England win
-
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ శుభారంభం
దోహా: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణీ అదిరింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6–2 గోల్స్ తేడాతో ఇరాన్‌పై ఘనవిజయం సాధించింది. గతేడాది ‘యూరో కప్’ ఫైనల్లో ఇటలీతో జరిగిన షూటౌట్లో నిరాశపరిచిన బుకయో సాకా, మార్కస్ రాష్‌ఫోర్డ్ తాజా మ్యాచ్‌లో ‘హీరో’లయ్యారు. బుకయో (43వ, 62వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా, మార్కస్ (71వ ని.లో) ఒక గోల్ సాధించాడు. మిగతా మూడు గోల్స్‌ను జూడ్ బెలింగమ్ (35వ ని.లో), రహీమ్ స్టెర్లింగ్ (45+1వ ని.లో), జాక్ గ్రెలిష్ (90వ ని.లో) సాధించారు. మెహది టరెమి (65వ ని., 90+13వ ని. ఇంజూరి టైమ్) చేసిన రెండు గోల్స్‌తో ఇరాన్ పరువు నిలిచింది. ఇంగ్లండ్ స్ట్రయికర్లు ఆటగాళ్లు పాదరసంలా కదలడంతో ఇరాన్ డిఫెండర్లకు కష్టాలు తప్పలేదు. మ్యాచ్ మొత్తంమీద బంతిని తమ గుప్పిటే పెట్టుకోవడంలో ఇంగ్లండ్ స్ట్రయికర్లు సఫలమయ్యారు. ఇంగ్లండ్ తొలి అర్ధభాగంలోనే 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆధీనంలో బంతి 82 శాతం ఉండగా... ఆటగాళ్లు ఏకంగా 366 పాస్‌లను పూర్తి చేశారు. 1966 తర్వాత ఓ ప్రపంచకప్ తొలి అర్ధభాగంలో నమోదైన అత్యధిక పాస్‌లు ఇవే కావడం విశేషం. ఇరాన్ గోల్‌కీపర్‌కు గాయం మ్యాచ్ మొదలైన కాసేపటికే ఇరాన్ గోల్ కీపర్ అలి బెరన్వంద్ తీవ్రంగా గాయపడి మైదానం వీడాడు. సహచరుల తల అతని ముఖా నికి బలంగా తాకడంతో ముక్కు, గదవ దగ్గర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. నెదర్లాండ్స్ గెలుపు సెనెగల్ జట్టుతో సోమవారమే జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. ఆట 84వ నిమిషంలో కొడీ గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. ఇంజ్యూరీ టైమ్ (90+9వ ని.)లో డావీ క్లాసెన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయం ఖాయమైంది. ప్రపంచకప్‌లో నేడు అర్జెంటీనా X సౌదీ అరేబియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి డెన్మార్క్ X ట్యునీషియా సాయంత్రం గం. 6:30 నుంచి మెక్సికో X పోలాండ్ రాత్రి గం. 9:30 నుంచి ఫ్రాన్స్ X ఆస్ట్రేలియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2022 : స్యామ్ కరన్ 5/10
పెర్త్: టి20 వరల్డ్ కప్‌ను మాజీ చాంపియన్ ఇంగ్లండ్ విజయంతో మొదలు పెట్టింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కొంత తడబడినా, చివరకు లక్ష్యాన్ని చేరింది. శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన ‘సూపర్ 12’ గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీమ్ జద్రాన్ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఘని (30 బంతుల్లో 30; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (5/10) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టి20ల్లో ఇంగ్లండ్ తరఫున ఒక బౌలర్ 5 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. స్టోక్స్, మార్క్ వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. బట్లర్ (18), హేల్స్ (19) ప్రభావం చూపలేకపోగా...ఆ తర్వాత తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. అయితే లివింగ్‌స్టోన్ (21 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి జట్టును ఒడ్డున పడేశాడు. -
IND W vs ENG W 3rd T20: మళ్లీ ఓడిన మన మహిళలు
బ్రిస్టల్: ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన హర్మన్ బృందానికి ఓటమిని అందించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఒక దశలో టీమ్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 9.5 ఓవర్లకే షఫాలీ (5), స్మృతి (9), మేఘన (0), హేమలత (0), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (5) వెనుదిరగ్గా... 52 పరుగుల వద్ద స్నేహ్ రాణా (8) వికెట్ పడింది. ఈ దశలో రిచా ఘోష్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు), దీప్తి శర్మ (25 బంతుల్లో 24) ఆదుకోవడంతో స్కోరు 100 పరుగులు దాటగలిగింది. చివర్లో పూజ వస్త్రకర్ (19 నాటౌట్; 2 ఫోర్లు) కూడా కొన్ని పరుగులు జోడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (3/25) భారత్‌ను దెబ్బ తీయగా, సారా గ్లెన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు సాధించి గెలిచింది. సోఫియా డంక్లీ (44 బంతుల్లో 49; 6 ఫోర్లు), అలైస్ క్యాప్సీ (24 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, డానీ వ్యాట్ (22; 1 ఫోర్) రాణించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం హోవ్‌లో తొలి వన్డే జరుగుతుంది. -
ఇంగ్లండ్‌దే టి20 సిరీస్
మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 2–1తో సొంతం చేసుకుంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ (57 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 35 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ జట్టు 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ జేసన్ రాయ్ (36 బంతుల్లో 64; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మలాన్ (31; 2 ఫోర్లు), మోర్గాన్ (12 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. పాక్ స్పిన్నర్ హఫీజ్ 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. -
భారత్ నెత్తిన బెయిర్ స్ట్రోక్స్
ఇంగ్లండ్ విజయ లక్ష్యం 337 పరుగులు... తొలి వన్డేలో 14 ఓవర్లకే 135 పరుగులు సాధించి కూడా 318 పరుగులు చేయలేక ఓడిన జట్టు దీనిని ఏం ఛేదిస్తుందిలే అనిపించింది. కానీ ప్రపంచ చాంపియన్ అసాధారణ ప్రదర్శనతో దానిని తప్పుగా నిరూపించింది. భారత బౌలర్లపై విరుచుకుపడిన స్టోక్స్, బెయిర్‌స్టో ఒక్క దెబ్బతో మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేశారు. మరో 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యం చేరి ఇంగ్లండ్ సత్తా చాటింది. అంతకుముందు రాహుల్ సెంచరీ... పంత్ మెరుపులు, కోహ్లి అర్ధ సెంచరీతో భారీ స్కోరు సాధించి విజయంపై ధీమాగా కనిపించిన టీమిండియా చివరకు చేతులెత్తేయడంతో... ఆదివారం జరిగే తుది పోరులోనే సిరీస్ విజేత ఎవరో తేలనుంది. పుణే: భారత్‌తో వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 1–1తో సమం చేసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... రిషభ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 4 వికెట్లకు 337 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకం సాధించగా... స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు), జేసన్ రాయ్ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. చివరి వన్డే రేపు ఇక్కడే జరుగుతుంది. పంత్ దూకుడు... గత మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్ (4), రోహిత్ శర్మ (25) ఈసారి తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే రెండో వికెట్‌కు కోహ్లితో 121 పరుగులు, మూడో వికెట్‌కు పంత్‌తో 113 పరుగులు జోడించి రాహుల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 35 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను బట్లర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. కోహ్లి అవుటయ్యాక వచ్చిన పంత్ సిక్సర్లతో విరుచుకుపడి ఒక్కసారిగా మ్యాచ్ స్వభావాన్ని మార్చేశాడు. 40 ఓవర్లు ముగిసేసరికి 210 పరుగుల వద్ద ఉన్న భారత్ చివరి 10 ఓవర్లలో ఏకంగా 126 పరుగులు చేయడం విశేషం. పంత్ 28 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకోగా, రాహుల్ 108 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులతో భారత్ భారీ స్కోరు సాధించింది. రాహుల్, పంత్ భారీ భాగస్వామ్యాలు... ఇంగ్లండ్‌కు మరోసారి అదిరే ఆరంభం లభించింది. తొమ్మిది బంతుల వ్యవధిలో ఐదు ఫోర్లు బాదిన రాయ్... కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, శార్దుల్ ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతో భాగస్వామ్యం 100 దాటింది. సమన్వయలోపంతో రాయ్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 45 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న బెయిర్‌స్టో ఆ తర్వాత మరింత వేగంగా పరుగులు రాబట్టాడు. గత మ్యాచ్‌లో సెంచరీ కోల్పోయిన అతను ఈసారి 95 బంతుల్లో శతకం అందుకోవడం విశేషం. విజయానికి చేరువవుతున్న తరుణంలో 2 పరుగుల వ్యవధిలో స్టోక్స్, బెయిర్‌స్టోతో పాటు బట్లర్ (0) కూడా అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే తొలి మ్యాచ్ ఆడిన లివింగ్‌స్టోన్ (27 నాటౌట్) వేగంగా ఆడి పని పూర్తి చేశాడు. పాపం కుల్దీప్... చైనామన్ బౌలర్ కుల్దీప్కు శుక్రవారం ఏమాత్రం కలిసి రాలేదు. స్టోక్స్, బెయిర్‌స్టో జోరుకు అతను బలయ్యాడు. భారీగా పరుగులు ఇచ్చిన ఒత్తిడిలో తన ఫీల్డింగ్ వైఫల్యాలు అతడిని మరింత బాధపడేలా చేశాయి. తన తొలి 6 ఓవర్లలో 32 పరుగులిచ్చి మెరుగ్గానే కనిపించిన కుల్దీప్ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 8, 17, 20, 7 (మొత్తం 52) చొప్పున పరుగులిచ్చి బిక్కమొహం వేశాడు. అదరగొట్టాడు... భారత పర్యటనలో స్టోక్స్ నుంచి అతని స్థాయి ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో అతను తన విలువేంటో చూపించాడు. తొలి బంతి నుంచే చెలరేగిన స్టోక్స్‌ను నిలువరించ డం భారత బౌలర్లవల్ల కాలేదు. తొలి మూడు సిక్సర్లు కృనాల్ బౌలింగ్‌లోనే కొట్టిన అతను 32 పరుగుల వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. అనంతరం దూకుడు పెంచి కుల్దీప్ ఓవర్లో 6, 4 బాది 40 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత స్టోక్స్ కొట్టిన షాట్లు భారత్ గెలిచే అవకాశాలను దూరం చేశాయి. అర్ధసెంచరీ తర్వాత తాను ఆడిన 11 బంతుల్లో స్టోక్స్ వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 (మొత్తం 49) బాదడం విశేషం. ముఖ్యంగా కుల్దీప్ ఓవ ర్లో కొట్టిన మూడు వరుస సిక్సర్లు, కృనాల్ ఓవర్లో కొట్టిన 3 సిక్స్ లు, 1 ఫోర్ స్టోక్స్ ఎంత ప్రమాదకారినో చూపించాయి. దురదృష్టవశాత్తు భువీ బౌలింగ్‌లో పుల్కు ప్రయత్నించి సెంచరీ చేజార్చుకున్నా ...ఈ ఇన్నింగ్స్ విలువ వందకంటే ఎక్కువే! స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) స్యామ్ కరన్ 25; ధావన్ (సి) స్టోక్స్ (బి) టాప్లీ 4; కోహ్లి (సి) బట్లర్ (బి) రషీద్ 66; రాహుల్ (సి) టాప్లీ (బి) టామ్ కరన్ 108; పంత్ (సి) రాయ్ (బి) టామ్ కరన్ 77; హార్దిక్ పాండ్యా (సి) రాయ్ (బి) టాప్లీ 35; కృనాల్ (నాటౌట్) 12; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 336. వికెట్ల పతనం: 1–9, 2–37, 3–158, 4–271, 5–308, 6–334. బౌలింగ్: స్యామ్ కరన్ 7–0–47–1, టాప్లీ 8–0–50–2, టామ్ కరన్ 10–0–83–2, బెన్ స్టోక్స్ 5–0–42–0, మొయిన్ అలీ 10–0–47–0, రషీద్ 10–0–65–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (రనౌట్) 55; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 124; బెన్ స్టోక్స్ (సి) పంత్ (బి) భువనేశ్వర్ 99; డేవిడ్ మలాన్ (నాటౌట్) 16; బట్లర్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (43.3 ఓవర్లలో 4 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–110, 2–285, 3–287, 4–287. బౌలింగ్: భువనేశ్వర్ 10–0–63–1, ప్రసిధ్ కృష్ణ 10–0–58–2, శార్దుల్ ఠాకూర్ 7.3–0–54–0, కుల్దీప్ యాదవ్ 10–0–84–0, కృనాల్ పాండ్యా 6–0–72–0. -
స్టోక్స్ ఆ పరుగులు వద్దన్నాడట!
లండన్: ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విజయంలో ‘6 పరుగుల ఓవర్‌త్రో’ పాత్ర కూడా ఉంది. గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు దీనిపై విమర్శించారు కూడా. అయితే ఇప్పుడు స్టోక్స్ టెస్టు జట్టు సహచరుడు, సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కొత్త అంశాన్ని ముందుకు తెచ్చాడు. ఓవర్‌త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని స్టోక్స్ అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్ వెల్లడించాడు. ‘బ్యాట్స్‌మన్ పరుగు తీసే సమయంలో త్రో అతనికి తగిలి మైదానంలో బంతి ఎక్కడికైనా వెళితే పరుగు తీయకుండా ఆగిపోవడం క్రికెట్లో నైతిక నియమం. కానీ బంతి బౌండరీ దాటితే ఎవరేమీ చేయలేరు. నాలుగు పరుగులు ఇవ్వాల్సిందే. నిజానికి మ్యాచ్ తర్వాత స్టోక్స్ అంపైర్ వద్దకు వెళ్లి ఆ నాలుగు పరుగులు తీసేయండి. మాకు అవసరం లేదని చెప్పాడు. తాను తప్పు చేసినట్లు కూడా అతను మైకేల్ వాన్తో అన్నట్లు తెలిసింది. అయితే అదంతా నిబంధనల ప్రకారమే జరిగింది’ అని అండర్సన్ మద్దతు పలికాడు. ఓవర్ త్రో బౌండరీ చేరగానే తన తప్పేమీ లేదన్నట్లుగా చేతులెత్తి చూపించిన స్టోక్స్... దీనిపై విలియమ్సన్కు క్షమాపణ చెప్పానని మాత్రం మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. అందులో అంపైర్ల ప్రస్తావన లేదు కాబట్టి అండర్సన్ వ్యాఖ్యలో నిజమెంత అనేది సందేహమే! -
అంతా పీడకలలా అనిపిస్తోంది
లండన్: ప్రపంచ కప్ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. ఫైనల్ మరుసటి రోజు దీనిపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారంగా స్పందించాడు. ‘నిరాశ మమ్మల్ని ఉప్పెనలా ముంచెత్తింది. ఉదయం లేచి చూస్తే పీడకల కన్నట్లుగా అనిపించింది. మా ఆటగాళ్లంతా నిజంగా చాలా బాధపడుతున్నారు. మ్యాచ్‌లో ఈ తరహాలో ఓడటం ఏదోలా ఉంది’ అని విలియమ్సన్ తన బాధను వ్యక్తీకరించాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కివీస్ కెప్టెన్... బౌండరీల లెక్క నిబంధనపై ఆచితూచి స్పందించాడు. ‘బౌండరీలను బట్టి విజేతను నిర్ణయించడం సరైందా అంటే నేను ఎప్పటికీ సమాధానం ఇవ్వలేను. నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని గానీ నేను జవాబు ఇవ్వాల్సి వస్తుందని గానీ అసలెప్పుడూ ఊహించలేదు. ఇంకా ఓటమి బాధలోనే ఉన్నాం. ఇరు జట్లు ఇంత కష్టపడిన తర్వాత బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది సిగ్గుచేటు’ అని అతను వ్యాఖ్యానించాడు. అయితే ఇంత జరిగినా అతను ఈ నిబంధనను విమర్శించడానికి ఇష్టపడకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ‘నిబంధనలు మొదటి నుంచి ఉన్నాయనేది వాస్తవం. కానీ ఇలాంటి నిబంధనతో మ్యాచ్ ఫలితం తేల్చాల్సి వస్తుందని బహుశా ఎవరూ ఊహించకపోవచ్చు. స్టోక్స్ బ్యాట్‌కు తగిలి ఓవర్‌త్రో వెళ్లడం కూడా అలాంటిదే. ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అందరూ దానిని బాగా ఆస్వాదించారు’ అని విలియమ్సన్ చెప్పడం విశేషం. ఫైనల్ ఫలితం తర్వాత భావోద్వేగాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు స్పందిస్తూ విలియమ్సన్... ‘ఇలాంటి స్థితిలో నవ్వడమో లేదా ఏడవడమో అనే ఒకే ఒక అనుభూతి ఉంటుంది. అయితే కొంత నిరాశ ఉన్నా నాకు కోపం మాత్రం లేదు’ అని విలియమ్సన్ స్పష్టం చేశాడు. -
వీధి రౌడీలా కాదు హీరోలా...
లండన్: బెన్ స్టోక్స్ అంటే అందరికీ రెండే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి మ్యాచ్‌ను చేజార్చిన వైనం... ఆ తర్వాత నైట్ క్లబ్ వద్ద ఒక వ్యక్తిని చితక్కొట్టిన ఘటన... కానీ ఇప్పుడు అతను ఒకేసారి ఈ రెండింటినీ మరచిపోయే ఘనతను సాధించాడు. ‘వీధిలో రౌడీలా గొడవకు దిగిన వ్యక్తిగా నేను గుర్తుండిపోదల్చుకోలేదు. మైదానంలో ఏదైనా సాధించిన వాడిగా ఉండాలనుకుంటున్నా. ప్రపంచ కప్ గెలిస్తే నా బయోడేటాలో అదే ముందుంటుంది’ అని మెగా టోర్నీకి ముందు చెప్పిన స్టోక్స్ చివరకు దానిని నిజం చేసి చూపించాడు. ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించి ఒకరకంగా అతను పాపపరిహారం చేసుకున్నాడు. టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు చేసిన స్టోక్స్... ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ అపూర్వం. క్లిష్టపరిస్థితుల్లో అజేయంగా 84 పరుగులు చేసిన స్టోక్స్ చరిత్రలో నిలిచిపోయాడు. ‘నాకు మాటలు రావడం లేదు. ఇక్కడికి చేరేందుకు గత నాలుగేళ్లుగా పడ్డ శ్రమ, ఇప్పుడు ప్రపంచ చాంపియన్లుగా నిలవడం అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఫైనల్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టి 12 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు వలస వెళ్లిన స్టోక్స్... ఇప్పుడు ఫైనల్లో కివీస్‌పైనే చెలరేగడం విశేషం. ‘న్యూజిలాండ్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడైనా ప్రత్యేకమే. అది గొప్ప జట్టు మాత్రమే కాదు. అందులో చాలా మంది మంచివాళ్లున్నారు. నా ఓవర్‌త్రో సిక్సర్ తర్వాత విలియమ్సన్కు నేను క్షమాపణ చెప్పా’ అని మ్యాచ్ అనంతరం స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కష్టకాలంలో జట్టు సహచరులు తనకు, తన కుటుంబానికి అండగా నిలవడం వల్లే మళ్లీ కోలుకొని ఇక్కడి వరకు రాగలిగాలని 28 ఏళ్ల స్టోక్స్ భావోద్వేగంతో చెప్పాడు. ఇప్పుడెవరికీ అతని నాలుగు సిక్సర్లు గానీ బ్రిస్టల్‌లో గొడవ కానీ గుర్తుకు రావు. ఇంగ్లండ్ చరిత్రలో గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలిచిపోయిన ఇయాన్ బోథమ్ సహా మరెందరికో సాధ్యం కాని రీతిలో విశ్వ విజయంలో భాగమైన స్టోక్స్ ఇప్పుడు వారందరికీ సూపర్ హీరో మాత్రమే. -
అదృష్టం మా వైపు ఉంది!
లండన్: ప్రపంచ కప్‌ను గెలుచుకున్నామన్న ఆనందం నుంచి తాము ఇంకా బయటకు రాలేకపోతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. నాలుగేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిదని మ్యాచ్ తర్వాత అతను వ్యాఖ్యానించాడు. ‘మేం గెలుపు గీత దాటడం ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాతో పాటు జట్టు సభ్యులందరూ ఒక ప్రణాళిక ప్రకారం అంకితభావంతో కష్టపడ్డాం. ఈ గెలుపు ప్రయాణం అద్భుతంగా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి కూడా మాపై అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేయడం సంతోషంగా ఉంది’ అని మోర్గాన్ అన్నాడు. బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించిన నిబంధనపై మోర్గాన్ జాగ్రత్తగా స్పందించాడు. ‘ఇప్పుడు అమలు చేసిన పద్ధతి కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి. అప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఏది మెరుగైందో నిర్ణయించవచ్చు. టోర్నీ నిబంధనలు చాలా కాలం క్రితమే రూపొందించారు. వాటిపై మన నియంత్రణ ఉండదు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్పష్టీకరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌పై మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ‘స్టోక్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను మానవాతీతుడిలా ఆడి జట్టు గెలుపు భారాన్ని సమర్థంగా మోశాడు. బట్లర్ ఔటైన తర్వాత చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో అతను ఇన్నింగ్స్ నడిపించడం అసాధారణం’ అని మోర్గాన్ చెప్పాడు. ‘అల్లా కూడా మాతోనే’... మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్ కాగా... అన్ని కలిసి రావడంపై అక్కడ ‘ఐరిష్ లక్’ పేరుతో బాగా ప్రాచుర్యంలో సామెత ఉంది. ‘ఐరిష్ లక్’ వెంట నడిచిందా అంటూ అడిగిన ప్రశ్నపై మోర్గాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నా సహచరుడు ఆదిల్ రషీద్‌తో మాట్లాడినప్పుడు అల్లా ఈ రోజు మనతో ఉన్నాడని చెప్పాడు. కాబట్టి నేను కూడా అల్లా మా జట్టుకు అండగా నిలిచాడని నమ్ముతున్నా. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో వేర్వేరు సంప్రదాయాలు, నేపథ్యాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. కానీ ఆటకు వచ్చేసరికి అంతా కలిసికట్టుగా ఆడి విజయం సాధించాం’ అని అతను విశ్లేషించాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం విశ్వ విజేతగా ఆనందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు మోర్గాన్ చెప్పాడు. 6 కాదు 5 పరుగులు ఇవ్వాల్సింది! ఓవర్‌త్రోపై మాజీ అంపైర్ టఫెల్ అభిప్రాయం లండన్: ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్‌ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చినా... అతని బ్యాట్‌కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్‌ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్‌పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు. ‘బౌండరీ’పై విమర్శల బాదుడు! ప్రపంచ కప్ ఫైనల్ ఫలితాన్ని బౌండరీల లెక్కతో తేల్చడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిని అత్యంత చెత్త నిబంధనగా పేర్కొంటూ మాజీ క్రికెటర్లు ఐసీసీపై విరుచుకుపడ్డారు. దీనికంటే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిందని కొందరు అభిప్రాయ పడగా, ఇలాంటి నిబంధనలు మార్చేయాలని మరికొందరు సూచించారు. ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ పరంగా చూస్తే 26–17 తేడాతో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ నెగ్గింది. ‘క్రికెట్లో కొన్ని నిబంధనలపై తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ –రోహిత్ శర్మ ‘అద్భుతంగా సాగిన మ్యాచ్‌లో ఫలితాన్ని బౌండరీల తేడాతో నిర్ణయించడం ఏమిటో అర్థం కాలేదు. అతి చెత్త నిబంధన ఇది. ‘టై’గా ప్రకటిస్తే బాగుండేది’ –గౌతం గంభీర్ ‘బౌండరీ నిబంధనకు నేను కూడా మద్దతివ్వను. కానీ రూల్స్ అంటే రూల్సే. ఎట్టకేలకు కప్ గెలిచిన ఇంగ్లండ్‌కు అభినందనలు’ –యువరాజ్ సింగ్ ‘అసలు ఎంత బాగా పని చేస్తున్నారో...అసలు ఐసీసీ అనేదే పెద్ద జోక్’ –స్కాట్ స్టయిరిస్ ‘ఐసీసీ నిబంధన వల్ల ఇంగ్లండ్ కప్ గెలవడం అసలే మాత్రం ఊహించలేనిది. ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది’ –బిషన్ సింగ్ బేడి ‘డక్‌వర్త్ లూయిస్ నిబంధన పరుగులు, వికెట్లపై ఆధారపడి ఉంది. కానీ ఫైనల్ ఫలితం మాత్రం బౌండరీల లెక్క ప్రకారం తీసుకుంటారా’ –డీన్ జోన్స్ ‘నా దృష్టిలో ఇలా విజేతను నిర్ణయించడం దుర్మార్గమైన పద్ధతి. ఇది మారాల్సిందే’ –బ్రెట్ లీ ‘చాలా బాధగా ఉంది. మేం మోసపోయినట్లనిపిస్తోంది. పిచ్చి నిబంధన. ఇది కూడా టాస్ వేసి విజేతను నిర్ణయించడంలాంటిదే’ –డియాన్ నాష్ ‘క్రూరత్వం’ –స్టీఫెన్ ఫ్లెమింగ్ -
సారీ న్యూజిలాండ్...
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్ ఫైనల్లో పాత రూల్స్ అమల్లో ఉంటే ఇంగ్లండ్–న్యూజిలాండ్‌లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. కానీ ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయిందంటే సగటు క్రికెట్ అభిమాని కూడా దానిని తమ పరాజయంగా భావిస్తున్నాడు. స్టోక్స్ బ్యాట్‌ను తాకి పోయిన 6 పరుగుల ఓవర్‌త్రో దురదృష్టమో, గప్టిల్ గ్రహచారం బాగా లేని రోజు కావడమో కానీ విలియమ్సన్ సేన విలపించాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఆట తర్వాత కూడా బౌండరీ లెక్కల త్రాసుతో ఇంగ్లండ్ పైచేయి కావడం బలవంతంగా కివీ రెక్కలు విరిచేసినట్లయింది. వరుసగా రెండోసారి కూడా న్యూజిలాండ్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి వెంటాడింది. అయితే ఆ జట్టు గొప్పతనాన్ని ఈ మ్యాచ్ ఫలితం తగ్గించలేదు. ప్రత్యర్థులపై మాటల దాడి చేయకుండా, దూషణలకు పాల్పడకుండా కూడా ప్రపంచ కప్‌లో గొప్ప విజయాలు సాధించవచ్చని ఆ జట్టు నిరూపించింది. కివీస్ క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైదానంలో వారి ప్రవర్తన. తమదైన ఆటను ఆడుకుంటూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంలో వారికి వారే సాటి. ఫెయిర్ ప్లే అవార్డు అంటూ ఎప్పుడిచ్చినా ఈ మర్యాద రామన్నల బృందానికే దక్కడం పరమ రొటీన్. ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టంను మొదలు పెట్టింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అందరికంటే అతి తక్కువగా ఒకే ఒకసారి శిక్షకు గురైన జట్టు న్యూజిలాండ్. వారి ఆట ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇది చాలు. ఏ టోర్నీలో బరిలోకి దిగినా వారిని ‘అండర్డాగ్’గానే చూడడం అందరికీ అలవాటైపోయింది. డాగ్ ఏదైనా అసలైన రోజు కరవడం ముఖ్యం అని స్వయంగా విలియమ్సన్ చెప్పినట్లు రెండు అసలు మ్యాచ్‌లలో కివీస్ సత్తా చాటింది. సెమీస్‌లోనే భారత్ ముందు అసలు కివీస్‌ను ఎవరూ పెద్దగా లెక్క చేయలేదు. కానీ అద్భుత వ్యూహంతో ఆ జట్టు అనూహ్య విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరుకే పరిమితమైనా... పట్టుదలతో ఆడి టీమిండియాను నిలవరించగలిగింది. ఫైనల్లో కూడా నాలుగు ఇంగ్లండ్ వికెట్లు తీసిన తర్వాత విజయానికి బాటలు వేసుకున్న ఆ జట్టు అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయింది. కెప్టెన్‌గా తొలి ప్రపంచ కప్‌లో బ్యాట్స్‌మన్‌గానూ తనదైన ముద్ర వేసిన విలియమ్సన్కు దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్ల నుంచి ఎక్కువ మద్దతు లభించలేదు. అదే చివరి పోరులో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేందుకు కారణమైంది. విలియమ్సన్ 82.57 సగటుతో ఏకంగా 578 పరుగులు చేయగా... రెండో స్థానంలో నిలిచిన టేలర్ మూడు అర్ధ సెంచరీలతో 350 పరుగులకే పరిమితమయ్యాడు. గత వరల్డ్‌కప్‌లో డబుల్ సెంచరీ సహా హీరోగా నిలిచిన గప్టిల్ ఘోర వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 186 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కివీస్ ఇక్కడి వరకు రాగలిగిందంటే పేస్ బౌలింగ్ త్రయమే కారణం. ఫెర్గూసన్ (21), బౌల్ట్ (17), హెన్రీ (14) కలిపి 52 వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా ఓవర్‌కు ఐదుకు మించి పరుగులు ఇవ్వలేదంటే ఎంత నియంత్రణతో బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. 232 పరుగులు చేసిన నీషమ్ కూడా 15 వికెట్లతో అండగా నిలిచాడు. అయితే చివరకు బ్యాటింగ్ వైఫల్యమే కివీస్‌కు గొప్ప అవకాశాన్ని దూరం చేసింది. అఫ్గానిస్తాన్ మినహా టోర్నీలో 300 దాటని ఏకైక జట్టు న్యూజిలాండే. ఫలితంగా కివీస్ బృందం టైటిల్ కాకుండా మరోసారి హృదయాలు గెలుచుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
ప్రపంచ కల నెరవేరింది
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది... ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది. ఔను...! ఇంగ్లండ్ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది... లండన్ : ఇంగ్లండ్ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఓవర్ ఎలిమినేటర్ పద్ధతిలో ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విలియమ్సన్ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్ (3/43), ఫెర్గూసన్ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్‌హోమ్ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటం, బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో తేరుకుంది. నికోల్స్ నిలిచాడు... లాథమ్ ఆడాడు కివీస్ ఓపెనింగ్ జంట నికోల్స్, గప్టిల్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపిన గప్టిల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి కివీస్‌కు ప్లంకెట్ షాకిచ్చాడు. అతడి గుడ్ లెంగ్త్ బంతి విలియమ్సన్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్‌ను సాగనంపాడు. అంపైర్ ఎరాస్మస్ తప్పుడు నిర్ణయానికి రాస్ టేలర్ (15) బలయ్యాడు. ఆల్‌రౌండర్ నీషమ్ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. గ్రాండ్‌హోమ్ (16) అండగా లాథమ్ బండి లాగించాడు. వోక్స్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్‌ట్నర్ (5 నాటౌట్) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇంగ్లండ్ కష్టంగానైనా అందుకుంది... ఇంగ్లండ్ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతే ఓపెనర్ జేసన్ రాయ్ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్ ఎరాస్మస్ ఔటివ్వకపోవడంతో కివీస్ సమీక్ష కోరింది. బంతి లెగ్ స్టంప్ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్‌ను ఊగిసలాటలో పడేసి వికెట్ దక్కించుకున్నాడు. రూట్ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్హోమ్పై ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. బెయిర్ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్ (9) పేలవ షాట్‌కు ఔటయ్యాడు. అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్–బట్లర్ ఐదో వికెట్‌కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు. సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్ ఓవర్లో బట్లర్ షాట్‌కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్ పోరాడుతున్నా... వోక్స్ (2)ను పెవిలియన్ చేర్చి కివీస్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్ (10), ఆర్చర్ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి నీషమ్ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్ తొలి రెండు బంతులకు స్టోక్స్ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్‌లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్ త్రో స్టోక్స్‌కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్ (0), వుడ్ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి ఐదు ఓవర్లు హైడ్రామా... ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్ రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్ (46.1), ప్లంకెట్ (48.3), ఆర్చర్ (48.6) ఔటవ డంతో కప్ న్యూజిలాండ్‌దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్ సిక్స్, ఓవర్ త్రో రూపంలో 2 ప్లస్ 4 పరుగులు రావడంతో తలకిందులైంది. బౌల్ట్ క్యాచ్... సిక్స్... మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్ పాయింట్ నీషమ్ ఓవర్లో స్టోక్స్ కొట్టిన సిక్స్ షాట్. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్ మిడ్ వికెట్‌లోకి భారీ షాట్ ఆడగా... బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్‌కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్‌ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్ గప్టిల్ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్ నమోదైంది. బోనస్‌గా స్టోక్స్‌కు లైఫ్ వచ్చింది. ప్రధాన పేసర్ అయిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్‌కు వేదన మిగిల్చింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ (ఎల్బీడబ్ల్యూ) వుడ్ 15; లాథమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 16; సాన్‌ట్నర్ (నాటౌట్) 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241 వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240. బౌలింగ్: వోక్స్ 9–0–37–3; ఆర్చర్ 10–0–42–1; ప్లంకెట్ 10–0–42–3; వుడ్ 10–1–49–1; రషీద్ 8–0–39–0; స్టోక్స్ 3–0–20–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9, స్టోక్స్ (నాటౌట్) 84; బట్లర్ (సి) సబ్ (సౌతీ) (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ (రనౌట్) 0; మార్క్ వుడ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241. బౌలింగ్: బౌల్ట్ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్ 10–2–25–1, ఫెర్గూసన్ 10–0–50–3, నీషమ్ 7–0–43–3, సాన్‌ట్నర్ 3–0–11–0. సూపర్ ఓవర్ సాగిందిలా... నోట్: సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్ 17 బౌండరీలు సాధించింది. స్టోక్స్... మాస్టర్ స్ట్రోక్... ప్రపంచ కప్ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్‌కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్ స్టోక్స్‌కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్‌కు ఒక కప్ (2017 టి20 ప్రపంచ కప్) చేజారింది. భారత్ వేదికగా జరిగిన నాటి కప్ ఫైనల్లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో కార్లొస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండీస్‌కు కప్‌ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్ పిచ్ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్‌లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది. గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గప్టిల్‌ను ఓదార్చుతున్న నీషమ్ -
పోరాడి ఓడిన భారత్
-
పోరాడి ఓడిన భారత్... రాహుల్, పంత్ పోరాటం వృథా
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టీమిండియా పరాజయాం పాలైంది.118 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు 4-1తో సొంతం చేసుకుంది. భారత బ్యాట్సమెన్స్‌లో కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) వీరోచిత సెంచరీలతో పోరాడినా.. మిగతా వారంతా విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. రెండు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను రాహుల్, పంత్ ధ్వయం ఆదుకున్నారు. వీరిద్దరు ఆరోవికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ దశలో విజయం వైపు వెళ్తున్న ఈ జోడిని రషీద్ అవుడ్ చేయడంతో వీరి పోరాటానికి తెరపడింది. దీంతో తరువాత వచ్చిన వారు కూడా వెంటనే అవుట్ అవ్వడంతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ మూడు, రషీద్, కరన్ రెండేసి వికెట్లతో రాణించారు. -
సౌతాంప్టన్ టెస్ట్‌లో భారత్ ఓటమి
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 184 పరుగులకు భారత్ ఆలౌటైంది. దీంతో సీరిస్‌ను ఇంగ్లండ్ 3-1తో కైవసం చేసుకుంది. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి, రహానే జోడి కలిసి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో మొయిన్ అలీ కోహ్లి(58)ని ఔట్ చేసి గట్టి దెబ్బకొట్టాడు. దీంతో నాలుగో వికెట్ నమోదైన 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాచ్ మనవైపు వచ్చిందనుకునే తరుణంలో మొయిన్ అలీ కోహ్లి వికెట్‌తో దెబ్బతీశాడు. విరాట్ వెనుదిరగడంలో భారత పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు ఎవరు నిలదోక్కుకోలేకపోయ్యారు. కీలక దశలో హాఫ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే (51)గా వెనుదిరిగాడు. కాసేపు దాటిగా ఆడిన రిషబ్ పంత్ (18) కూడా నిలువలేకపోయ్యాడు. చివర్లో అశ్విన్ (25) కాసేపు పోరాడాడు. ఓపెనర్లు రాహుల్(0), ధావన్ (17)లు నిరాశ పరిచారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీతో ఆకట్టుకున్న పుజారా(5) ఈ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ నాలుగు వికెట్లతో భారత పతానాన్ని శాసించాడు. ఈ నెల లార్డ్స్ మైదానంలో చివరి టెస్ట్ జరగనుంది. -
ఇంగ్లండ్ ఘన విజయం
హెడింగ్లే: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి ఇంగ్లండ్ బదులు తీర్చుకుంది. రెండో టెస్టులో కేవలం మూడు రోజుల్లోనే విజయాన్ని సొంతం చేసుకొని సిరీస్‌ను 1–1తో ముగించింది. ఆతిథ్య జట్టు పేసర్లు బ్రాడ్ (3/28), బెస్ (3/33) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 134 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... అబ్బాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. పాక్ బ్యాట్స్‌మెన్‌లో ఇమాముల్ హక్ (34; 5 ఫోర్లు), ఉస్మాన్ (33) ఫర్వాలేదనిపించగా... అజహర్ అలీ (11), హరీస్ సోహైల్ (8), అసద్ షఫీక్ (5), కెప్టెన్ సర్ఫరాజ్ (8), షాదాబ్ ఖాన్ (4) విఫలమయ్యారు. అంతకుముందు 302/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 363 పరుగులకు ఆలౌటై 189 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. సంక్షిప్త స్కోర్లు: పాక్ తొలి ఇన్నింగ్స్: 174; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 363 (బట్లర్ 80, బెస్ 49; అష్రఫ్ 3/60), పాక్ రెండో ఇన్నింగ్స్: 134 (ఇమాముల్ హక్ 34; బ్రాడ్ 3/28, బెస్ 3/33). -
ఇంగ్లండ్ విజయం
లీస్టర్ (ఇంగ్లండ్): మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 107 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హీథెర్‌నైట్ (109 బంతుల్లో 106; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), నటాలీ సివెర్ (92 బంతుల్లో 137; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలు చేయడం విశేషం. వీరిద్దరూ మూడో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. అనంతరం పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ నిలిచే సమయానికి పాకిస్తాన్ 214 పరుగులు చేయాల్సింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది. -
బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ విజయం
-
గెలుపు ‘రూట్’ వేశాడు
-
గెలుపు ‘రూట్’ వేశాడు
♦ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ విజయం ♦ చెలరేగిన హేల్స్, మోర్గాన్ ♦ తమీమ్ శతకం వృథా ♦ చాంపియన్స్ ట్రోఫీ ఇటీవలి కాలంలో భీకర ఫామ్‌తో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టు తమ స్థాయికి తగ్గట్టుగానే చాంపియన్స్ ట్రోఫీని ఘనంగా ఆరంభించింది. అటు అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన బంగ్లాదేశ్ 300కు పైగా పరుగుల లక్ష్యం విధించినా రూట్ క్లాస్ శతకం.. హేల్స్, మోర్గాన్ మెరుపుల ముందువారి విన్యాసం చిన్నబోయింది. ఇంతలో ఎంత మార్పు... గత మంగళవారం ఇదే మైదానంలో భారత్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గట్టిగా వంద పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది. అయితే అసలు మ్యాచ్‌లో మాత్రం తమ బ్యాటింగ్ సత్తా ఏమిటో చాటుకుంది. తమీమ్ ఇక్బాల్ సూపర్ సెంచరీ, ముష్ఫిఖర్ మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించిన ఈ జట్టు ఓడినా కూడా తమను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే అనే హెచ్చరికను పంపినట్టయ్యింది. లండన్: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ పవర్‌హౌస్ ముందు బంగ్లాదేశ్ విధించిన 306 పరుగుల లక్ష్యం ఏమాత్రం సరిపోలేదు. జో రూట్ (129 బంతుల్లో 133 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ బాదగా అలెక్స్ హేల్స్ (86 బంతుల్లో 95; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్ (61 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించారు. ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తమీమ్ ఇక్బాల్ (142 బంతుల్లో 128; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సహాయంతో 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 305 పరుగులు చేసింది. ముష్ఫిఖర్ రహీమ్ (72 బంతుల్లో 79; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్లంకెట్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 2 వికెట్లకు 308 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు రూట్‌కు దక్కింది. తమీమ్ శతకం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు తమీమ్ ఇక్బాల్, ముష్ఫిఖర్ రహీమ్ మూలస్తంభంలా నిలిచారు. అయితే అంతకుముందు వీరి ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. తొలి పది ఓవర్లలో ఇంగ్లండ్ పేసర్లు పట్టు బిగించారు. దీంతో వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఐదో ఓవర్లో సౌమ్య సర్కార్ (34 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మరోవైపు తమీమ్ మాత్రం ఆచితూచి ఆడడంతో జట్టు తొలి పది ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. 11వ ఓవర్లో సౌమ్య సర్కార్ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదినా తర్వాతి ఓవర్లోనే స్టోక్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కైస్ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), ఇక్బాల్ వరుస బౌండరీలతో చెలరేగి స్కోరులో కదలిక తెచ్చారు. వేగంగా ఆడుతున్న క్రమంలో కైస్ 20వ ఓవర్లో ప్లంకెట్‌కు చిక్కాడు. ఈ దశలో ఇక్బాల్‌కు జతగా కలిసిన ముష్ఫిఖర్ సమయోచిత ఆటతీరుతో జట్టు భారీ స్కోరుకు కారణమయ్యారు. స్పిన్, పేస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే 32వ ఓవర్లో తమీమ్ ఫోర్ బాదడంతో సహనం నశించిన స్టోక్స్ స్లెడ్జింగ్‌కు దిగాడు. తమీమ్ కూడా స్పందించడంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అటు 48 బంతుల్లో ముష్ఫిఖర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... తమీమ్ ఇక్బాల్ 124 బంతుల్లో ఇంగ్లండ్‌పై రెండో శతకాన్ని నమోదు చేశాడు. కానీ 45వ ఓవర్లో ప్లంకెట్ వరుస బంతుల్లో వీరిద్దరిని పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చాడు. అప్పటికే మూడో వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యం జత చేరింది. ఉపఖండం ఆవల ఏ వికెట్‌కైనా వీరికిదే అత్యుత్తమ భాగస్వామ్యం. చివర్లో షబ్బీర్ రహమాన్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు) వేగంగా ఆడడంతో జట్టు 300కు పైగా పరుగులు సాధించింది. హేల్స్, రూట్ జోరు భారీ లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న జేసన్ రాయ్ (1)ను మోర్తజా అవుట్ చేశాడు. ఈ సంతోషం బంగ్లాకు ఎక్కువసేపు లేకుండా హేల్స్, రూట్ బ్యాటింగ్ సాగింది. ఎంతమంది బౌలర్లను మార్చినా వీరిద్దరి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. అడపాదడపా ఫోర్లు బాదుతూ తొలి పవర్‌ప్లేలో 51 పరుగులు సాధించారు. 13వ ఓవర్లో రూట్ రెండు ఫోర్లు బాదినా ఆ తర్వాత బంగ్లా ఐదు ఓవర్ల పాటు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక్క బౌండరీ మాత్రమే నమోదైంది. హేల్స్ 52 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. షకీబ్ వేసిన 22వ ఓవర్లో 4,6 బాదిన హేల్స్ సెంచరీ వైపు వేగంగా దూసుకెళ్లాడు. అయితే 28వ ఓవర్లో షబ్బీర్ రహమాన్ తన ఆశలపై నీళ్లు జల్లాడు. ఈ ఓవర్లోనూ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అనంతరం డీప్ మిడ్వికెట్లో దొరికిపోయాడు. కానీ రెండో వికెట్‌కు మాత్రం 159 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది.ఆ తర్వాత రూట్, మోర్గాన్ విజృంభణ కొనసాగింది. 36వ ఓవర్లో మోర్గాన్ క్యాచ్‌ను తమీమ్ పట్టినా రీప్లేలో నాటౌట్‌గా తేలింది. 45 బంతుల్లో మోర్గాన్ అర్ధ సెంచరీ పూర్తి చేయగా రూట్ 115 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. చివర్లో వీరిద్దరి బౌండరీల వర్షంతో లక్ష్యం సులువయ్యింది. మూడో వికెట్‌కు వీరి మధ్య అజేయంగా 143 పరుగులు జత చేరాయి. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 128; సౌమ్య సర్కార్ (సి) సబ్ బెయిర్‌స్టో (బి) స్టోక్స్ 28; కైస్ (సి) వుడ్ (బి) ప్లంకెట్ 19; ముష్ఫిఖర్ (సి) హేల్స్ (బి) ప్లంకెట్ 79; షకీబ్ (సి) స్టోక్స్ (బి) బాల్ 10; షబ్బీర్ (సి) రాయ్ (బి) ప్లంకెట్ 24; మహ్ముదుల్లా నాటౌట్ 6; మొసద్దెక్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో ఆరు వికెట్లకు) 305. వికెట్ల పతనం: 1–56, 2–95, 3–261, 4–261, 5–277, 6–300. బౌలింగ్: వోక్స్ 2–1–4–0; వుడ్ 10–1–58–0; బాల్ 10–1–82–1; స్టోక్స్ 7–0–42–1; ప్లంకెట్ 10–0–59–4; అలీ 8–1–40–0; రూట్ 3–0–18–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ముస్తఫిజుర్ (బి) మొర్తజా 1; హేల్స్ (సి) సబ్ సుంజముల్ (బి) షబ్బీర్ 95; రూట్ నాటౌట్ 133; మోర్గాన్ నాటౌట్ 75; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (47.2 ఓవర్లలో రెండు వికెట్లకు) 308. వికెట్ల పతనం: 1–6, 2–165. బౌలింగ్: మొర్తజా 10–0–56–1; షకీబ్ 8–0–62–0; ముస్తఫిజుర్ 9–0–51–0; సౌమ్య సర్కార్ 2–0–13–0; మొసద్దెక్ 7.2–0–47–0; రూబెల్ 10–0–64–0; షబ్బీర్ 1–0–13–1. చాంపియన్స్ ట్రోఫీలో ఇదే అత్యధిక పరుగుల (306) లక్ష్య ఛేదన చాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా గీ న్యూజిలాండ్ వేదిక: బర్మింగ్‌హామ్, గ్రూప్: ‘ఎ’, మధ్యాహ్నం గం. 3 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు
అహ్మదాబాద్: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 69-25తో విజయం సాధించింది. గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 65-25తో పోలాండ్‌ను ఓడించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో ఇరాన్‌తో కెన్యా; బంగ్లాదేశ్‌తో భారత్ తలపడతాయి. -
తొలి వన్డేలో ఇంగ్లండ్ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనను ఇంగ్లండ్ విజయంతో ప్రారంభించింది. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 21 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసింది. స్టోక్స్ (100 బంతుల్లో 101; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా... కెప్టెన్ బట్లర్ (63), డకెట్ (60) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్లలో మొర్తజా, షకీబ్, షఫీయుల్ రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ జట్టు 47.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటయి0ది.. ఓపెనర్ కేయస్ (119 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. షకీబ్ (55 బంతుల్లో 79; 10 ఫోర్లు, 1 సిక్సర్) సంచలన ఇన్నింగ్స ఆడాడు. కేయస్, షకీబ్ ఐదో వికెట్‌కు 92 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నంతసేపు బంగ్లా విజయం దిశగా సాగింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని 17 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీసి మ్యాచ్‌ను కాపాడుకున్నారు. కెరీర్లో తొలి వన్డే ఆడిన జేక్ బాల్ ఐదు వికెట్లతో చెలరేగిపోగా... రషీద్ నాలుగు వికెట్లు సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. -
ఇంగ్లండ్ ఘనవిజయం
పాక్‌తో మూడో టెస్టు బర్మింగ్‌హామ్: పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది. చివరి రోజు ఆదివారం 343 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 70.5 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. దీంతో 141 పరుగులతో ఇంగ్లండ్ నెగ్గి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది. సమీ అస్లాం (70), అజహర్ అలీ (38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అండర్సన్, బ్రాడ్, వోక్స్, ఫిన్, అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 129 ఓవర్లలో 6 వికెట్లకు 445 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.