బెయిర్‌స్టో, స్టోక్స్
ఇంగ్లండ్ విజయ లక్ష్యం 337 పరుగులు... తొలి వన్డేలో 14 ఓవర్లకే 135 పరుగులు సాధించి కూడా 318 పరుగులు చేయలేక ఓడిన జట్టు దీనిని ఏం ఛేదిస్తుందిలే అనిపించింది. కానీ ప్రపంచ చాంపియన్ అసాధారణ ప్రదర్శనతో దానిని తప్పుగా నిరూపించింది. భారత బౌలర్లపై విరుచుకుపడిన స్టోక్స్, బెయిర్‌స్టో ఒక్క దెబ్బతో మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేశారు. మరో 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యం చేరి ఇంగ్లండ్ సత్తా చాటింది. అంతకుముందు రాహుల్ సెంచరీ... పంత్ మెరుపులు, కోహ్లి అర్ధ సెంచరీతో భారీ స్కోరు సాధించి విజయంపై ధీమాగా కనిపించిన టీమిండియా చివరకు చేతులెత్తేయడంతో... ఆదివారం జరిగే తుది పోరులోనే సిరీస్ విజేత ఎవరో తేలనుంది.
పుణే: భారత్‌తో వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 1–1తో సమం చేసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... రిషభ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 4 వికెట్లకు 337 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకం సాధించగా... స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు), జేసన్ రాయ్ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. చివరి వన్డే రేపు ఇక్కడే జరుగుతుంది.
పంత్ దూకుడు...
గత మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్ (4), రోహిత్ శర్మ (25) ఈసారి తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే రెండో వికెట్‌కు కోహ్లితో 121 పరుగులు, మూడో వికెట్‌కు పంత్‌తో 113 పరుగులు జోడించి రాహుల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 35 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను బట్లర్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. కోహ్లి అవుటయ్యాక వచ్చిన పంత్ సిక్సర్లతో విరుచుకుపడి ఒక్కసారిగా మ్యాచ్ స్వభావాన్ని మార్చేశాడు. 40 ఓవర్లు ముగిసేసరికి 210 పరుగుల వద్ద ఉన్న భారత్ చివరి 10 ఓవర్లలో ఏకంగా 126 పరుగులు చేయడం విశేషం. పంత్ 28 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకోగా, రాహుల్ 108 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 35; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులతో భారత్ భారీ స్కోరు సాధించింది.
రాహుల్, పంత్
భారీ భాగస్వామ్యాలు...
ఇంగ్లండ్‌కు మరోసారి అదిరే ఆరంభం లభించింది. తొమ్మిది బంతుల వ్యవధిలో ఐదు ఫోర్లు బాదిన రాయ్... కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, శార్దుల్ ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతో భాగస్వామ్యం 100 దాటింది. సమన్వయలోపంతో రాయ్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 45 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న బెయిర్‌స్టో ఆ తర్వాత మరింత వేగంగా పరుగులు రాబట్టాడు. గత మ్యాచ్‌లో సెంచరీ కోల్పోయిన అతను ఈసారి 95 బంతుల్లో శతకం అందుకోవడం విశేషం. విజయానికి చేరువవుతున్న తరుణంలో 2 పరుగుల వ్యవధిలో స్టోక్స్, బెయిర్‌స్టోతో పాటు బట్లర్ (0) కూడా అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే తొలి మ్యాచ్ ఆడిన లివింగ్‌స్టోన్ (27 నాటౌట్) వేగంగా ఆడి పని పూర్తి చేశాడు.
పాపం కుల్దీప్...
చైనామన్ బౌలర్ కుల్దీప్‌కు శుక్రవారం ఏమాత్రం కలిసి రాలేదు. స్టోక్స్, బెయిర్‌స్టో జోరుకు అతను బలయ్యాడు. భారీగా పరుగులు ఇచ్చిన ఒత్తిడిలో తన ఫీల్డింగ్ వైఫల్యాలు అతడిని మరింత బాధపడేలా చేశాయి. తన తొలి 6 ఓవర్లలో 32 పరుగులిచ్చి మెరుగ్గానే కనిపించిన కుల్దీప్ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 8, 17, 20, 7 (మొత్తం 52) చొప్పున పరుగులిచ్చి బిక్కమొహం వేశాడు.
అదరగొట్టాడు...
భారత పర్యటనలో స్టోక్స్ నుంచి అతని స్థాయి ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో అతను తన విలువేంటో చూపించాడు. తొలి బంతి నుంచే చెలరేగిన స్టోక్స్‌ను నిలువరించ డం భారత బౌలర్లవల్ల కాలేదు. తొలి మూడు సిక్సర్లు కృనాల్ బౌలింగ్‌లోనే కొట్టిన అతను 32 పరుగుల వద్ద రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. అనంతరం దూకుడు పెంచి కుల్దీప్ ఓవర్లో 6, 4 బాది 40 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత స్టోక్స్ కొట్టిన షాట్లు భారత్ గెలిచే అవకాశాలను దూరం చేశాయి. అర్ధసెంచరీ తర్వాత తాను ఆడిన 11 బంతుల్లో స్టోక్స్ వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 (మొత్తం 49) బాదడం విశేషం. ముఖ్యంగా కుల్దీప్ ఓవ ర్లో కొట్టిన మూడు వరుస సిక్సర్లు, కృనాల్ ఓవర్లో కొట్టిన 3 సిక్స్ లు, 1 ఫోర్ స్టోక్స్ ఎంత ప్రమాదకారినో చూపించాయి. దురదృష్టవశాత్తు భువీ బౌలింగ్‌లో పుల్‌కు ప్రయత్నించి సెంచరీ చేజార్చుకున్నా ...ఈ ఇన్నింగ్స్ విలువ వందకంటే ఎక్కువే!
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) స్యామ్ కరన్ 25; ధావన్ (సి) స్టోక్స్ (బి) టాప్లీ 4; కోహ్లి (సి) బట్లర్ (బి) రషీద్ 66; రాహుల్ (సి) టాప్లీ (బి) టామ్ కరన్ 108; పంత్ (సి) రాయ్ (బి) టామ్ కరన్ 77; హార్దిక్ పాండ్యా (సి) రాయ్ (బి) టాప్లీ 35; కృనాల్ (నాటౌట్) 12; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 336.
వికెట్ల పతనం: 1–9, 2–37, 3–158, 4–271, 5–308, 6–334.
బౌలింగ్: స్యామ్ కరన్ 7–0–47–1, టాప్లీ 8–0–50–2, టామ్ కరన్ 10–0–83–2, బెన్ స్టోక్స్ 5–0–42–0, మొయిన్ అలీ 10–0–47–0, రషీద్ 10–0–65–1.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (రనౌట్) 55; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 124; బెన్ స్టోక్స్ (సి) పంత్ (బి) భువనేశ్వర్ 99; డేవిడ్ మలాన్ (నాటౌట్) 16; బట్లర్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (43.3 ఓవర్లలో 4 వికెట్లకు) 337.
వికెట్ల పతనం: 1–110, 2–285, 3–287, 4–287.
బౌలింగ్: భువనేశ్వర్ 10–0–63–1, ప్రసిధ్ కృష్ణ 10–0–58–2, శార్దుల్ ఠాకూర్ 7.3–0–54–0, కుల్దీప్ యాదవ్ 10–0–84–0, కృనాల్ పాండ్యా 6–0–72–0.
Comments
Please login to add a commentAdd a comment