గెలుపు ‘రూట్’ వేశాడు
♦ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ విజయం
♦ చెలరేగిన హేల్స్, మోర్గాన్
♦ తమీమ్ శతకం వృథా
♦ చాంపియన్స్ ట్రోఫీ
ఇటీవలి కాలంలో భీకర ఫామ్‌తో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టు తమ స్థాయికి తగ్గట్టుగానే చాంపియన్స్ ట్రోఫీని ఘనంగా ఆరంభించింది. అటు అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన బంగ్లాదేశ్ 300కు పైగా పరుగుల లక్ష్యం విధించినా రూట్ క్లాస్ శతకం.. హేల్స్, మోర్గాన్ మెరుపుల ముందువారి విన్యాసం చిన్నబోయింది.
ఇంతలో ఎంత మార్పు... గత మంగళవారం ఇదే మైదానంలో భారత్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గట్టిగా వంద పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది. అయితే అసలు మ్యాచ్‌లో మాత్రం తమ బ్యాటింగ్ సత్తా ఏమిటో చాటుకుంది. తమీమ్ ఇక్బాల్ సూపర్ సెంచరీ, ముష్ఫిఖర్ మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించిన ఈ జట్టు ఓడినా కూడా తమను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే అనే హెచ్చరికను పంపినట్టయ్యింది.
లండన్: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ పవర్‌హౌస్ ముందు బంగ్లాదేశ్ విధించిన 306 పరుగుల లక్ష్యం ఏమాత్రం సరిపోలేదు. జో రూట్ (129 బంతుల్లో 133 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ బాదగా అలెక్స్ హేల్స్ (86 బంతుల్లో 95; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్ (61 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించారు. ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తమీమ్ ఇక్బాల్ (142 బంతుల్లో 128; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సహాయంతో 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 305 పరుగులు చేసింది. ముష్ఫిఖర్ రహీమ్ (72 బంతుల్లో 79; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్లంకెట్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 2 వికెట్లకు 308 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు రూట్‌కు దక్కింది.
తమీమ్ శతకం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు తమీమ్ ఇక్బాల్, ముష్ఫిఖర్ రహీమ్ మూలస్తంభంలా నిలిచారు. అయితే అంతకుముందు వీరి ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. తొలి పది ఓవర్లలో ఇంగ్లండ్ పేసర్లు పట్టు బిగించారు. దీంతో వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఐదో ఓవర్‌లో సౌమ్య సర్కార్ (34 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మరోవైపు తమీమ్ మాత్రం ఆచితూచి ఆడడంతో జట్టు తొలి పది ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేయగలిగింది.
11వ ఓవర్‌లో సౌమ్య సర్కార్ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదినా తర్వాతి ఓవర్‌లోనే స్టోక్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కైస్ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), ఇక్బాల్ వరుస బౌండరీలతో చెలరేగి స్కోరులో కదలిక తెచ్చారు. వేగంగా ఆడుతున్న క్రమంలో కైస్ 20వ ఓవర్‌లో ప్లంకెట్‌కు చిక్కాడు. ఈ దశలో ఇక్బాల్‌కు జతగా కలిసిన ముష్ఫిఖర్ సమయోచిత ఆటతీరుతో జట్టు భారీ స్కోరుకు కారణమయ్యారు.
స్పిన్, పేస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే 32వ ఓవర్‌లో తమీమ్ ఫోర్ బాదడంతో సహనం నశించిన స్టోక్స్ స్లెడ్జింగ్‌కు దిగాడు. తమీమ్ కూడా స్పందించడంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అటు 48 బంతుల్లో ముష్ఫిఖర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... తమీమ్ ఇక్బాల్ 124 బంతుల్లో ఇంగ్లండ్‌పై రెండో శతకాన్ని నమోదు చేశాడు. కానీ 45వ ఓవర్‌లో ప్లంకెట్ వరుస బంతుల్లో వీరిద్దరిని పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చాడు. అప్పటికే మూడో వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యం జత చేరింది. ఉపఖండం ఆవల ఏ వికెట్‌కైనా వీరికిదే అత్యుత్తమ భాగస్వామ్యం. చివర్లో షబ్బీర్ రహమాన్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు) వేగంగా ఆడడంతో జట్టు 300కు పైగా పరుగులు సాధించింది.
హేల్స్, రూట్ జోరు
భారీ లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న జేసన్ రాయ్ (1)ను మోర్తజా అవుట్ చేశాడు. ఈ సంతోషం బంగ్లాకు ఎక్కువసేపు లేకుండా హేల్స్, రూట్ బ్యాటింగ్ సాగింది. ఎంతమంది బౌలర్లను మార్చినా వీరిద్దరి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. అడపాదడపా ఫోర్లు బాదుతూ తొలి పవర్‌ప్లేలో 51 పరుగులు సాధించారు. 13వ ఓవర్‌లో రూట్ రెండు ఫోర్లు బాదినా ఆ తర్వాత బంగ్లా ఐదు ఓవర్ల పాటు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక్క బౌండరీ మాత్రమే నమోదైంది.
హేల్స్ 52 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. షకీబ్ వేసిన 22వ ఓవర్‌లో 4,6 బాదిన హేల్స్ సెంచరీ వైపు వేగంగా దూసుకెళ్లాడు. అయితే 28వ ఓవర్‌లో షబ్బీర్ రహమాన్ తన ఆశలపై నీళ్లు జల్లాడు. ఈ ఓవర్‌లోనూ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అనంతరం డీప్ మిడ్‌వికెట్‌లో దొరికిపోయాడు. కానీ రెండో వికెట్‌కు మాత్రం 159 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది.ఆ తర్వాత రూట్, మోర్గాన్ విజృంభణ కొనసాగింది. 36వ ఓవర్‌లో మోర్గాన్ క్యాచ్‌ను తమీమ్ పట్టినా రీప్లేలో నాటౌట్‌గా తేలింది. 45 బంతుల్లో మోర్గాన్ అర్ధ సెంచరీ పూర్తి చేయగా రూట్ 115 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. చివర్లో వీరిద్దరి బౌండరీల వర్షంతో లక్ష్యం సులువయ్యింది. మూడో వికెట్‌కు వీరి మధ్య అజేయంగా 143 పరుగులు జత చేరాయి.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 128; సౌమ్య సర్కార్ (సి) సబ్ బెయిర్‌స్టో (బి) స్టోక్స్ 28; కైస్ (సి) వుడ్ (బి) ప్లంకెట్ 19; ముష్ఫిఖర్ (సి) హేల్స్ (బి) ప్లంకెట్ 79; షకీబ్ (సి) స్టోక్స్ (బి) బాల్ 10; షబ్బీర్ (సి) రాయ్ (బి) ప్లంకెట్ 24; మహ్ముదుల్లా నాటౌట్ 6; మొసద్దెక్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో ఆరు వికెట్లకు) 305.
వికెట్ల పతనం: 1–56, 2–95, 3–261, 4–261, 5–277, 6–300.
బౌలింగ్: వోక్స్ 2–1–4–0; వుడ్ 10–1–58–0; బాల్ 10–1–82–1; స్టోక్స్ 7–0–42–1; ప్లంకెట్ 10–0–59–4; అలీ 8–1–40–0; రూట్ 3–0–18–0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ముస్తఫిజుర్ (బి) మొర్తజా 1; హేల్స్ (సి) సబ్ సుంజముల్ (బి) షబ్బీర్ 95; రూట్ నాటౌట్ 133; మోర్గాన్ నాటౌట్ 75; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (47.2 ఓవర్లలో రెండు వికెట్లకు) 308.
వికెట్ల పతనం: 1–6, 2–165.
బౌలింగ్: మొర్తజా 10–0–56–1; షకీబ్ 8–0–62–0; ముస్తఫిజుర్ 9–0–51–0; సౌమ్య సర్కార్ 2–0–13–0; మొసద్దెక్ 7.2–0–47–0; రూబెల్ 10–0–64–0; షబ్బీర్ 1–0–13–1.
చాంపియన్స్ ట్రోఫీలో ఇదే అత్యధిక పరుగుల (306) లక్ష్య ఛేదన
చాంపియన్స్ ట్రోఫీలో నేడు
ఆస్ట్రేలియా గీ న్యూజిలాండ్
వేదిక: బర్మింగ్‌హామ్, గ్రూప్: ‘ఎ’, మధ్యాహ్నం గం. 3 నుంచి
స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం