హైదరాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకోకముందే... భారత్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల నుంచి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు కూడా రెండో టెస్టుకు దూరమవడం జట్టుకు ప్రతికూలంగా పరిణమించనుంది.
అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, ఐపీఎల్‌లో అడపాదడపా మెరిపిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కింది. రెండో టెస్టు కోసం కొత్తగా సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్‌లను తీసుకోగా... తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఆదివారం నాలుగోరోజు ఆటలో పరుగు తీసే ప్రయత్నంలో జడేజా తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్‌లో కూడా రాహుల్ ఇదే విధమైన గాయంతో నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ‘గాయపడిన జడేజా, రాహుల్ ఇద్దరు వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టులో పాల్గొనడం లేదు. బోర్డు మెడికల్ టీమ్ ఇద్దరి పరిస్థితిని సమీక్షిస్తోంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
సర్ఫరాజ్ గుర్తున్న క్రికెటరే కానీ..!
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ భారత సీనియర్ జట్టుకు కొత్త ముఖమై ఉండొచ్చు కానీ... క్రికెట్ అభిమానులకు తెలియని పేరేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మెరిపించాడు. అతని మెరుపులకు ఒకానొక సందర్భంలో ఫిదా అయిన కోహ్లి... సర్ఫరాజ్ అవుటై పెవిలియన్‌కు చేరుతుంటే రెండు చేతులు జోడించి మరీ జేజేలు పలికాడు. సర్ఫరాజ్ రెండు ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ (2014, 2016)లలో ఆడాడు.
భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రంజీల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఇదంతా కూడా అతని ఆటతీరుకు నిదర్శనమైతే... నోటిదురుసుతో సెలక్షన్ కమిటీ పరిశీలనకు అతని పేరు అదేపనిగా దూరమైంది. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న 30 ఏళ్ల సౌరభ్ ఇప్పటి వరకు 68 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2061 పరుగులు సాధించడంతోపాటు 290 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment