వచ్చే ఏడాది (2025) పాకిస్తాన్‌లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా భారత్ ఈ టోర్నీని బాయ్‌కాట్ చేసే అవకాశం ఉంది.
ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తే తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహించాలని (హైబ్రిడ్ విధానం) ఐసీసీని కోరవచ్చు. అయితే ఈ ప్రతిపాదనకు పాక్ ససేమిరా ఒప్పుకోదు. ఇదివరకే ఓసారి (ఆసియా కప్ 2023) భారత్ ఒత్తిడికి తలొగ్గి హైబ్రిడ్ విధానానికి ఒప్పుకున్న పాక్ ఈ సారి ఖచ్చితంగా నో చెప్పవచ్చు. ఇదే జరిగితే భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటుంది.
మెగా టోర్నీ నుంచి టీమిండియా డ్రాప్ అయిన పక్షంలో ఆ స్థానానికి శ్రీలంక అర్హత సాధిస్తుంది. పూర్ ర్యాంకింగ్ (ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవ్వాలంటే కటాఫ్ తేదీలోపు ర్యాంకింగ్స్‌లో టాప్-8 జట్లలో ఒకటిగా ఉండాలి) కారణంగా శ్రీలంక ఈ టోర్నీకి అర్హత సాధించలేదు.
కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీకి ఆతిథ్య దేశ హోదాలో పాక్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment