
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. సీఎస్‌కే నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.
ముంబై స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(76), సూర్యకుమార్ యాదవ్(68) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(53), శివమ్ దూబే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. చాహర్, శాంటర్న్ తలా వికెట్ సాధించారు.
చరిత్ర సృష్టించిన ముంబై..
ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడు సార్లు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.
ముంబై కంటే ముందు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయింది. 2008 ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కేను తొలిసారిగా ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2020 సీజన్‌లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది.
మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చెన్నైను 9 వికెట్ల తేడాతో హార్దిక్ సేన ఓడించింది. కాగా ఈ ఓటమితో సీఎస్‌కే తమ ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల ఆడిన చెన్నై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్