సెమీస్‌ లక్ష్యంగా... | New Zealand to face Bangladesh today in Champions Trophy | Sakshi
Sakshi News home page

సెమీస్‌ లక్ష్యంగా...

Published Mon, Feb 24 2025 4:22 AM | Last Updated on Mon, Feb 24 2025 4:22 AM

New Zealand to face Bangladesh today in Champions Trophy

బంగ్లాదేశ్‌తో నేడు న్యూజిలాండ్‌ పోరు 

మధ్యాహ్నం గం.2:30 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్‌’, జియో హాట్‌స్టార్‌లలో ప్రసారం  

 

రావల్పిండి: టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్‌ వరుస విజయాలతో సెమీఫైనల్‌ చేరాలని భావిస్తుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగే పోరులో గెలిచి నాకౌట్‌కు అర్హత పొందాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. సోమవారం గ్రూప్‌ ‘ఎ’లో జరిగే ఈ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌కు చావోరేవో కానుంది. భారత్‌ చేతిలో తొలి మ్యాచ్‌ ఓడిన నజు్మల్‌ హుస్సేన్‌ బృందం నెట్‌ రన్‌రేట్‌లోనూ మైనస్‌లోకి పడిపోయింది. ఇప్పుడు ఇదీ ఓడితే ఇంటిదారి పట్టడం మినహా ఇంకో దారే ఉండదు. 

అయితే పటిష్టమైన కివీస్‌ను ఓడించడం అంత సులభం కాదు. చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాక్‌లో సన్నాహకంగా జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో టైటిల్‌ సాధించిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండ్‌ సామర్థ్యంతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లాంటి జట్టుపై గెలుపొందడం, సెమీఫైనల్‌కు చేరడం కివీస్‌కు కష్టమైతే కాదు. అయితే మ్యాచ్‌పై ఏ బెంగా లేని న్యూజిలాండ్‌ తుదిజట్టు కసరత్తుపైనే తర్జనభర్జన పడుతోంది. తలకు అయిన స్వల్పగాయం నుంచి రచిన్‌ రవీంద్ర కోలుకోవడంతో కివీస్‌కు డాషింగ్‌ ఓపెనర్‌ అందుబాటులో వచ్చాడు.

గత మ్యాచ్‌లో కాన్వే, విల్‌ యంగ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించగా, ఇప్పుడు విల్‌ యంగ్‌ను తప్పించే అవకాశముంది. ఇదే జరిగితే లెఫ్ట్‌–రైట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ అటకెక్కుతుంది. ఫామ్‌లో ఉన్న కాన్వేతో రవీంద్ర ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌ తీవ్ర ఒత్తిడిలో మరో గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొననుండటం పెద్ద సవాల్‌గా మారింది. 

గత మ్యాచ్‌లో భారత్‌ను బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టిన నజు్మల్‌ బృందం బ్యాటింగ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకుంటే మ్యాచ్‌లో ప్రత్యరి్థకి గట్టిపోటీ ఇచ్చే అవకాశముంటుంది. లేదంటే ఇంకో మ్యాచ్‌ (పాక్‌తో) ఉండగానే గ్రూప్‌ దశలోనే వెనుదిరగడం ఖాయమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement