
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడటం ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా 13వ సారి. ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ నుంచి ఇప్పటివరకు ముంబైతో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఏడింట విజయాలు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో సీఎస్‌కేను అరంగేట్రం ఆటగాడు నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనలతో గెలిపించారు.
తొలుత నూర్ (4-0-18-4) తన మాయాజాలం ప్రదర్శించి ముంబైని 155 పరుగులకే పరిమితం చేయగా.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ బ్యాటింగ్ విన్యాసాలతో సీఎస్‌కేను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే పేసర్ ఖలీల్ అహ్మద్ (4-0-29-3) కూడా రాణించాడు. ధోని మెరుపు స్టంపింగ్ (సూర్యకుమార్ యాదవ్) చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై స్వల్ప స్కోర్‌కే పరిమితమైనా.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ముంబై బౌలర్లు సీఎస్‌కేను అంత ఈజీగా గెలవనివ్వలేదు. రుతురాజ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు సీఎస్‌కే వైపే ఏకపక్షంగా సాగిన మ్యాచ్.. ఆతను ఔటయ్యాక మలుపులు తిరిగింది. ఓ దశలో ముంబై అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) రెచ్చిపోవడంతో సీఎస్‌కే కష్టాల్లో పడినట్లు కనిపించింది.
అయితే రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (17) రనౌట్ కావడంతో ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్‌కు దిగినా పరుగులేమీ చేయలేదు (2 బంతులు ఎదుర్కొని). ధోని రాకతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్‌కేను తెగ ఇబ్బంది పెట్టారు.
అంతకుముందు ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటై నిరాశపర్చగా.. విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. మరింత క్లినికల్‌గా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ ఆట ఇలాగే సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. అది జట్టు అవసరం. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా స్థానాన్ని మార్చుకోవడం (గతంలో ఓపెనర్‌గా వచ్చే వాడు) పట్ల నాకు ఎలాంటి బాధ లేదు. వాస్తవానికి ఇంకా సంతోషంగా ఉంది.
స్పిన్నర్లు సరైన పాయింట్‌పై ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వారు ముగ్గురు (నూర్, అశ్విన్, జడేజా) మంచి లయతో బౌలింగ్ చేశారు. ఇది మాకు శుభసూచకం. ఖలీల్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం మాకు కలిసొచ్చింది. నూర్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్, అందుకే అతన్ని జట్టులో చేర్చుకోవాలనుకున్నాము. అశ్విన్ జట్టులో ఉండటం మాకు బలాన్ని ఇస్తుంది. ధోని ఈ సంవత్సరం మరింత ఫిట్‌గా ఉన్నాడు. అతను ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment