
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PC: CSK X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). రికార్డు స్థాయిలో ఆరవ టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈసారి బరిలోకి దిగుతోంది. 2024లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన బాధ ఇంకా చెన్నై ఆటగాళ్ల మనసులో కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్‌లో తమ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని సీఎస్‌కే పట్టుదలతో ఉందనడంలో సందేహం లేదు.
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌కు ముందు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత అనుభవం గడించిన నేపథ్యంలో ఈ సీజన్లో కొత్త కెప్టెన్ మరింత మెరుగ్గా వ్యవహరించే అవకాశముందని భావిస్తున్నారు. కాగా.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది.
7 విజయాలు, 7 ఓటములతో కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించి గత సీజన్లో పేలవంగా ఐదో స్థానం తో ముగించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న చెన్నైలోని ఎం ఎ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.
స్పిన్-టు-విన్ వ్యూహం
ఈ నేపథ్యంలో ఈ సారి భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు చెన్నై అభిమానుల ఫేవరెట్ ఆటగాడు సామ్ కుర్రాన్‌తో సహా అనేక సుపరిచితమైన ఆటగాళ్లను చెన్నై మళ్ళీ జట్టులోకి తీసుకుంది. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెనుక నుంచి తన వ్యూహరచనలో జట్టును ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక జట్టును చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చిన 'స్పిన్-ట్రిక్' కు కట్టుబడి ఉండాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రవీంద్ర జడేజా, న్యూజిలాండ్‌కు చెందిన భారత్ సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రతో పాటు నూర్ అహ్మద్, అశ్విన్‌లను చేర్చడం, ముఖ్యంగా సొంత గడ్డ పై గరిష్ట ప్రభావాన్ని చూపడానికి టర్నర్‌లను ఉపయోగించాలనే వారి ధోరణిని గుర్తుచేస్తుంది.
అశ్విన్, నూర్ లతో పాటు జడేజా ఎడమచేతి ఫింగర్‌స్పిన్, గోపాల్ లెగ్‌స్పిన్, ఇంకా దీపక్ హుడా పార్ట్-టైమ్ ఆఫ్‌స్పిన్ వంటి బౌలర్లు చెన్నై స్పిన్ బౌలింగ్ కి వెరైటీ సమకూరుస్తున్నారు. ఇది చెపాక్‌లో స్పిన్-టు-విన్ వ్యూహానికి సరిగ్గా సరిపోతుంది.
బలీయంగా కనిపిస్తున్న బ్యాటింగ్
ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, న్యూ జిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి బ్యాటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. ఈ జంట 2023 సీజన్‌లో చాలా విజయవంతమైంది. కానీ గత సీజన్లో గాయం కారణంగా కాన్వే ఆడలేక పోయాడు. ఈ సీజన్లో ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజృంభించిన ఆడిన రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది.
కీలకమైన నాల్గవ స్థానంలో దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్ ఒకరు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత హార్డ్ హిట్టింగ్ శివమ్ దూబేను ఐదవ స్థానంలో, ఆ తర్వాత ఆరో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ తన నైపుణ్యంతో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. జడేజా తర్వాత, ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో గత సీజన్లో కీలక పాత్ర పోషించిన ధోని మరోసారి ప్రభావం చూపే అవకాశం ఉంది.
జట్టులో ప్రధాన ఆటగాళ్ళు:
రుతురాజ్ గైక్వాడ్: గత కొన్ని సీజన్లగా చెన్నై తరఫున నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నవారిలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. రుతురాజ్ తన జట్టు బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలిచాడు, 41.75 సగటుతో మరియు 136.86 స్ట్రైక్ రేట్‌తో 2380 పరుగులు సాధించాడు. అతని నాయకత్వంలో పసుపు బ్రిగేడ్ గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయినా, గైక్వాడ్ ఈ సీజన్‌లో మెరుగైన ఆటతీరుతో చెన్నై ని ముందుకు నడిపించాలని పట్టుదలతో ఉన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్: అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్, తన కెరీర్ ప్రారంభ దశలో తనను వెలుగులోకి తెచ్చిన ఫ్రాంచైజీ అయిన చెన్నై కి ఐపీఎల్ టైటిల్‌ను అందించాలని భావిస్తున్నాడు. 212 మ్యాచ్‌ల్లో 7.12 ఎకానమీ రేటుతో 180 వికెట్ల తో అశ్విన్ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఆఫ్ స్పిన్నర్ తాను బ్యాట్‌తో దూకుడుగా ఉండగలనని మరియు అవసరమైనప్పుడు ఫ్లోటర్‌గా వ్యవహరించగలనని చూపించాడు.
నాథన్ ఎల్లిస్: వేగంగా బౌలింగ్ చేయగల మరియు తన వైవిధ్యాలను చాలా చక్కగా ఉపయోగించుకునే సామర్థ్యంతో, నాథన్ ఎల్లిస్ చెన్నై జట్టులో కీలకమైన బౌలర్‌గా రాణిస్తాడని భావిస్తున్నారు.
శివం దూబే: దూకుడుతో బ్యాటింగ్ చేసే శివం దూబే చెన్నై జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించాడు. సూపర్ కింగ్స్ తరఫున 39 ఇన్నింగ్స్‌లలో 34.47 సగటు మరియు 159.16 స్ట్రైక్ రేట్‌తో 1103 పరుగులు చేశాడు. చెన్నై జట్టుకి మిడిల్ ఓవర్లలో శివం దూబే ను గేమ్-ఛేంజర్ గా భావించవచ్చు.
రాహుల్ త్రిపాఠి: డైనమిక్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడు లేక నాలుగో స్థానంలో ఆడే అవకాశముంది. త్రిపాఠి ఐపీఎల్‌లో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 27.27 సగటుతో, 139.3 స్ట్రైక్ రేట్‌తో 2236 పరుగులు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.
చదవండి: అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే: సీఎస్‌కే మాజీ స్పిన్నర్
Comments
Please login to add a commentAdd a comment