ఇదే నా బెస్ట్ ఇన్సింగ్స్: భారత బ్యాట్స్‌మన్
కొలంబో: శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టానని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. శ్రీలంకతో రెండో టెస్టులో 132 పరుగుల మాస్టర్ ఇన్నింగ్స్ నేపథ్యంలో అతను విలేకరులతో మాట్లాడాడు. రెండో టెస్టులో అత్యంత ఓపిగ్గా ఆడిన రహానే 222 బంతుల్లో 14 బౌండరీలతో 132 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర పూజారా (133)తో కలిసి 217 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని రహానే నెలకొల్పడంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 622/9 భారీ స్కోరు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
'స్పిన్నర్లపై నా బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఇదొకటి. బౌలర్లను డామినేట్ చేయడంపైనే నేను ఫోకస్ చేశాను. బ్యాటింగ్‌కు వెళ్లేముందే వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో నేను గ్రహించాను. ఎంతో బౌన్స్ ఉంది.. నా గేమ్‌కు పిచ్ సూట్ అవుతుందా? లేదా? అన్నది అంచనా వేశాను. నాకు-పూజారాకు మధ్య కమ్యూనికేషన్ బాగా కుదిరింది. దాదాపు ఒక్క ఓవర్ కూడా మెయిడెన్ కాకుండా చూశాం. కాబట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచగలిగాం. మ్యాచ్ ముందుకుసాగుతున్నకొద్దీ ఈ వికెట్‌పై పరుగులు రాబట్టడం కష్టమవుతుంది' అని రహానే తెలిపారు. శ్రీలంక బౌలర్ హెరాత్, ఇతర స్పిన్స్ బౌలర్లను ఎదుర్కోవడం ఫుట్‌వర్క్ చాలా ముఖ్యమని, ఫుట్‌వర్క్ ఆధారంగానే ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశామని చెప్పాడు. పూజారాతో కలిసి రెండువందల పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం టీమ్ వ్యూహంలో భాగమేనని, దానిని తాము అమలుచేశామని రహానే చెప్పాడు.