
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
అశ్విన్, అనిల్ కుంబ్లే ఇప్పటివరకు టీమిండియా తరఫున 37 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించారు. అశ్విన్ ఒక్క టెస్ట్‌ల్లోనే ఈ ఘనత సాధించగా.. కుంబ్లే 35 సార్లు టెస్ట్‌ల్లో, రెండు సార్లు వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్, కుంబ్లే చెరి ఎనిమిది సార్లు 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన ఘనత ముత్తయ్య మురళీథరన్‌కు దక్కుతుంది. మురళీ శ్రీలంక తరఫున 77 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 22 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత ఈ లిస్ట్‌లో రిచర్డ్ హ్యాడ్లీ, షేన్ వార్న్ ఉన్నారు.
హ్యాడ్లీ 41 ఐదు వికెట్ల ప్రదర్శనలు, తొమ్మిది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. షేన్ వార్న్ 38 ఐదు వికెట్ల ప్రదర్శనలు, పది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ జాబితాలో మురళీథరన్, హ్యాడ్లీ, వార్న్ తర్వాత అశ్విన్, కుంబ్లే ఉన్నారు.
కాగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది.