వీరి ఆట ఎంతవరకు?
► అంచనాలు లేని మూడు ఉప ఖండపు జట్లు
► లీగ్ దశ దాటడం కష్టమే!
► రేపటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లలో బలాబలాల పరంగా చూస్తే ఐదు టీమ్‌లకు కూడా టోర్నీని నెగ్గే సత్తా ఉంది. అయితే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల విషయంలో మాత్రం అలా చెప్పలేని పరిస్థితి. ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగలిగే స్టార్ ఆటగాళ్ల కొరత... ప్రతికూల పరిస్థితులు... వన్డేల్లో ఇటీవలి రికార్డు దీనికి కారణం. ఒక అద్భుతాన్ని ప్రదర్శించో, ఒక సంచలనం సృష్టించో వీరు ముందంజ వేయగలరా అనేది చూడాలి. –సాక్షి క్రీడావిభాగం
బంగ్లాదేశ్
‘మా జట్టుకు కాస్త మర్యాద ఇవ్వండి. దానిని పొందే అర్హత మాకుంది’... ఇటీవలి సంచలన ప్రదర్శన తర్వాత బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్య ఇది. అయితే భారత్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటతీరు చూస్తే ఐసీసీ టోర్నీలలో బంగ్లాదేశ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడేళ్లలో చాలా భాగం 9వ ర్యాంక్‌లోనే ఉన్న బంగ్లా, తాజా విజయాలతో ఆరో ర్యాంక్‌కు చేరుకుంది. కానీ ఈ టోర్నీలో మాత్రం కఠినమైన గ్రూప్‌లో ఆ జట్టు ఆసీస్, ఇంగ్లండ్, కివీస్‌లను అధిగమించడం చాలా కష్టం. రెండు సార్లు చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన బంగ్లా 8 మ్యాచ్‌లలో 1 గెలిచి 7 ఓడింది.
బలం: ఎప్పటిలాగే తమీమ్, ముష్ఫికర్, షకీబ్‌ల బ్యాటింగే ఆ జట్టును గట్టెక్కించగలదు. అయితే భారత్‌తో మాత్రం ఆ జట్టు బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది.
బలహీనత: చాలా ఉన్నాయి. సభ్యులలో చాలా మందికి ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం లేదు. కెప్టెన్ మష్రఫె మొర్తజా, తస్కీన్ ఇటీవల పెద్దగా రాణించడం లేదు. కీలక సమయాల్లో పట్టుదలగా నిలబడకుండా కుప్పకూలిపోయే బలహీనత జట్టుకు ఉందని గతంలో చాలాసార్లు రుజువైంది.
శ్రీలంక
ఒకప్పుడు విశ్వ విజేతగా నిలిచి చాంపియన్స్ ట్రోఫీలో కూడా తమదైన ముద్ర వేసిన శ్రీలంక జట్టు ఇటీవల ప్రదర్శన చాలా తీసికట్టుగా ఉంది. 2013లో ఈ టోర్నీలో సెమీస్ వరకు వచ్చిన లంక, ఆ తర్వాత ఒక్క టోర్నీలో కూడా చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. విండీస్, ఐర్లాండ్, జింబాబ్వే మినహా ఒక్క పెద్ద జట్టుపై కూడా గత రెండేళ్లలో లంక సిరీస్ గెలవలేదు.
సొంతగడ్డపైనే పాక్ చేతిలో కూడా ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో మిగిలిన 7 జట్లపై మొత్తం 18 మ్యాచ్‌లలో గెలిచి 36 ఓడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ టోర్నీలో లీగ్ దశలో తలపడబోయే దక్షిణాఫ్రికా చేతిలో ఇటీవలే 0–5తో లంక ఓడింది. ఇక రెండో ప్రత్యర్థి భారత్ చేతిలోనైతే గత 15 మ్యాచ్‌లలో 12 ఓడింది. ఇలాంటి స్థితిలో లంక గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.
బలం: టాప్‌ఆర్డర్‌లో కుషాల్ మెండిస్, ఉపుల్ తరంగ బ్యాటింగ్‌తో పాటు అనుభవజ్ఞులు కెప్టెన్ మాథ్యూస్, చండీమల్ బ్యాటింగ్‌పై జట్టు ప్రధానంగా ఆధార పడుతోంది.
బలహీనతలు: పెద్దగా పదును లేని పేస్ బౌలింగ్‌తో ఆ జట్టు బరిలోకి దిగుతోంది. ఇటీవలి కాలంలో ఫీల్డింగ్ వైఫల్యంతోనే ఆ జట్టు అనేక మ్యాచ్‌లు కోల్పోయింది.
పాకిస్తాన్
వన్డే వరల్డ్ కప్, టి20 ప్రపంచ కప్ కూడా గెలిచిన పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. మూడు సార్లు సెమీస్ చేరడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న పాక్, అదృష్టవశాత్తూ చివర్లో ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2013 టోర్నీలోనైతే ఘోరమైన ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌లలో కూడా పరాజయం ఎదుర్కొంది. వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంలో పాక్ ఇటీవల విండీస్‌తో సిరీస్ నెగ్గినా... అదేమీ గొప్ప ప్రదర్శన కాదు. చాంపియన్స్ ట్రోఫీలో 18 మ్యాచ్‌లు ఆడిన పాక్ 7 గెలిచి, 11 ఓడింది.
బలం: ఇంగ్లండ్ పరిస్థితుల్లో పాక్ పేస్ బౌలర్లే ఆ జట్టుకు బలం. స్వింగ్‌ను రాబట్టి చెలరేగగలిగితే ఆమిర్, జునైద్, రియాజ్ ఎలాంటి జట్టుకైనా ఇబ్బందులు సృష్టించగలరు. షోయబ్ మాలిక్ 2002నుంచి వరుసగా ఆరో చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నాడు.
బలహీనత: వన్డే క్రికెట్‌లో వచ్చిన మార్పులు, వేగానికి అనుగుణంగా మారడంలో పాకిస్తాన్ జట్టు ఇప్పటికీ విఫలమవుతోంది. టీమ్‌లో ఒక్క పవర్ హిట్టర్ కూడా లేడు.