కూనలనుకుంటే.. కొంప ముంచారు!
కార్డిఫ్: పటిష్టమైన న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో చావు దెబ్బ తిన్నది. తమదే ఆధిక్యమని బంగ్లాను పసి కూనలుగా భావించి.. కాస్త నిర్లక్ష్యంగా ఆడి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది కివీస్. ఇదివరకే జరిగిన రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి ఒక పాయింట్‌తో తృప్తి పడింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోయిన కివీస్, చావోరేవో తేల్చుకోవాల్సిన బంగ్లాతో మ్యాచ్‌లోనూ ఓడి ఈ చాంపియన్స్ ట్రోఫీలో ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా అపవాదు మూటకట్టుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. రాస్ టేలర్ (82 బంతుల్లో 63; 6 ఫోర్లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (69 బంతుల్లో 57; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ఓ దశలో 38 ఓవర్లలో 200/3తో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ అలవోకగా 300 స్కోరు దాటిస్తుందని భావించారు. కానీ కివీస్ నిర్లక్ష్యపు బ్యాటింగ్ తో తొలుత భారీ మూల్యం చెల్లించుకుంది. బంగ్లా బౌలర్ మొసద్దిక్ హస్సేన్ వారి ఆటలు సాగనివ్వలేదు. 39వ ఓవర్లో టస్కీన్ అహ్మద్ బౌలింగ్‌లో ముస్తాఫిజర్ పట్టిన క్యాచ్‌తో టేలర్ వెనుదిరిగాడు. ఆపై మొసద్దిక్ హస్సేన్ వరుస విరామాల్లో బ్రూమ్, అండర్సన్ డకౌట్, నీశమ్ వికెట్లు తీసి కివీస్ పరుగులకు అడ్డుకట్ట వేశాడు. దీంతో బంగ్లా ముందు 266 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు. బంగ్లా బౌలర్ తస్కీన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి.
266 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లలో భీకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయిన ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను కివీస్ బౌలర్ సౌతీ డకౌట్ చేశాడు. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో షబ్బీర్ (8), సౌమ్య సర్కార్ (3)లను కూడా పెవిలియన్‌కు చేర్చి కివీస్ శిబిరంలో సంతోషం నింపాడు. ముష్ఫిఖర్ (14) అవుట్ కావడంతో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా ఓటమి ఖాయమని కివీస్ భావించిన కివీస్ సహజధోరణిని పక్కనపెట్టి.. సాధారణ ఆటను ప్రదర్శించింది.
దీంతో బంగ్లా ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్ (115 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్), మహ్ముదుల్లా (107 బంతుల్లో 102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకాలతో ఐదో వికెట్‌కు 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. చివర్లో షకీబ్ ఔటైనా మొసద్దిక్(7) సాయంతో మహ్మదుల్లా 47.2 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చాడు. పోరాటపటిమను ప్రదర్శించిన బంగ్లాకు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. నేడు (శనివారం) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆస్టేలియా ఓడితే బంగ్లా సెమీస్‌కు చేరుకుంటుంది.