లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆటను భారత్, ఇంగ్లండ్ బౌలర్లు పది వికెట్లతో శాసించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్ శుక్రవారం హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి.
లండన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జో రూట్ (75 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, 1 సిక్స్) టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం.
36.1 ఓవర్లలో 88 పరుగులు...
తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. శుక్రవారం తొలి ఓవర్ రెండో బంతికే రాహుల్‌ను రాబిన్సన్ అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ అజింక్య రహానే (1) తర్వాతి ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ స్థితిలో రవీంద్ర జడేజా (120 బంతుల్లో 40; 3 ఫోర్లు), రిషభ్ పంత్ (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించగా... తనదైన శైలిలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన పంత్, పేలవ షాట్ ఆడి నిష్క్రమించాడు. ఆ తర్వాత ముగ్గురు బౌలర్లు షమీ (0), ఇషాంత్ (8), బుమ్రా (0) వికెట్లను తీసేందుకు ఇంగ్లండ్‌కు ఎంతోసేపు పట్టలేదు.
సిరాజ్ జోరు...
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను రోరీ బర్న్స్ (136 బంతుల్లో 49; 7 ఫోర్లు), డామ్ సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. టీ సమయానికి 14 ఓవర్లలో 23 పరుగులు జత చేశారు. అయితే విరామం తర్వాత హైదరాబాదీ పేసర్ సిరాజ్ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వరుస బంతుల్లో సిబ్లీ, హసీబ్ హమీద్ (0)లను సిరాజ్ పెవిలియన్ పంపించాడు. 2016 నవంబర్‌లో తన చివరి టెస్టు ఆడిన హమీద్... 1717 రోజుల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించి తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో బర్న్స్, రూట్‌లపై జట్టును ఆదుకునే భారం పడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించి అంతా సాఫీగా సాగుతున్న సమయంలో షమీ.. బర్న్స్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. మరో వికెట్ పడకుండా రూట్, బెయిర్‌స్టో రోజును ముగించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364.
వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364.
బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119.
వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0.
Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే...
Published Sat, Aug 14 2021 4:39 AM | Last Updated on Sat, Aug 14 2021 7:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment