ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా..? | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా..?

Published Wed, Jan 31 2024 11:53 AM

India May Be Tempted To Play 4 Spinners In The 2nd Test Against England Says K Srikkanth - Sakshi

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టెస్ట్‌లో (ఫిబ్రవరి 2 నుంచి) టీమిండియా భారీ ప్రయోగాల బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. స్పిన్‌కు అనుకూలించే వైజాగ్‌ ట్రాక్‌పై భారత్‌ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని  సమాచారం.

రెగ్యులర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ భారత స్పిన్‌ విభాగాన్ని లీడ్‌ చేస్తాడని.. వీరిద్దరితో పాటు జడ్డూకు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులో ఉంటారని సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ‍ప్రచారం జరుగుతుంది.

సుందర్‌, కుల్దీప్‌ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్ట్‌లో ఆశించినంత ‍ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్‌ సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వైజాగ్‌ లాంటి స్పిన్‌ ఫ్రెండ్లీ పిచ్‌పై నలుగురు స్పిన్నర్లు, ఓ పేసర్‌ (బుమ్రా) ఐడియా సబబేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. 

ఈ విషయంపై భారత మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ కూడా స్పందించాడు. టీమిండియా ఈ ప్రయోగం చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించాడు. 1970, 80 దశకాల్లో భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు (బిషన్‌ సింగ్‌ బేడీ, బీఎస్‌ చంద్రశేఖర్‌, ఎర్రపల్లి ప్రసన్న, శ్రీనివాస్‌ వెంకట్రాఘవన్‌) కలిసి ఆడిన సందర్భాలను ప్రస్తావించాడు. స్పిన్‌ వంద శాతం సహకరించే ట్రాక్‌పై నలుగురు స్పిన్నర్ల ఐడియా వర్కౌటవుతుందని అభిప్రాయపడ్డాడు. 

మరోవైపు రెండో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్‌ విభాగంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. గతకొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌పై వేటు పడవచ్చు. గిల్‌ స్థానంలో రజత్‌ పాటిదార్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్సస్‌ మెరుగ్గా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే రెండో టెస్ట్‌లో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. 

రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement