టి20 ప్రపంచకప్ జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్య
ముంబై: వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శన చాలా పరిమితమని చెప్పాడు. ఇటీవల ప్రకటించిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కింది.
గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ ‘నలుగురు స్పిన్నర్లు ఎందుకు అవసరమనేది ఇప్పుడే వెల్లడించలేను. కానీ కచ్చితంగా ఉండాలనే అనుకున్నాం. ఇందులో ఇద్దరు ఆల్‌రౌండర్లు (జడేజా, అక్షర్) అవసరమైనపుడు బ్యాటింగ్‌లో ఎదురుదాడికి దిగుతారు. పిచ్, ప్రత్యర్థి జట్లను బట్టి మా ‘నలుగురి’ ప్రణాళిక జట్టును సమతూకంగా ఉంచుతుంది.
మిడిల్ ఓవర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకే శివమ్ దూబేలాంటి హిట్టర్‌ను ఎంపిక చేశాం. ఈ ఐపీఎల్‌తో పాటు గతంలో టీమిండియా తరఫున దూబే బాగా ఆడాడు. ఐపీఎల్ కంటే ముందే 70, 80 శాతం జట్టు ఎంపిక కూర్పు జరిగిపోయింది. ఎందుకంటే ఐపీఎల్ ప్రదర్శన ఏరోజుకు ఆరోజు మారిపోతూనే ఉంటుంది. దానినే ప్రామాణికంగా తీసుకోలేం.
కేవలం కొన్ని స్థానాల కోసమే లీగ్‌ను పరిగణనలోకి తీసుకున్నాం’ అని వివరించాడు. జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో టి20 ప్రపంచకప్ జరుగుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లన్నీ భారత్... అమెరికాలోనే ఆడుతుంది. ఆ తర్వాత సూపర్–8 దశ మ్యాచ్‌ల కోసం కరీబియన్ దీవులకు టీమిండియా వెళుతుంది.
Comments
Please login to add a commentAdd a comment