
చాంపియన్స్ ట్రోఫీపై అశ్విన్ వాఖ్య
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉండటంపై భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎలా చూసినా ఈ సంఖ్య ఎక్కువేనని అతను అభిప్రాయ పడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో... టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లు అవసరమా? అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు దక్కొచ్చు.
వరుణ్ చక్రవర్తిని కూడా ఆడించాలనుకుంటే... ఒక పేస్ బౌలర్‌ను తగ్గించి పాండ్యానే రెండో పేసర్‌గా పరిగణించాల్సి ఉంటుంది. అదనపు పేసర్‌ను బరిలోకి దింపాలంటే ఒక స్పిన్నర్‌ను తగ్గించుకోక తప్పదు’ అని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్, జడేజా, కుల్దీప్, వరుణ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్... టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘భారత జట్టులో సూపర్ సెలబ్రిటీ విధానాన్ని తగ్గించాలి. దాన్ని ఏమాత్రం ప్రోత్సహించకూడదు. జట్టులో ఉండేది ఆటగాళ్లే... సూపర్ స్టార్లు కాదు. కెరీర్‌లో ఎంతో సాధించిన కోహ్లి, రోహిత్ ఇప్పుడు మరో సెంచరీ కొట్టినా అదేమీ పెద్ద ఘనత కాదు, మీ వ్యక్తిగత రికార్డు కూడా కాదు. అంతా జట్టు కోసమే’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ప్లేయర్లు వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆడాలని అశ్విన్ సూచించాడు.
జాతీయ జట్టు తరఫున 106 టెస్టులాడి 537 వికెట్లు పడగొట్టిన అశ్విన్... 116 వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. 65 టి20ల్లో 72 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మూడో టెస్టు అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment