
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 27) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ కూడా పడలేదు. ప్రస్తుత ఎడిషన్‌లో వర్షం కారణంగా రద్దైన రెండో మ్యాచ్ ఇది. ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఇలాగే టాస్ కూడా పడకుండా రద్దైంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ గ్రూప్-ఏలో భాగంగా జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్. ఈ గ్రూప్ నుంచి ఈ రెండు జట్లు ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడాయి. ఆతిథ్య దేశ హోదాలో నేటి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావించింది.
అయితే వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పాక్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పాక్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్ కలిగిన బంగ్లాదేశ్ మూడో స్థానంలో ముగించింది. టోర్నీ ప్రారంభానికి ముందు పాక్‌లాగే బీరాలు పలికి బంగ్లాదేశ్ కూడా ఒక్క విజయం కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్-ఏలో చివరి మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగానే సాగనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్‌లో జరుగనుంది.
గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్‌లు ఖరారైనా.. గ్రూప్-బిలో పోటీ మాత్రం రసవత్తరంగా సాగుతుంది. నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో ఈ గ్రూప్ నుంచి సెమీస్ రేసు రంజుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రెండు సెమీస్ బెర్త్‌ల కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి.
సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో మ్యాచ్ గెలవగా.. ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చెరి 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌పై గెలుపు.. అంతకుముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
రేపు ఆఫ్ఘనిస్తాన్ లాహోర్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది. రెండో బెర్త్ మార్చి 1న జరిగే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే రెండో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment