసార హక్కులను చానెల్ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్‌తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్ ఫైనల్ చేరిన నేపథ్యంలో చానెల్ 4 మెత్తబడి మెట్టుదిగింది. -
భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో మ్యారేజ్ ప్రపోజల్
లండన్ : లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఈ చర్యతో కాసింత సిగ్గుపడిన ఆ యువతి తర్వాత అతని ప్రపోజల్‌ను అంగీకరించింది. అతడు ఇచ్చిన రింగ్‌ను స్వీకరించింది. దీంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి. కామెంటేటర్స్ కూడా దీనిపై తమదైన శైలిలో స్పందించారు. ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్ చాహల్ కూడా క్లాప్స్ కొడుతు వారికి శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఆ వ్యక్తి ప్రపోజ్ చేసిన సమయంలో ‘డెసిషన్ పెండింగ్’ అంటూ.. ఆమె అతని ప్రపోజల్ అంగీకరించిన తర్వాత ‘షీ సెడ్ యస్’ అంటూ టీవీ స్ర్కీన్‌పై ప్లాష్ నిచ్చారు. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ ప్రపోజల్‌ను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వారిద్దరిని కామెంటేటర్స్ బాక్స్‌లోకి పిలిచిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ అధికారులు వారికి చిన్నపాటి బహుమతి కూడా అందజేసినట్టు సమాచారం. గతంలో కూడా క్రికెట్ మ్యాచ్‌లు జరగుతున్న సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 86 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. -
మ్యాచ్‌లో మ్యారేజ్ ప్రపోజల్..వైరల్!
-
ప్రముఖ నటుడి భావోద్వేగపూరిత లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి జీవితం నీటిలో తేలియాడుతున్న బెండు లాంటిది. కెరటాల ధాటికి దాని ఉనికి ప్రశ్నార్థమవుతుంటే.. ప్రకృతి ప్రసాదించిన జీవితాన్ని నేర్పుతో తీర్చిదిద్దుకోవాలే గానీ, కెరటాల్నే అదుపు చేస్తామని భ్రమపడటం మూర్ఖత్వమే అవుతుందంటున్నారు బాలీవుడ్ క్లాసిక్ హీరో ఇర్ఫాన్‌ఖాన్. ఒక్క సంఘటనతో జీవితం తల్లకిందులు కావొచ్చని చెప్తున్నారు. అరుదైన న్యూరో ఎండోక్రైన్ అనే క్యాన్సర్ వ్యాధి బారిన పడిన ఆయన లండన్‌లో చికిత్స పొందుతున్నారు. తన జీవితం ముగుస్తుందనే భయానక పరిస్థితుల నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలను ఇర్ఫాన్ సోదాహరణంగా ఒక లేఖలో పేర్కొన్నారు. ఒక జాతీయ పత్రికకు ఇర్ఫాన్ రాసిన భావోద్వేగపూరిత లేఖలో ఏముందంటే.. ‘రైలులో ప్రయాణిస్తున్నాను. నేను చేరుకోవాల్సిన గమ్యం మరెంతో దూరం ఉంది. జర్నీలో నా గతాన్ని, ఆశలతో కూడిన నా భవిష్యత్తును తలచుకుంటూ హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. అనుకోకుండా నా ఊహాలోకంలో అలజడి. ఎవరిదో చేయి నా భుజంపై పడింది. తిరిగి చూస్తే.. టికెట్ కలెక్టర్..! ‘నువ్వు దిగాల్సిన స్టేషన్ వచ్చింది. సర్దుకో అని సూచన’. అదెలా..! నేను ప్రయాణించాల్సిన దూరం మరెంతో ఉంది అన్నాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. ‘మీరు దిగాల్సిందే అంటూ నన్ను బలవంతంగా రైలులోంచి తోసేసే పరిస్థితి తలెత్తింద’ని పేర్కొన్నారు. ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం అని లేఖలో చెప్పుకొచ్చారు. దేవుడి దయ వల్ల, ఎందరో అభిమానుల ఆశిస్సుల వల్ల ఇంకా ప్రాణాలతో ఉన్నానని తెలిపారు. ‘ప్రసిద్ధ మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనేది నా చిన్ననాటి కల. కానీ, ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నాను. ఆస్పత్రి నుంచి బయటికి చూసినప్పుడు.. లార్డ్స్ స్టేడియంలో వేలాడుతున్న వివిఎన్ రిచర్డ్స్ పోస్టర్ కనిపించింది. అందులో చిరునవ్వు చిందిస్తున్న రిచర్డ్స్‌ను చూసినప్పుడు అనిపించింది. భూమ్మీద నూకలు ఉంటే అంతా మంచే జరుగుతుందనే సత్యం బోధపడింది. చావు బతుకుల మధ్య పోరాటం ఎప్పటికీ ఉండేదే’ అంటూ క్యాన్సర్‌పై తన స్వీయ పోరాటాన్ని తెలిపారు ఇర్ఫాన్. -
హార్దిక్ పాండ్యా స్థానంలో షమీ
లార్డ్స్ మైదానంలో గురువారం వెస్టిండీస్‌తో తలపడే ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు నుంచి భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా దూరమైన అతని స్థానంలో పేసర్ మొహమ్మద్ షమీకి చోటు లభించింది. మరో భారత ఆటగాడు దినేశ్ కార్తీక్‌తో కలిసి షమీ బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను కూడా ఎంపిక చేశారు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది. -
మా ఆయన చేసింది ఫెంటాస్టిక్..!
భారత్‌లోని క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన అది. 2002 జూలై 13.. భారత జట్టు.. ఇంగ్లండ్ గడ్డ మీద లార్డ్స్ మైదానంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటికీ యువకులైన యువరాజ్‌సింగ్, మహమ్మద్ కైఫ్ అద్భుతంగా రాణించడంతో నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. చరిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయానందంలో ఉప్పొంగిపోయిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఎవరూ ఊహించనిరీతిలో చొక్కావిప్పి గాల్లోకి ఎగరేస్తూ.. క్రికెట్ మక్కా లార్డ్స్ బాల్కనీలో జరిపిన సంబరం.. ప్రతి క్రికెట్ ప్రేమికుడి మదిలో మెదులుతూ ఉంటుంది. ఆనాడు గంగూలీ చేసిన ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. అది అసంకల్పితంగా చేసిన చర్య అని గంగూలీ సైతం వివరణ ఇచ్చారు. తాజాగా ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో గంగూలీ భార్య డొనా ఈ ఘటనపై స్పందించారు. గంగూలీ ఆనాడు చేసిన చర్య ఫెంటాస్టిక్ అని కితాబిచ్చారు. గంగూలీ మాట్లాడుతూ.. ‘అలా ఇప్పుడు చేయలేను. ప్రతిసారీ స్పోర్ట్స్ చానెల్లో ఆ దృశ్యాన్ని చూపిస్తారు. నేను ఓసారి టీవీ ఎడిటర్‌కు ఫోన్‌చేసి.. నేను 20వేల అంతర్జాతీయ పరుగుల చేశాను. అది చూపించవచ్చు కదా అంటే.. అది చెప్పడానికే ఈ దృశ్యాన్ని వేస్తున్నట్టు చెప్పారు. ఎంతో సంతృప్తితో నేను అలా చేశాను. హానర్ బోర్డు మీద నా పేరు (లార్డ్స్ మైదానంలో గంగూలీ తొలి టెస్టు సెంచరీ సాధించాడు) ఉన్న సంగతి మర్చిపోకూడదు. అది ఎప్పటికీ నాకు స్పెషల్‌గా మిలిగిపోతుంది’ అని చెప్పాడు. -
ఆస్ట్రేలియా క్రికెటర్ కు తప్పిన ముప్పు
లండన్: ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఆసీస్ జట్టు లండన్ కు చేరుకుంది. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో మ్యాక్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నెట్స్ లో ఓ బౌలర్ విసిరిన బంతి తాకడంతో మ్యాక్స్ వెల్ విలవిల్లాడిపోయాడు. దీంతో తమ సహచరుడికి ఏమైందోనని ఆసీస్ ఆటగాళ్లు కంగారుపడ్డారు. బంతి తాకిన తర్వాత మ్యాక్స్ బాధతో అలాగే నిలుచుండిపోయాడు. ఆసీస్ సహచరులతో పాటు టీమ్ ఫిజియో పీటర్ బ్రక్నర్ పరుగున మ్యాక్స్ వద్దకు వచ్చారు. మ్యాక్స్ వెల్ మెడ పై భాగంలో, దవడకు స్వల్ప గాయమైనట్లు సమాచారం. ఆపై బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేసి.. ఫిజియోతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ విసిరిన బంతి మ్యాక్స్ వెల్ దవడ భాగంలో తాకినట్లు టీమ్ ఫిజియో పీటర్ బ్రక్నర్ తెలిపాడు. మళ్లీ 'కంగారు' పడ్డారు! హెల్మెట్ ధరించడంతో తీవ్రమైన గాయం కాలేదని, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే చాలన్నాడు. శుక్రవారం జరగనున్న వార్మప్ మ్యాచ్ లో ఓవల్ మైదానంలో రెండుసార్లు ఛాంపియన్ అయిన ఆసీస్, శ్రీలంకతో తలపడనుంది. మ్యాక్స్ వెల్ గాయం తీవ్రతపై ఆసీస్ క్రికెట్ బోర్డు పూర్తి వివరాలు వెల్లడించలేదు. గతంలో ఆసీస్ ప్లేయర్ ఫిల్ హ్యూస్.. హెల్మెట్ ధరించినా బౌలర్ విసిరిన బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలి చనిపోయిన విషయం విదితమే. దీంతో అప్పటినుంచీ ఏ క్రికెటర్ కు బంతి తగిలినా ఆ జట్టులో కంగారు తప్పడం లేదు.