నాలుగో రోజూ ఆడొచ్చు
ఫిరోజ్ షా కోట్ల పిచ్‌పై దక్షిణాఫ్రికా అభిప్రాయం
న్యూఢిల్లీ: స్పిన్ పిచ్‌లతో రెండు టెస్టుల్లో మూడు రోజుల్లోపే చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా జట్టు... ఫిరోజ్ షా కోట్లలో గురువారం నుంచి జరిగే టెస్టు నాలుగు రోజుల పాటు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరించినా... చలి వాతావరణం కారణంగా ఉదయం పూట పేసర్లకు కొంత సహకారం లభించవచ్చనేది ఆ జట్టు అంచనా. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సందర్భంగా కోచ్‌లు సుదీర్ఘంగా పిచ్‌ను పరిశీలించారు.మరోవైపు భారతజట్టు కూడా సుమారు రెండున్నర గంటల సేపు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.
మా ప్రతిభకు ప్రశంస ఏది: అమిత్ మిశ్రా
టెస్టు సిరీస్‌లో తాము అద్భుతమైన ప్రదర్శన చూపెట్టినా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ పిచ్‌ల గురించే ఎక్కువగా చర్చిస్తున్నారన్నాడు. ఈ చర్చలో తనతో పాటు అశ్విన్, జడేజాల ఘనత మరుగునపడిపోయిందన్నాడు. ‘పిచ్‌ల గురించే కాకుండా మా ఘనత గురించి కూడా కాస్త చర్చిస్తే బాగుంటుంది. గత 15 ఏళ్లుగా భారత్‌లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మేం లంకకు వెళ్లినప్పుడు కూడా టర్నింగ్ ట్రాక్‌లపై బాగానే రాణించాం.
స్పిన్నర్లు బౌలింగ్ బాగా చేస్తే కనీసం వాళ్లను ప్రశంసించండి. కేవలం పిచ్ వల్లే వికెట్లు రాలేదు’ అని మిశ్రా పేర్కొన్నాడు. కఠిన సమయంలో కెప్టెన్ కోహ్లి తనకు బాగా మద్దతిచ్చాడన్నాడు. జడేజా, అశ్విన్‌లతో సమన్వయం కుదరడం వల్లే బాగా రాణించగలుగుతున్నానని చెప్పాడు. తనపై జట్టు మేనేజ్‌మెంట్‌కు ఎక్కువగా నమ్మకం లేదన్న అంశాన్ని మిశ్రా తోసిపుచ్చాడు.
స్టెయిన్ అనుమానం
గజ్జల్లో గాయంతో బాధపడుతున్న సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ నాలుగో టెస్టుకూ అందుబాటులో ఉండటంపై అనుమానం నెలకొంది. మంగళవారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌కు వచ్చిన స్టెయిన్ నెట్ సెషన్‌లో పాల్గొనలేదు. అబాట్, మర్చంట్ డిలాంజ్ ఎక్కువసేపు నెట్స్‌లో గడిపారు. కనీసం బౌలింగ్ స్పైక్స్ కూడా లేకుండా మైదానంలోకి వచ్చిన స్టెయిన్ సీట్‌కే పరిమితమయ్యాడు.
అయితే ఫిట్‌నెస్ టెస్టులో భాగంగా కేవలం ఒక రౌండ్ రన్నింగ్ చేశాడు. దీని ఫలితం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎక్కువ సమయం ఢిల్లీ ఆల్‌రౌండర్ సారంగ్ రావత్‌కు చిట్కాలు చెబుతూ కనిపించాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే స్టెయిన్ టెస్టు ఆడతాడని అసిస్టెంట్ కోచ్ ఆడ్రియన్ బీరెల్ వెల్లడించారు.