
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంతమైన బైసారన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్‌పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.
పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్ మే 25 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది.
ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్‌కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫైసలాబాద్, లాహోర్ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్‌లో జరుగనుండగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మే 21న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. ఫైసలాబాద్‌లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది.
ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. తాజాగా పాక్‌కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది.