టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ ఇద్దరు ఆటగాళ్లకు 100వ టెస్ట్ మ్యాచ్ కానుంది. టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ జానీ బెయిర్‌స్టో తమ కెరీర్‌లలో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు.
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో ఇద్దరు ఆటగాళ్లు (వేర్వేరు జట్లకు చెందిన వారు) 100 టెస్ట్‌ల మార్కును తాకడం ఇది మూడోసారి మాత్రమే. అశ్విన్, బెయిర్‌స్టోలకు చిరకాలం గుర్తుండిపోయే ఈ మ్యాచ్ కోసం వారితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
కాగా, కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన మైలురాయిని (100వ టెస్ట్) చేరుకునే ముందు ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఫామ్ లేమి సమస్య తెగ కలవరపెడుతుంది. భారత్‌తో సిరీస్‌లో అతను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.
ALERT 🚨.
— Vishal. (@SPORTYVISHAL) February 29, 2024
In the next match, both Ravi Ashwin and Jonny Bairstow will play their 100th Test match.
This will be only the 3rd time in 147 years of Test history that players from two different teams will play their 100th Test in the same match. pic.twitter.com/nYq4ytbhHm
తొలి టెస్ట్‌లో 47 పరుగులు (37, 10) చేసిన బెయిర్‌స్టో.. రెండో టెస్ట్‌లో 51 (25, 26), మూడో టెప్ట్‌లో 4 (0, 4), నాలుగో టెస్ట్‌లో 68 పరుగులు (30, 38) మాత్రమే చేసి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. బెయిర్‌స్టో వందో మ్యాచ్‌లోనైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. బెయిర్‌స్టో ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 36.43 సగటున 5974 పరుగులు చేశాడు.
అశ్విన్ విషయానికొస్తే.. యాష్ ఇదే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో 500 వికెట్ల మార్కును తాకి చరిత్రపుటల్లోకెక్కాడు. ప్రస్తుతం అతను ఓ మోస్తరు ఫామ్‌తో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లో యాశ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి, సిరీస్ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన అశ్విన్.. 507 వికెట్లు, 3309 పరుగులు చేశాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు, 5 సెంచరీలు ఉన్నాయి.
కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మార్చి 7 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment