Rajinder Goel
-
దేశవాళీ క్రికెట్ బౌలింగ్ దిగ్గజం కన్నుమూత
కోల్‌కతా: భారత దేశవాళీ క్రికెట్ స్పిన్ దిగ్గజం రాజిందర్ గోయెల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. అనారోగ్యంతో ఆదివారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1958 నుంచి 1985 వరకు దేశవాళీ క్రికెట్లో గోయెల్ చెరగని ముద్ర వేశారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన గోయెల్ తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 157 మ్యాచ్‌లు ఆడి 750 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు ఇప్పటికీ రాజిందర్ గోయెల్ పేరిటే ఉంది. ఆయన రంజీల్లో మొత్తం 637 వికెట్లు పడగొట్టారు. ఇంతటి విశేష ప్రతిభ కనబరిచిన రాజిందర్ భారత జట్టుకు మాత్రం ఆడలేకపోయారు. అయితే 1964–65 సీజన్లో అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశారు. బిషన్ సింగ్ బేడీ అద్భుతమైన స్పిన్నర్‌గా జట్టుకు అందుబాటులో ఉండటంతో సెలక్టర్లు గోయెల్‌వైపు చూడలేకపోయారు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన రాజిందర్ సేవలకు గుర్తింపుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2017లో ‘సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం’ అందజేసింది. ఏళ్ల తరబడి హరియాణాకు ఆడిన ఆయన పంజాబ్, ఢిల్లీ జట్లకూ ప్రాతినిధ్యం వహించారు. హరియాణా క్రికెట్ అభివృద్ధికి ఎంతో సేవ చేసిన గోయెల్ మరణం తమకు తీరని లోటని హరియాణా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కుల్తార్ సింగ్ మలిక్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశవాళీ క్రికెట్‌కు పూడ్చలేని నష్టమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రణ్‌బీర్ సింగ్ మహేంద్ర అన్నారు. -
భారత జట్టు సక్సెస్ పై విమర్శలు!
న్యూఢిల్లీ:ఇటీవల భారత జట్టు సాధించిన విజయాలకు వ్యూహాత్మకంగా తయారు చేసిన పిచ్లే కారణమని స్పిన్ గ్రేట్ రాజీందర్ గోయల్ విమర్శించాడు. మన విజయాల్లో స్పిన్నర్ల ప్రత్యక్ష పాత్ర ఉందని అని తాను అనుకోవడం లేదని గోయల్ ధ్వజమెత్తాడు. 'మనకు ఏ తరహా పిచ్‌లపైనైనా స్పిన్ వేసే బౌలర్లు ఉన్నారనుకోవడం లేదు. స్పిన్ కు అనుకూలించే పిచ్‌లపైనే మాత్రమే మన బౌలర్లు ప్రతిభ చూపుతున్నారు. ఆ రకంగా పిచ్ లు తయారు చేస్తున్నాం. స్పిన్‌లో అసలు మజాను ప్రేక్షకులకు అందించడంలో విఫలమవుతున్నారు. మనం స్పిన్ పిచ్‌లను తయారు చేయడంతోనే స్పిన్నర్లకు వికెట్లు దక్కుతున్నాయి. అదే మన సక్సెస్‌కు కారణం. ఒక మంచి స్పిన్నర్ అనేవాడు మణికట్టుతో వేళ్లతో బంతిని తిప్పుతాడు. దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎంతసేపు స్పిన్ పిచ్‌లను ఎలా రూపొందించాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?, భారత్ లో మ్యాచ్‌లను గెలవడానికి పిచ్ లపై ఆధారపడదామా?అని గోయల్ మండిపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమవుతున్న సమయంలో గోయల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు మరో బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతున్న వేళ ..అసలు మన స్పిన్ బౌలింగ్‌లో నాణ్యత లేదంటూ వ్యాఖ్యానించడంతో ఇబ్బందికరంగా మారింది. హరియాణాకు చెందిన రాజిందర్ గోయల్.. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 750 వికెట్లు తీశాడు. ఇందులో 17.11 యావరేజ్‌తో 640 రంజీ వికెట్లు అతని బౌలింగ్ ప్రతిభకు నిదర్శనం. అయితే దాదాపు 27 సంవత్సరాలు పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కే పరిమితమైన గోయల్.. భారత జాతీయ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.