ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయం
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ద సెంచరీలు సాధించి టీమిండియాను గెలిపించారు.ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్
లక్ష్యానికి 28 పరుగుల దూరంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. లక్ష్యానికి 85 పరుగుల దూరంలో భారత్
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే మరో 85 పరుగులు చేయాలి. గిల్‌తో పాటు అక్షర్ (29) క్రీజ్‌లో ఉన్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ ఔట్
మంచి టచ్‌లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జేకబ్ బేతెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 113/3గా ఉంది. గిల్‌కు (28) జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లోకి వచ్చాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్
ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బేకబ్ బేతెల్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రేయస్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 101/2గా ఉంది. శ్రేయస్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (18) క్రీజ్‌లో ఉన్నాడు.
వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్.. జోఫ్రా ఆర్చర్ వేసిన ఏడో ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/2గా ఉంది. శ్రేయస్ (18), శుభ్‌మన్ గిల్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్
రోహిత్ వైఫల్యాల పరంపర వన్డేల్లోనూ కొనసాగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చెత్త షాట్ ఆడి కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 248 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను 248 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టగా.. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
241 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆరో వికెట్ డౌన్.. లివింగ్‌స్టోన్ ఔట్
183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి లివింగ్‌స్టోన్ (5) ఔటయ్యాడు. హర్షిత్ రాణాకు ఇది మూడో వికెట్.
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్
170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (52) ఔటయ్యాడు. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 170/5గా ఉంది. జేకబ్ బేతెల్ (22), లివింగ్‌స్టోన్ క్రీజ్‌లో ఉన్నారు.
30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/4
30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/4గా ఉంది. జేకబ్ బేతెల్ (18), జోస్ బట్లర్ (48) క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. రూట్ ఔట్
111 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జో రూట్ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రాణా
అరంగ్రేటం పేసర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బేశాడు. 10వ ఓవర్ మూడో బంతికి డకెట్‌ను (32) ఔట్ చేసిన రాణా.. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్‌ను డకౌట్ చేశాడు. 10 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. జో రూట్ (1), జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. సాల్ట్ రనౌట్
ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా కనిపించిన సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.
రాణా బౌలింగ్‌లో చితక్కొట్టిన సాల్ట్
ఆరో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో వరుసగా 6,4,6,4,0,6 బాదాడు. ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.
కట్టుదిట్టంగా భారత పేసర్ల బౌలింగ్
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్‌నే మెయిడిన్ వేసి శుభారంభం అందించాడు. అతడికి తోడుగా హర్షిత్ రాణా కొత్త బంతితో బరిలోకి దిగి వన్డేల్లో తన మొదటి ఓవర్‌నే మెయిడిన్(సున్నా పరుగులు) చేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 26/0 (5)
బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే ఇవాళ (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆడటం లేదు. అతని కుడి మోకాలికి గాయమైంది. కోహ్లి గాయపడటంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశం వచ్చింది.
యశస్వి.. రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. యశస్వికి వన్డేల్లో ఇది తొలి మ్యాచ్ (డెబ్యూ). ఈ మ్యాచ్‌లో యశస్వితో పాటు హర్షిత్ రాణా కూడా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు కూడా అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ బాధ్యతలను అదనంగా మోయనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది.
ఇంగ్లండ్ విషయానికొస్తే.. టీ20 సిరీస్ ఆడిన జట్టులో పెద్దగా మార్పులు లేవు. జో రూట్ కొత్తగా జట్టులో చేరాడు. ఈ సిరీస్ భారత్, ఇంగ్లండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తుది జట్లు..
ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
Comments
Please login to add a commentAdd a comment