
లండన్: విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరుగనున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) థర్డ్ అంపైర్ కాగా, అలీమ్ దార్ (పాకిస్తాన్) నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బృందం గురువారం నాటి ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కూ పనిచేసింది. అయితే, ధర్మసేన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది.
యూకేలో ఫైనల్ ఉచిత ప్రసారం
సొంతగడ్డపై టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ఆదివారం జరుగబోయే ప్రపంచ కప్ ఫైనల్‌ను ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్ణయించారు. యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుత కప్‌కు సంబంధించి యూకేలో ప్రసార హక్కులను చానెల్ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్‌తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్ ఫైనల్ చేరిన నేపథ్యంలో చానెల్ 4 మెత్తబడి మెట్టుదిగింది.