‘ఇంగ్లండ్‌ను ఉతికి ఆరేస్తాం’... ఎన్నో రోజులుగా టెస్టు మ్యాచ్ గురించి ప్రసారకర్తలు సాగించిన ప్రచారమిది! చివరకు చూస్తే అంతా తలకిందులైంది. మూడు రోజులకు పైగా ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా ఆఖరికి ప్రత్యర్థికి మ్యాచ్‌ను అప్పగించింది. ఇంగ్లండ్ తమ టెస్టు చరిత్రలోనే అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించగా... మన జట్టు భారీ స్కోరుతో సవాల్ విసిరి కూడా దానిని కాపాడుకోలేకపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 119 పరుగులు చేయాలిæ్స ఉన్నా... మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తారేమో అనుకున్నా ఎలాంటి సంచలనం సాధ్యం కాలేదు. మరో వికెట్ కూడా కోల్పోకుండా గంటన్నరలోనే ఛేదన పూర్తి చేసిన ఇంగ్లండ్ సొంతగడ్డపై సిరీస్ చేజారిపోకుండా కాపాడుకోగలిగింది.
బర్మింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ మధ్య ‘పటౌడీ ట్రోఫీ’ ఐదు టెస్టుల సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మంగళవారం ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 76.4 ఓవర్లలో 3 వికెట్లకు 378 పరుగులు చేసి గెలిచింది. నాలుగో రోజే 259 పరుగులు చేసిన ఆ జట్టు మిగిలిన 119 పరుగులను కూడా వికెట్ నష్టపోకుండా సాధించింది.
అజేయ సెంచరీలు సాధించిన జో రూట్ (173 బంతుల్లో 142 నాటౌట్; 19 ఫోర్లు, 1 సిక్స్), బెయిర్‌స్టో (145 బంతుల్లో 114 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 269 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో టీమ్‌ను గెలిపించారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాదిన బెయిర్‌స్టో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ సిరీస్‌లో 4 సెంచరీలు సహా 737 పరుగులు చేసిన రూట్ ఇంగ్లండ్ తరఫున... 22.47 సగటుతో 23 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకున్నారు. ఇరు జట్ల మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ మొదలవుతుంది.
19.4 ఓవర్లలోనే...
ఛేదనలో నాలుగో రోజే దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్ మంగళవారం కూడా ఎక్కడా తగ్గలేదు. చివరి వరకు అదే జోరును కొనసాగిస్తూ వేగంగా ఆట ముగించింది. ఇక ఏమీ చేయలేమన్నట్లుగా భారత బౌలర్లు కూడా ముందే చేతులెత్తేశారు. దాంతో ఓవర్‌కు 6 పరుగుల చొప్పున బాదుతూ తొలి సెషన్‌లో ఇరవై ఓవర్ల లోపే ఇంగ్లండ్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో 136 బంతుల్లో రూట్, 138 బంతుల్లో బెయిర్‌స్టో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సిరాజ్ ఓవర్లో బెయిర్‌స్టో మూడు ఫోర్లు బాది లక్ష్యానికి చేరువ చేయగా, తర్వాతి ఓవర్లో జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో సింగిల్ తీసి రూట్ జట్టును గెలిపించాడు. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు ఐదు (4.93) రన్‌రేట్‌తో పరుగులు తీస్తూ 76.4 ఓవర్లలోనే ఛేదించడం ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.
స్కోరు వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 416
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284
భారత్ రెండో ఇన్నింగ్స్: 245
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0.
Comments
Please login to add a commentAdd a comment