![IND VS ENG 1st ODI: Rohit Sharma Continues Poor Form](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/rohuit.jpg.webp?itok=16pzfZcY)
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ (Rohit Sharma) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. కొద్ది రోజుల కిందటి వరకు టెస్ట్‌లకే పరిమితమైన రోహిత్ బ్యాడ్ ఫామ్.. ఇప్పుడు వన్డేలకు కూడా పాకింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. భారీ అంచనాల నడుమ ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచే రోహిత్ కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్‌లను ఎదుర్కొనేందుకు హిట్‌మ్యాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అత్యంత చెత్తగా ఔటైన అనంతరం రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక నీ పని అయిపోయింది పో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ రంజీల్లో ఆడి, అక్కడా మర్యాద పోగొట్టుకున్నాడు. పసికూన జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 3, 28 పరుగులకు ఔటయ్యాడు.
అంతకుముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ వైఫల్యాలు పతాక స్థాయికి చేరాయి. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్‌లో ఫామ్‌తో తెగ ఇబ్బంది పడిన రోహిత్ చివరి టెస్ట్ నుంచి స్వతాహాగా తప్పుకున్నాడు.
2024-25 సీజన్‌లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు పరిశీలిస్తే దారుణంగా ఉన్నాయి. గత 16 ఇన్నింగ్స్‌లలో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. అతను బ్యాటింగ్ సగటు కేవలం 10.37గా ఉంది. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ కేవలం 166 పరుగులే చేశాడు.
2024-25లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..
6
5
23
8
2
52
0
8
18
11
3
6
10
3
9
2 (నేటి మ్యాచ్)
టెస్ట్‌లతో పోలిస్తే వన్డేల్లో పర్వాలేదనిపించే రోహిత్.. ఇక్కడ కూడా విఫలం కావడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే తమ ఆరాధ్య ఆటగాడి పని అయిపోయిందా అనుకుంటూ మదనపడుతున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
అనంతరం 249 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. శ్రేయస్ అయ్యర్ (59) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు.
శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 111 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment