కోహ్లి ఫైనల్లో ఫామ్‌లోకి వస్తాడు.. టైటిల్‌ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం: రోహిత్‌ శర్మ | T20 World Cup 2024, IND vs ENG 2nd Semi Final: Rohit Sharma Comments | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: కోహ్లి ఫైనల్లో ఫామ్‌లోకి వస్తాడు.. టైటిల్‌ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం: రోహిత్‌ శర్మ

Published Fri, Jun 28 2024 7:45 AM | Last Updated on Fri, Jun 28 2024 9:00 AM

T20 World Cup 2024, IND vs ENG 2nd Semi Final: Rohit Sharma Comments

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. సహచర ఓపెనర్‌, భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. కోహ్లి నాణ్యమైన ప్లేయర్‌ అని రోహిత్‌ కితాబునిచ్చాడు. కోహ్లి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసని అన్నాడు. ఫామ్‌ కోల్పోవడం తాత్కాలికమని తెలిపాడు. 15 ఏళ్లకు పైగా క్రికెట్‌ ఆడిన వ్యక్తికి ఫామ్‌ను తిరిగి దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య కాదని అన్నాడు. ఫైనల్‌ కోసం​ కోహ్లి తన ఫామ్‌ను దాచిపెట్టుకున్నాడని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం రోహిత్‌ మరిన్ని విషయాలు షేర్‌ చేసుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్‌ను ఇలా (ఏకపక్షంగా) గెలవడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఛాలెంజింగ్‌గా ఉన్న పరిస్థితులను మేము స్వీకరించాము. టోర్నీ ఆరంభం నుంచి ఇదే మా విజయ రహస్యం. 

బౌలర్లు, బ్యాటర్లు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆడారు. ఓ దశలో 140-150 స్కోర్‌కే పరిమితమవుతానుకున్నాం. నేను, సూర్య మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో 170 పరుగుల మార్కును తాకగలిగాం. ఈ పిచ్‌పై ఇది చాలా మంచి స్కోర్‌. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అక్షర్‌, కుల్దీప్‌ మా గన్‌ స్పిన్నర్స్‌. వీరిద్దరు ప్రత్యర్దిపై ఒత్తిడి తెచ్చారు. 

బుమ్రా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను మా మ్యాచ్‌ విన్నర్‌. మ్యాచ్‌ మొత్తంలో మేము చాలా కామ్‌గా ఉన్నాం.ఇలా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలం. మేమె ఏ దశలోనూ ఆందోళన చెందలేదు. 

ఇదే మమ్మల్ని గెలిపించింది. ఫైనల్లో ఇదే తరహాలో నాణ్యమైన క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నాం. అందు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం. ప్రస్తుతం జట్టు మంచి షేప్‌లో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఫైనల్లోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నానని రోహిత్‌ అన్నాడు.

కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. 

రోహిత్‌ శర్మ (57), సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-19-3), అక్షర్‌ పటేల్‌ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్‌ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement