ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ (Team India Captain) రోహిత్ శర్మను (Rohit Sharma) ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో 134 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు సాధించేందుకు రోహిత్‌కు మరో 19 ఇన్నింగ్స్‌ల సమయం ఉంది.
ప్రస్తుతం రోహిత్ 257 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 31 సెంచరీలు, 57 అర్ద సెంచరీల సాయంతో 10866 పరుగులు చేశాడు. విరాట్ వన్డేల్లో 11,000 పరుగులను 222 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు.
వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. రోహిత్ మరో 19 ఇన్నింగ్స్‌ల్లో 134 పరుగులు చేస్తే సచిన్‌ను వెనక్కు నెట్టి విరాట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు.
కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మ ఈ ఏడాది తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జనవరి ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగలేదు. ఫామ్‌లేమి కారణంగా రోహిత్ వాలంటీర్‌గా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
అనంతరం ఈ ఏడాది భారత్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. గతేడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌లో ఆడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డే రోహిత్‌కు ఈ ఏడాది భారత్ తరఫున తొలి మ్యాచ్ అవుతుంది.
రంజీల్లోనూ నిరాశే
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ జరిగే సమయంలో రోహిత్ రంజీ బరిలోకి దిగాడు. ఖాళీగా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. గతేడాది నుంచి పెద్దగా ఫామ్‌లో లేని రోహిత్ రంజీ మ్యాచ్‌తో అయినా తిరిగి టచ్‌లోకి రావాలని భావించాడు. కానీ రోహిత్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
ఫిబ్రవరి 6 నుంచి మొదలు
ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లను కటక్, అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.
చిత్తుగా ఓడిన ఇంగ్లండ్
వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ముగిసిన చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment