
న్యూజిలాండ్‌కు వరుసగా రెండో విజయం
5 వికెట్లతో బంగ్లాదేశ్ ఓటమి
బ్రేస్‌వెల్‌కు 4 వికెట్లు, రచిన్ సెంచరీ
చాంపియన్స్ ట్రోఫీ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ అవుట్
బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్ ఓవర్లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టిన కివీస్ బ్యాటర్ బ్రేస్‌వెల్... ఈ షాట్‌తో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సమీకరణం తేలిపోయింది. ఈ బౌండరీతో న్యూజిలాండ్, భారత్ అధికారికంగా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టయిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్ కథ కూడా లీగ్ దశలోనే ముగిసింది. నిష్క్రమించిన రెండు జట్లు ప్రాధాన్యత లేని పోరులో గురువారం తలపడనుండగా... సెమీస్‌కు ముందు సన్నాహకంగా ఆదివారం కివీస్‌ను భారత్ ఎదుర్కోనుంది.
కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో విఫలమైన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ తరహాలోనే పేలవ బ్యాటింగ్‌తో దాదాపు అదే స్కోరు సాధించగా... మరో 23 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. విరామం లేకుండా వరుసగా 10 ఓవర్లు వేసిన ఆఫ్‌స్పిన్నర్ బ్రేస్‌వెల్ నాలుగు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టగా... బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. గత చాంపియన్స్ ట్రోఫీలో తమను ఓడించి సెమీఫైనల్ చేరిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడు కివీస్ అదే తరహాలో 5 వికెట్లతో ఓడించి సెమీస్ చేరడం విశేషం.
రావల్పిండి: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో విజయంతో మాజీ విజేత న్యూజిలాండ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇదే గ్రూప్‌లో రెండు విజయాలు సాధించిన భారత్ కూడా కివీస్‌తో పాటు సెమీస్ చేరింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.
కెప్టెన్ నజ్ముల్ హుసేన్ (110 బంతుల్లో 77; 9 ఫోర్లు), జాకీర్ అలీ (55 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రేస్‌వెల్ (4/26) నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు సాధించి గెలిచింది. రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 112; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో సత్తా చాటగా... లాథమ్ (76 బంతుల్లో 55; 3 ఫోర్లు) రాణించాడు.
నజ్ముల్ అర్ధసెంచరీ...
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తన్‌జీద్ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), నజ్ముల్ ధాటిగా మొదలు పెట్టారు. తన్‌జీద్ రెండు సిక్స్‌లు బాదగా, జేమీసన్ ఓవర్లో నజ్ముల్ 3 ఫోర్లు కొట్టాడు. అయితే 9వ ఓవర్లోనే స్పిన్ బౌలింగ్‌ను మొదలు పెట్టిన కివీస్ ఫలితం సాధించింది. బ్రేస్‌వెల్ తొలి ఓవర్లోనే తన్‌జీద్ వికెట్ తీసి పతనానికి శ్రీకారం చుట్టగా... మిరాజ్ (13) మరోసారి విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత బ్రేస్‌వెల్ మళ్లీ బంగ్లాను దెబ్బ కొట్టాడు.
21 పరుగుల వ్యవధిలో బంగ్లా తౌహీద్ (7), ముషి్ఫకర్ (2), మహ్మదుల్లా (4) వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ బ్రేస్‌వెల్ ఖాతాలోకే చేరాయి. ఈ దశలో నజ్ముల్, జాకీర్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. 71 బంతుల్లో నజ్ముల్ అర్ధ సెంచరీ పూర్తయింది. నజ్ముల్‌ను అవుట్ చేసి రూర్కే ఈ జోడీని విడదీయగా... బంగ్లా మిగిలిన వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. బంగ్లా ఇన్నింగ్స్‌లో డాట్ బాల్స్ ఏకంగా 178 ఉన్నాయి.
శతక భాగస్వామ్యం...
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే యంగ్ (0) అవుట్ కాగా, కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ (5) కూడా వెనుదిరిగాడు. కాన్వే, రచిన్ కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత కాన్వే పెవిలియన్ చేరాడు. అయితే రచిన్, లాథమ్‌ల భారీ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. ఈ ద్వయాన్ని విడదీసేందుకు బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో 95 బంతుల్లోనే రచిన్ కెరీర్‌లో నాలుగో సెంచరీని అందుకున్నాడు. లాథమ్ కూడా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎట్టకేలకు విజయానికి 36 పరుగుల దూరంలో రచిన్‌ను బంగ్లా అవుట్ చేయగా, కొద్ది సేపటికే లాథమ్ కూడా నిష్క్రమించాడు. అయితే ఫిలిప్స్ (21 నాటౌట్), బ్రేస్‌వెల్ (11 నాటౌట్) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్‌జీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్‌వెల్ 24; నజ్ముల్ (సి) బ్రేస్‌వెల్ (బి) రూర్కే 77; మిరాజ్ (సి) సాంట్నర్ (బి) రూర్కే 13; తౌహీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్‌వెల్ 7; ముషి్ఫకర్ (సి) రచిన్ (బి) బ్రేస్‌వెల్ 2; మహ్ముదుల్లా (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 4; జాకీర్ (రనౌట్) 45; రిషాద్ (సి) సాంట్నర్ (బి) హెన్రీ 26; తస్కీన్ (సి) కాన్వే (బి) జేమీసన్ 10; ముస్తఫిజుర్ (నాటౌట్) 3; నాహిద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 236.
వికెట్ల పతనం: 1–45, 2–64, 3–97, 4–106, 5–118, 6–163, 7–196, 8–231, 9– 236. బౌలింగ్: హెన్రీ 9–0–57–1, జేమీసన్ 9–1– 48–1, బ్రేస్‌వెల్ 10–0–26–4, రూర్కే 10–1– 48– 2, సాంట్నర్ 10–1–44–0, ఫిలిప్స్ 2–0– 10–0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (బి) తస్కీన్ 0; కాన్వే (బి) ముస్తఫిజుర్ 30; విలియమ్సన్ (సి) ముష్ఫికర్ (బి) నాహిద్ 5; రచిన్ (సి) (సబ్) పర్వేజ్ (బి) రిషాద్ 112; లాథమ్ (రనౌట్) 55; ఫిలిప్స్ (నాటౌట్) 21; బ్రేస్‌వెల్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 240.
వికెట్ల పతనం: 1–0, 2–15, 3–72, 4–201, 5–214. బౌలింగ్: తస్కీన్ 7–2–28–1, నాహిద్ 9–0–43–1, మిరాజ్ 10–0–53–0, ముస్తఫిజుర్ 10–0–42–1, రిషాద్ 9.1–0–58–1, నజ్ముల్ 1–0–12–0.
చాంపియన్స్ ట్రోఫీలో నేడు
ఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికా
మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment