రవి చంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా(ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ:ఇటీవల భారత జట్టు సాధించిన విజయాలకు వ్యూహాత్మకంగా తయారు చేసిన పిచ్లే కారణమని స్పిన్ గ్రేట్ రాజీందర్ గోయల్ విమర్శించాడు. మన విజయాల్లో స్పిన్నర్ల ప్రత్యక్ష పాత్ర ఉందని అని తాను అనుకోవడం లేదని గోయల్ ధ్వజమెత్తాడు. 'మనకు ఏ తరహా పిచ్లపైనైనా స్పిన్ వేసే బౌలర్లు ఉన్నారనుకోవడం లేదు. స్పిన్ కు అనుకూలించే పిచ్లపైనే మాత్రమే మన బౌలర్లు ప్రతిభ చూపుతున్నారు. ఆ రకంగా పిచ్ లు తయారు చేస్తున్నాం. స్పిన్లో అసలు మజాను ప్రేక్షకులకు అందించడంలో విఫలమవుతున్నారు. మనం స్పిన్ పిచ్లను తయారు చేయడంతోనే స్పిన్నర్లకు వికెట్లు దక్కుతున్నాయి. అదే మన సక్సెస్కు కారణం.
ఒక మంచి స్పిన్నర్ అనేవాడు మణికట్టుతో వేళ్లతో బంతిని తిప్పుతాడు. దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎంతసేపు స్పిన్ పిచ్లను ఎలా రూపొందించాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?, భారత్ లో మ్యాచ్లను గెలవడానికి పిచ్ లపై ఆధారపడదామా?అని గోయల్ మండిపడ్డాడు.
త్వరలో ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టు సన్నద్ధమవుతున్న సమయంలో గోయల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మరో బిగ్ ఫైట్కు సిద్ధమవుతున్న వేళ ..అసలు మన స్పిన్ బౌలింగ్లో నాణ్యత లేదంటూ వ్యాఖ్యానించడంతో ఇబ్బందికరంగా మారింది.
హరియాణాకు చెందిన రాజిందర్ గోయల్.. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 750 వికెట్లు తీశాడు. ఇందులో 17.11 యావరేజ్తో 640 రంజీ వికెట్లు అతని బౌలింగ్ ప్రతిభకు నిదర్శనం. అయితే దాదాపు 27 సంవత్సరాలు పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కే పరిమితమైన గోయల్.. భారత జాతీయ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.