spinners
-
అవును... నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే
ముంబై: వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శన చాలా పరిమితమని చెప్పాడు. ఇటీవల ప్రకటించిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ ‘నలుగురు స్పిన్నర్లు ఎందుకు అవసరమనేది ఇప్పుడే వెల్లడించలేను. కానీ కచ్చితంగా ఉండాలనే అనుకున్నాం. ఇందులో ఇద్దరు ఆల్‌రౌండర్లు (జడేజా, అక్షర్) అవసరమైనపుడు బ్యాటింగ్‌లో ఎదురుదాడికి దిగుతారు. పిచ్, ప్రత్యర్థి జట్లను బట్టి మా ‘నలుగురి’ ప్రణాళిక జట్టును సమతూకంగా ఉంచుతుంది. మిడిల్ ఓవర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకే శివమ్ దూబేలాంటి హిట్టర్‌ను ఎంపిక చేశాం. ఈ ఐపీఎల్‌తో పాటు గతంలో టీమిండియా తరఫున దూబే బాగా ఆడాడు. ఐపీఎల్ కంటే ముందే 70, 80 శాతం జట్టు ఎంపిక కూర్పు జరిగిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ ప్రదర్శన ఏరోజుకు ఆరోజు మారిపోతూనే ఉంటుంది. దానినే ప్రామాణికంగా తీసుకోలేం. కేవలం కొన్ని స్థానాల కోసమే లీగ్‌ను పరిగణనలోకి తీసుకున్నాం’ అని వివరించాడు. జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో టి20 ప్రపంచకప్ జరుగుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లన్నీ భారత్... అమెరికాలోనే ఆడుతుంది. ఆ తర్వాత సూపర్–8 దశ మ్యాచ్‌ల కోసం కరీబియన్ దీవులకు టీమిండియా వెళుతుంది. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా..?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టెస్ట్‌లో (ఫిబ్రవరి 2 నుంచి) టీమిండియా భారీ ప్రయోగాల బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. స్పిన్‌కు అనుకూలించే వైజాగ్ ట్రాక్‌పై భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని సమాచారం. రెగ్యులర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా గాయపడిన నేపథ్యంలో అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్ భారత స్పిన్ విభాగాన్ని లీడ్ చేస్తాడని.. వీరిద్దరితో పాటు జడ్డూకు రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటారని సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుందర్, కుల్దీప్ తుది జట్టులో చేరే క్రమంలో తొలి టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వైజాగ్ లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై నలుగురు స్పిన్నర్లు, ఓ పేసర్ (బుమ్రా) ఐడియా సబబేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించాడు. టీమిండియా ఈ ప్రయోగం చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించాడు. 1970, 80 దశకాల్లో భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు (బిషన్ సింగ్ బేడీ, బీఎస్ చంద్రశేఖర్, ఎర్రపల్లి ప్రసన్న, శ్రీనివాస్ వెంకట్రాఘవన్) కలిసి ఆడిన సందర్భాలను ప్రస్తావించాడు. స్పిన్ వంద శాతం సహకరించే ట్రాక్‌పై నలుగురు స్పిన్నర్ల ఐడియా వర్కౌటవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు రెండో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. గతకొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్న శుభ్‌మన్ గిల్‌పై వేటు పడవచ్చు. గిల్ స్థానంలో రజత్ పాటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్సస్ మెరుగ్గా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే రెండో టెస్ట్‌లో టీమిండియాలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ -
'మురళీధరన్, నరైన్ కాదు.. ప్రపంచ క్రికెట్లో నేనే బెస్ట్ స్పిన్నర్'
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఫీల్డ్‌లో గానీ ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గానీ ఎంతో ఉత్సహంగా ఉంటాడో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో సారి గేల్ తన ఫన్నీ కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం యూనివర్స్ బాస్ కరీబియన్ దీవులలో జరగబోయే సరికొత్త టోర్నీ 'సిక్స్టీ' లీగ్‌కు సిద్దమవుతున్నాడు. ఈ టోర్నీ టీ10 ఫార్మాట్లో జరగనుంది. ఈ లీగ్ బుధవారం(ఆగస్టు 24) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్స్ బాస్ సరదా వాఖ్యలు చేశాడు. మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పేట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నా అని ఈ సందర్భంగా గేల్ తెలిపాడు. ఈ టోర్నీలో బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించాలని అనుకుంటున్నట్లు గేల్ వెల్లడించాడు. అదే విధంగా ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు తనే అత్యత్తుమ స్పిన్నర్ అని గేల్ ఫన్నీ కామెంట్లు చేశాడు. "నా బౌలింగ్ సహజమైనది. నేను కచ్చితంగా ఈ టోర్నీలో బౌలింగ్ చేస్తాను. మీకు తెలుసా..? ప్రపంచ క్రికెట్లో నేనే ఇప్పటి వరకు గ్రేట్ స్పిన్నర్‌ని. ముత్తయ్య మురళీధరన్ కూడా నాలా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని కంటే నేను తక్కువ ఎకనామీతో బౌలింగ్ చేశాను. అదేవిధంగా సునీల్ నరైన్ కూడా నా దగ్గరకు రాలేడు" అని సరదాగా గేల్ వాఖ్యనించాడు. "మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టేందుకు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నాను. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో ఇది నా అరంగేట్ర మ్యాచ్‌గా భావిస్తున్నాను. ఈ టోర్నీతో మళ్లీ నా రిథమ్‌ను తిరిగి పొందుతాను. ఈ టోర్నీ నన్ను మరికొంత కాలం క్రికెట్ ఆడేలా సహాయపడుతుందని" యూనివర్స్ బాస్ పేర్కొన్నాడు. కాగా గేల్ చివరగా టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్లు.. ఇదే తొలి సారి!
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్పిన్నర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు ఏకంగా 10కి 10 వికెట్లు పడగొట్టారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి జట్టు మొత్తం 10 వికెట్లు స్పిన్నర్లు తీయడం ఇదే తొలి సారి. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ఫ్లోరిడా వేదికగా ఐదో టీ20లో విండీస్‌పై భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 188 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(40 బంతుల్లో 64 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 38 పరుగులు చేసి రాణించాడు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ భారత స్పిన్నర్ల ధాటికి 100 పరుగులకే కుప్ప కూలింది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు జట్టును భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
మూడో టైటిల్ వేటలో...
సొంత అభిమానుల అశేష మద్దతు ఉన్న గంగూలీ కెప్టెన్‌గా తొలి మూడు సీజన్లు పేలవ ప్రదర్శన కనబర్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్ గౌతమ్ గంభీర్ రాకతో అనూహ్యంగా పుంజుకుంది. రెండు సార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు ప్రతీ సంవత్సరం నిలకడైన ప్రదర్శన కనబర్చింది. గత ఐదు సీజన్లలో నాలుగు సార్లు టాప్–4లో నిలిచిన ఆ జట్టు మళ్లీ ఇప్పుడు టైటిల్ వేటలో నిలిచింది. మొదటి నుంచి జట్టు బలంగా నిలిచిన బ్యాటింగ్, స్పిన్నే ఆ జట్టు మరోసారి నమ్ముకుంది. కెప్టెన్‌గా గత సీజన్లో ఆకట్టుకున్న దినేశ్ కార్తీక్ ఈ సారి తన జట్టుతో పాటు తన వరల్డ్ కప్ అవకాశాలను కూడా పెంచుకోవాల్సిన స్థితిలో బరిలోకి దిగుతున్నాడు. బలాలు: గత ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా తరఫున దినేశ్ కార్తీక్ 498 పరుగులు, క్రిస్ లిన్ 491 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలవగా, ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్ ఉతప్ప, నితీశ్ రాణా, రసెల్ కూడా నిలకడగా రాణించారు. వీరికి తోడు ఓపెనర్‌గా వచ్చిన బౌలర్ సునీల్ నరైన్ కూడా ఏకంగా 190 స్ట్రయిక్‌రేట్‌తో 357 పరుగులు చేయడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. లీగ్‌లో ఎక్కువ బౌండరీలు (253 ఫోర్లు, 130 సిక్సర్లు) బాదిన జట్టుగా నైట్‌రైడర్స్ నిలిచింది. ఈ సారి కూడా వీరంతా జట్టులో భాగంగా ఉన్నారు. కాబట్టి మరోసారి జట్టుకు బ్యాటింగే ప్రధాన బలం కానుంది. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కూడా రాణిస్తే ఇక ఎలాంటి ఆందోళన ఉండదు. గతేడాది ఢిల్లీ తరఫున విఫలమైనా... ఈ సారి కోల్‌కతాతో చేరిన కార్లోస్ బ్రాత్‌వైట్ తనదైన రోజున చెలరేగిపోగలడు. బౌలింగ్‌లో స్పిన్ త్రయం నరైన్, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లా చెలరేగితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు. తమ దేశ వరల్డ్ కప్ టీమ్‌లలో అవకాశాలు లేని క్రిస్ లిన్, నరైన్‌లు టోర్నీ మొత్తం అందుబాటులో ఉండనుండటం సానుకూలాంశం. కొన్ని స్వల్ప మార్పులు ఉన్నా... చాలా ఏళ్లుగా జట్టు విజయాల్లో భాగంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లంతా కొనసాగుతుండటం జట్టుకు మేలు చేయనుంది. బలహీనతలు: గత సంవత్సరం ఐపీఎల్లో 7 మ్యాచ్‌లు ఆడిన ప్రసిద్ధ్ కృష్ణనే ఇప్పుడు కోల్‌కతా ప్రధాన పేసర్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవలే ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరఫున అతను 7 మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లే తీయడం అతని ఫామ్ ఏమిటో చెబుతుంది! కమలేశ్ నాగర్కోటి, శివమ్ మావి ఇప్పటికే గాయాలతో దూరం కాగా, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్టే కూడా గాయంతో బుధవారమే జట్టుకు దూరమయ్యాడు. ఫెర్గూసన్ ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా డో తెలియకపోగా, గర్నీ తొలిసారి ఐపీఎల్ ఆడుతున్నాడు. చెప్పుకోదగ్గ పేస్ బౌలర్ ఒక్కరు కూడా లేకుండా ముందుకెళ్లటం అంత సులువు కాదు. అవకాశం దక్కేనా: విదేశీ ప్లేయర్లలో లిన్, నరైన్, రసెల్‌లకు అన్ని మ్యాచ్‌లలో చోటు ఖాయం కాబట్టి నాలుగో ఆటగాడిగా బ్రాత్‌వైట్ లేదా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డెన్లీలలో ఒకరిని ఎంచుకోవచ్చు. మరోవైపు జట్టులో ఆంధ్ర పేసర్ యెర్రా పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు. పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో దేశవాళీ పేసర్‌గా అతడికి మ్యాచ్ దక్కే అవకాశం ఉంది. జట్టు వివరాలు: దినేశ్ కార్తీక్ (కెప్టెన్), ఉతప్ప, సందీప్ వారియర్, కుల్దీప్, శ్రీకాంత్ ముండే, పీయూష్ చావ్లా, నిఖిల్ నాయక్, ప్రసిద్ధ్ కృష్ణ, శుబ్‌మన్, నితీశ్ రాణా, రింకూ సింగ్, కరియప్ప, యెర్రా పృథ్వీరాజ్ (భారత ఆటగాళ్లు), బ్రాత్‌వైట్, గర్నీ, నరైన్, ఫెర్గూసన్, రసెల్, లిన్, డెన్లీ (విదేశీ ఆటగాళ్లు). అత్యుత్తమ ప్రదర్శన: 2012, 2014లలో విజేతగా నిలిచినకోల్కతా నైట్‌రైడర్స్ 2018లో మూడో స్థానంలో నిలిచింది. -
క్రికెట్ చరిత్రలో స్పిన్నర్లు తొలిసారి..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్ పరంగా చూస్తే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు పరుగుల వరద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే 2017 స్పిన్నర్లకు కూడా బాగా కలిసొచ్చింది. కచ్చితంగా చెప్పాలంటే గతేడాది స్పిన్నర్స్‌కు సూపర్ ఇయర్‌గా నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా స్పిన్నర్లు రెచ్చిపోయి వికెట్లు సాధించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో ఆరు వందలకు పైగా వికెట్లు సాధించిన ఘనతను స్పిన్నర్లు మొదటిసారి తమ ఖాతాలో వేసుకున్నారు. 2017లో స్పిన్నర్లు సాధించిన టెస్టు వికెట్లు 638. ఫలితంగా గతేడాది స్పిన్నర్లు సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు(584)ను బద్దలు కొట్టారు. ఓవరాల్‌గా స్పిన్నర్లు ఐదు వందలకు పైగా సాధించింది కేవలం ఐదుసార్లు మాత్రమే. 2001లో 521 టెస్టు వికెట్లను తీసిన స్పిన్నర్లు.. 2004లో 577 వికెట్లు సాధించారు. ఇక 2015లో 554 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.గతేడాది అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్నర్ల జాబితాలో నాథన్ లయాన్(63), అశ్విన్(56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
ఇదే నా బెస్ట్ ఇన్సింగ్స్: భారత బ్యాట్స్‌మన్
కొలంబో: శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టానని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. శ్రీలంకతో రెండో టెస్టులో 132 పరుగుల మాస్టర్ ఇన్నింగ్స్ నేపథ్యంలో అతను విలేకరులతో మాట్లాడాడు. రెండో టెస్టులో అత్యంత ఓపిగ్గా ఆడిన రహానే 222 బంతుల్లో 14 బౌండరీలతో 132 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర పూజారా (133)తో కలిసి 217 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని రహానే నెలకొల్పడంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 622/9 భారీ స్కోరు నమోదుచేసిన సంగతి తెలిసిందే. 'స్పిన్నర్లపై నా బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఇదొకటి. బౌలర్లను డామినేట్ చేయడంపైనే నేను ఫోకస్ చేశాను. బ్యాటింగ్‌కు వెళ్లేముందే వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో నేను గ్రహించాను. ఎంతో బౌన్స్ ఉంది.. నా గేమ్‌కు పిచ్ సూట్ అవుతుందా? లేదా? అన్నది అంచనా వేశాను. నాకు-పూజారాకు మధ్య కమ్యూనికేషన్ బాగా కుదిరింది. దాదాపు ఒక్క ఓవర్ కూడా మెయిడెన్ కాకుండా చూశాం. కాబట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచగలిగాం. మ్యాచ్ ముందుకుసాగుతున్నకొద్దీ ఈ వికెట్‌పై పరుగులు రాబట్టడం కష్టమవుతుంది' అని రహానే తెలిపారు. శ్రీలంక బౌలర్ హెరాత్, ఇతర స్పిన్స్ బౌలర్లను ఎదుర్కోవడం ఫుట్‌వర్క్ చాలా ముఖ్యమని, ఫుట్‌వర్క్ ఆధారంగానే ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశామని చెప్పాడు. పూజారాతో కలిసి రెండువందల పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం టీమ్ వ్యూహంలో భాగమేనని, దానిని తాము అమలుచేశామని రహానే చెప్పాడు. -
అమ్మాయిలు తిప్పేశారు
భారత మహిళల శుభారంభం తొలి వన్డేలో విండీస్‌పై 6 వికెట్ల విజయం విజయవాడ స్పోర్ట్స: స్పిన్నర్లు రాణించడంతో భారత మహిళల జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడి మూలపాడులో ఏసీఏ నిర్మించిన కొత్త స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్ (4/21), ఏక్తా బిస్త్ (3/14) వెస్టిండీస్ బ్యాట్స్‌వుమెన్‌ను కట్టిపడేశారు. దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ 42.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. మెరిస్సా అగులెరియా (77 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, ఓపెనర్ హేలీ మాథ్యూస్ 24 పరుగులు చేసింది. ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శిఖా పాండేకు ఒక వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 39.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోరుు 133 పరుగులు చేసి గెలిచింది. షకీరా సెల్మన్ (2/11) దెబ్బకు ఆరంభంలో భారత్ తడబడింది. 36 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోరుుంది. తొలుత స్మృతి మందన (7), కాసేపటికే మోన మేశ్రం (2) షకీర బౌలింగ్‌లో నిష్క్రమించారు. దీప్తి (16), హర్మన్‌ప్రీత్ కౌర్ (1) కూడా వెనుదిరిగారు. ఈ దశలో వేద కృష్ణమూర్తి (70 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (91 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీళ్లిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 97 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు. హేలీ మాథ్యూస్, అఫి ఫ్లెచర్‌లు చెరో వికెట్ తీశారు. ఈ నెల 13న ఇక్కడే రెండో వన్డే జరుగుతుంది. -
భారత జట్టు సక్సెస్ పై విమర్శలు!
న్యూఢిల్లీ:ఇటీవల భారత జట్టు సాధించిన విజయాలకు వ్యూహాత్మకంగా తయారు చేసిన పిచ్లే కారణమని స్పిన్ గ్రేట్ రాజీందర్ గోయల్ విమర్శించాడు. మన విజయాల్లో స్పిన్నర్ల ప్రత్యక్ష పాత్ర ఉందని అని తాను అనుకోవడం లేదని గోయల్ ధ్వజమెత్తాడు. 'మనకు ఏ తరహా పిచ్‌లపైనైనా స్పిన్ వేసే బౌలర్లు ఉన్నారనుకోవడం లేదు. స్పిన్ కు అనుకూలించే పిచ్‌లపైనే మాత్రమే మన బౌలర్లు ప్రతిభ చూపుతున్నారు. ఆ రకంగా పిచ్ లు తయారు చేస్తున్నాం. స్పిన్‌లో అసలు మజాను ప్రేక్షకులకు అందించడంలో విఫలమవుతున్నారు. మనం స్పిన్ పిచ్‌లను తయారు చేయడంతోనే స్పిన్నర్లకు వికెట్లు దక్కుతున్నాయి. అదే మన సక్సెస్‌కు కారణం. ఒక మంచి స్పిన్నర్ అనేవాడు మణికట్టుతో వేళ్లతో బంతిని తిప్పుతాడు. దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎంతసేపు స్పిన్ పిచ్‌లను ఎలా రూపొందించాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?, భారత్ లో మ్యాచ్‌లను గెలవడానికి పిచ్ లపై ఆధారపడదామా?అని గోయల్ మండిపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమవుతున్న సమయంలో గోయల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మరో బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతున్న వేళ ..అసలు మన స్పిన్ బౌలింగ్‌లో నాణ్యత లేదంటూ వ్యాఖ్యానించడంతో ఇబ్బందికరంగా మారింది. హరియాణాకు చెందిన రాజిందర్ గోయల్.. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 750 వికెట్లు తీశాడు. ఇందులో 17.11 యావరేజ్‌తో 640 రంజీ వికెట్లు అతని బౌలింగ్ ప్రతిభకు నిదర్శనం. అయితే దాదాపు 27 సంవత్సరాలు పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కే పరిమితమైన గోయల్.. భారత జాతీయ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. -
నాలుగో రోజూ ఆడొచ్చు
ఫిరోజ్ షా కోట్ల పిచ్‌పై దక్షిణాఫ్రికా అభిప్రాయం న్యూఢిల్లీ: స్పిన్ పిచ్‌లతో రెండు టెస్టుల్లో మూడు రోజుల్లోపే చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా జట్టు... ఫిరోజ్ షా కోట్లలో గురువారం నుంచి జరిగే టెస్టు నాలుగు రోజుల పాటు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరించినా... చలి వాతావరణం కారణంగా ఉదయం పూట పేసర్లకు కొంత సహకారం లభించవచ్చనేది ఆ జట్టు అంచనా. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సందర్భంగా కోచ్‌లు సుదీర్ఘంగా పిచ్‌ను పరిశీలించారు.మరోవైపు భారతజట్టు కూడా సుమారు రెండున్నర గంటల సేపు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. మా ప్రతిభకు ప్రశంస ఏది: అమిత్ మిశ్రా టెస్టు సిరీస్‌లో తాము అద్భుతమైన ప్రదర్శన చూపెట్టినా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ పిచ్‌ల గురించే ఎక్కువగా చర్చిస్తున్నారన్నాడు. ఈ చర్చలో తనతో పాటు అశ్విన్, జడేజాల ఘనత మరుగునపడిపోయిందన్నాడు. ‘పిచ్‌ల గురించే కాకుండా మా ఘనత గురించి కూడా కాస్త చర్చిస్తే బాగుంటుంది. గత 15 ఏళ్లుగా భారత్‌లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మేం లంకకు వెళ్లినప్పుడు కూడా టర్నింగ్ ట్రాక్‌లపై బాగానే రాణించాం. స్పిన్నర్లు బౌలింగ్ బాగా చేస్తే కనీసం వాళ్లను ప్రశంసించండి. కేవలం పిచ్ వల్లే వికెట్లు రాలేదు’ అని మిశ్రా పేర్కొన్నాడు. కఠిన సమయంలో కెప్టెన్ కోహ్లి తనకు బాగా మద్దతిచ్చాడన్నాడు. జడేజా, అశ్విన్‌లతో సమన్వయం కుదరడం వల్లే బాగా రాణించగలుగుతున్నానని చెప్పాడు. తనపై జట్టు మేనేజ్మెంట్కు ఎక్కువగా నమ్మకం లేదన్న అంశాన్ని మిశ్రా తోసిపుచ్చాడు. స్టెయిన్ అనుమానం గజ్జల్లో గాయంతో బాధపడుతున్న సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ నాలుగో టెస్టుకూ అందుబాటులో ఉండటంపై అనుమానం నెలకొంది. మంగళవారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌కు వచ్చిన స్టెయిన్ నెట్ సెషన్లో పాల్గొనలేదు. అబాట్, మర్చంట్ డిలాంజ్ ఎక్కువసేపు నెట్స్‌లో గడిపారు. కనీసం బౌలింగ్ స్పైక్స్ కూడా లేకుండా మైదానంలోకి వచ్చిన స్టెయిన్ సీట్‌కే పరిమితమయ్యాడు. అయితే ఫిట్నెస్ టెస్టులో భాగంగా కేవలం ఒక రౌండ్ రన్నింగ్ చేశాడు. దీని ఫలితం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎక్కువ సమయం ఢిల్లీ ఆల్‌రౌండర్ సారంగ్ రావత్‌కు చిట్కాలు చెబుతూ కనిపించాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే స్టెయిన్ టెస్టు ఆడతాడని అసిస్టెంట్ కోచ్ ఆడ్రియన్ బీరెల్ వెల్లడించారు. -
స్పిన్నర్లతో జాగ్రత్తగా ఆడండి
స్పిన్ బౌలింగ్‌ను సహనంతో ఎదుర్కోవాలని, ఆరంభం నుంచే బ్యాట్స్‌మెన్ దూకుడు పాటించడం పనికిరాదని టీమిండియా మాజీ కెప్టెన్, భారత్-ఎ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. స్పిన్‌ను ఎదుర్కొనేందుకు సరైన ఫుట్‌వర్క్ చేయడం అవసరమని అభిప్రాయపడ్డాడు. స్పిన్ బంతులు ఆడటంలో ఒక్కో బ్యాట్స్మన్ది ఒక్కో శైలి అని ద్రావిడ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టీమిండియా బలాల్లో స్పిన్ బౌలింగ్ ఒకటని ద్రావిడ్ అన్నాడు. అయితే దేశవాళీ క్రికెట్లో నాణ్యమైన స్పిన్నర్ల కొరత ఉందని చెప్పాడు. టాప్-4 స్పిన్నర్లు రాణిస్తున్నారని, మరింతమంది మెరుగైన స్పిన్నర్ల అవసరముందని అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
'ఆ ఫార్మెట్ తో స్పిన్నర్ల సామర్థ్యం పెరిగింది'
వెల్లింగ్టన్: ట్వంటీ- 20 ఫార్మెట్ స్పిన్నర్ల శక్తి సామర్థ్యాలు పెరగటానికి కారణమైందా?, ఆ ఫార్మెట్ తో స్పిన్నర్లు బ్యాట్స్ మెన్ ఆలోచనలకు చెక్ పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి. స్పిన్నర్ల శక్తి సామర్థ్యాలు బాగా పెరగడానికి ట్వంటీ 20 ఫార్మెట్ చాలా బాగా దోహదపడిందని తాజాగా స్పష్టం చేశాడు. బ్యాట్స్ మెన్ ఎదురుదాడిని స్పిన్నర్లు ముందే ఊహించడానికి ట్వంటీ 20 ఫార్మెట్ చక్కటి వేదికగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు కోచ్ గా ఉన్న వెటోరి.. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బేన్ హీట్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆద్యంతం బ్యాట్స్ మెన్ గేమ్ గా ఉండే ట్వంటీ 20 ఫార్మెట్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నాడు. ట్వంటీ 20 ల్లో అనేక స్టేజ్ లలో బౌలింగ్ చేసే స్పిన్నర్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నారన్నాడు. సాంప్రదాయ శైలిలో బౌలింగ్ చేసే స్పిన్నర్లు జాతీయ జట్టులో స్థానాలను దక్కించుకుంటున్నారని వెటోరి తెలిపాడు. -
అక్షర్‌కు అవకాశం దక్కుతుందా!
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఇప్పటికే కోల్పోయిన నేపథ్యంలో నాలుగో టెస్టులో భారత తుది జట్టు ఏ విధంగా ఉండబోతోందో అనేది ఆసక్తికరం. సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ) స్పిన్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. మ్యాచ్ నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లు ప్రభావితం చేస్తారని రికార్డులు చెబుతున్నాయి. కాబట్టి తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే ఆలోచనతో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆస్టన్ అగర్‌కు జట్టులో చోటిచ్చింది. కాబట్టి భారత్‌నుంచి అశ్విన్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆడతాడా అనేది చూడాలి. గాయపడిన జడేజా స్థానంలో ఆస్ట్రేలియాకు వచ్చిన అక్షర్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. కోహ్లి సారథ్యంలో వన్డేలు ఆడిన అక్షర్‌పై కెప్టెన్‌కు మంచి నమ్మకముండటం కూడా అతని అవకాశాలు పెంచుతోంది. అక్షర్‌ను తీసుకుంటే ఉమేశ్, షమీలలో ఒకరిపై వేటు పడుతుంది. వరుసగా విఫలమవుతున్న ధావన్ స్థానంలో సురేశ్ రైనాకు చోటు ఇవ్వాలని కూడా మేనేజ్మెంట్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనా, తన సహజమైన ఓపెనింగ్ స్థానంలో రాహుల్ ఆడతాడు. రైనాకు ఆరోస్థానంలో బరిలోకి దిగుతాడు. రైనా స్పిన్ బౌలింగ్ కూడా కొంత వరకు ఉపయోగపడవచ్చు. మరో వైపు ధోని తప్పుకోవడంతో వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా బరిలోకి దిగడం మాత్రం ఖాయమైంది. -
చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా
దుబాయ్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. 221 పరుగుల భారీ తేడాతో ఆసీస్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 438 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించలేక కంగారూలు చేతులెత్తేశారు. 91.1 ఓవర్లలో 216 పరుగులకు చాపచుట్టేశారు. పాక్ స్పిన్నర్ల ధాటికి ఆసీస్ ఆటగాళ్లు విలవిల్లాడారు. స్మిత్(55), జాన్సన్(61) మాత్రమే రాణించి అర్థ సెంచరీలు సాధించారు. రోజర్స్ 43, వార్నర్ 23, సిడల్ 15 పరుగులు చేశారు. డూలన్, లియోన్, హాడిన్ డకౌటయ్యారు. మైకేల్ క్లార్క్, మార్ష్ మూడేసి పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో జుల్ఫికర్ బాబర్ 5, యాసిర్ షా 4 వికెట్లు పడగొట్టారు. ఇమ్రాన్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 454, ఆస్ట్రేలియా 303 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగస్ లో పాకిస్థాన్ 286/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు సాధించిన పాక్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.