ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ చిరస్మరణీయ మ్యాచ్‌లో అశ్విన్ ఓ అనవసరపు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి బంతితో రాణించిన యాష్.. బ్యాటింగ్‌లో నిరాశపరిచి డకౌటయ్యాడు. తద్వారా వందో టెస్ట్‌లో డకౌటైన మూడో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో ఆటగాడిగా ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
వందో టెస్ట్‌లో డకౌటైన తొలి ఆటగాడిగా భారత క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ (1988) రికార్డుల్లోకెక్కాడు. ఆతర్వాత అలెన్ బోర్డర్ (1991), కోట్నీ వాల్ష్, మార్క్ టేలర్ (1998), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2006), బ్రెండన్ మెక్కల్లమ్ (2016), అలిస్టర్ కుక్ (2019), చతేశ్వర్ పుజారా (2023) తమతమ వందో టెస్ట్‌లో ఖాతా తెరవకుండా ఔటయ్యారు.
ఇదిలా ఉంటే, ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసి, 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) క్రీజ్‌లో ఉన్నారు.
135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. వీరిద్దరికి యువ మిడిలార్డర్ బ్యాటర్లు దేవ్‌దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) తోడవ్వడంతో పరుగుల వరద పారింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (57) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు.
తొలి రోజు ఆటలో కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment