ఆస్ట్రేలియా క్రికెటర్ కు తప్పిన ముప్పు
లండన్: ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఆసీస్ జట్టు లండన్ కు చేరుకుంది. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో మ్యాక్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నెట్స్ లో ఓ బౌలర్ విసిరిన బంతి తాకడంతో మ్యాక్స్ వెల్ విలవిల్లాడిపోయాడు. దీంతో తమ సహచరుడికి ఏమైందోనని ఆసీస్ ఆటగాళ్లు కంగారుపడ్డారు.
బంతి తాకిన తర్వాత మ్యాక్స్ బాధతో అలాగే నిలుచుండిపోయాడు. ఆసీస్ సహచరులతో పాటు టీమ్ ఫిజియో పీటర్ బ్రక్నర్ పరుగున మ్యాక్స్ వద్దకు వచ్చారు. మ్యాక్స్ వెల్ మెడ పై భాగంలో, దవడకు స్వల్ప గాయమైనట్లు సమాచారం. ఆపై బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేసి.. ఫిజియోతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ విసిరిన బంతి మ్యాక్స్ వెల్ దవడ భాగంలో తాకినట్లు టీమ్ ఫిజియో పీటర్ బ్రక్నర్ తెలిపాడు.
మళ్లీ 'కంగారు' పడ్డారు!
హెల్మెట్ ధరించడంతో తీవ్రమైన గాయం కాలేదని, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే చాలన్నాడు. శుక్రవారం జరగనున్న వార్మప్ మ్యాచ్ లో ఓవల్ మైదానంలో రెండుసార్లు ఛాంపియన్ అయిన ఆసీస్, శ్రీలంకతో తలపడనుంది. మ్యాక్స్ వెల్ గాయం తీవ్రతపై ఆసీస్ క్రికెట్ బోర్డు పూర్తి వివరాలు వెల్లడించలేదు. గతంలో ఆసీస్ ప్లేయర్ ఫిల్ హ్యూస్.. హెల్మెట్ ధరించినా బౌలర్ విసిరిన బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలి చనిపోయిన విషయం విదితమే. దీంతో అప్పటినుంచీ ఏ క్రికెటర్ కు బంతి తగిలినా ఆ జట్టులో కంగారు తప్పడం లేదు.