ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్‌ | IND VS ENG 2nd Test: Ravichandran Ashwin 4 Wickets Away To Complete 500 Wickets In Test Cricket | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్‌

Published Thu, Feb 1 2024 3:28 PM | Last Updated on Thu, Feb 1 2024 3:55 PM

IND VS ENG 2nd Test: Ravichandran Ashwin 4 Wickets Away To Complete 500 Wickets In Test Cricket  - Sakshi

విశాఖ వేదికగా రేపటి నుంచి (ఫిబ్రవరి 2) ప్రారంభంకాబోయే (ఇంగ్లండ్‌తో) రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్‌ స్పిన్నర​ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో యాష్‌ మరో 4 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో  500 వికెట్ల మైలురాయిని తాకిన తొమ్మిదో పురుష క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం అశ్విన్‌ ఖాతాలో 496 వికెట్లు (96 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఈ రికార్డుతో పాటు రెండో టెస్ట్‌లో అశ్విన్‌ మరిన్ని రికార్డులు కూడా సాధించే అవకాశం ఉంది. 

ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా.. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా.. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. అ‍త్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్‌గా పలు రికార్డులు నెలకొల్పుతాడు.

ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా..
టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌ రికార్డు భగవత్‌ చంద్రశేఖర్‌ పేరిట ఉంది. చంద్రశేఖర్‌ ఇంగ్లండ్‌తో 23 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు పడగొట్టాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌లో అశ్విన్‌ (20 టెస్ట్‌ల్లో 93 వికెట్లు) మరో 3 వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా..
భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్‌ కూడా 100 వికెట్లు తీయలేదు. రేపటి నుంచి మొదలయ్యే రెండో టెస్ట్‌లో అశ్విన్‌ మరో 7 వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్‌పై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇరు జట్ల మధ్య టెస్ట్‌ల్లో ఇప్పటివరకు జేమ్స్‌ ఆండర్సన్‌ (139 వికెట్లు) మాత్రమే 100 వికెట్ల మైలురాయిని దాటాడు.

భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా..
అశ్విన్‌ భారత గడ్డపై ఇప్పటివరకు 56 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 343 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ రెండో టెస్ట్‌లో మరో 8 వికెట్లు తీస్తే భారతగడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్‌ కుంబ్లే (350) రికార్డును బద్దలు కొడతాడు.

అ‍త్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్‌గా..
కెరీర్‌లో ఇప్పటివరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన అశ్విన్‌.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ఘనతలు సాధిస్తే, అనిల్‌ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (భారత్‌ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు) బద్దలవుతుంది. వైజాగ్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో అశ్విన్‌ పై పేర్కొన్న రికార్డులన్నీ ఇదే మ్యాచ్‌లో సాధించినా అశ్చర్యపోనక్కర్లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement